"తెలుగు శాఖ, స్నాతకోత్తర కేంద్రం గద్వాల, పాలమూరు విశ్వవిద్యాలయంలో నేను బోధించే సిలబస్, సిలబస్ లోని పాఠ్యాంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారం ప్రతిబింబించే వేదిక."
 నన్నయ కవితారీతులు

1. ఉపోద్ఘాతము:

ఆది కవి నన్నయ. రాజమహేంద్రపుర నివాసి. పద్య విద్యకు ఆద్యుడు వంటివాడు. ఎంతో ప్రసాద గుణ మాధుర్యంతో, చెవికి ఇంపైన పదాలతో ప్రశాంత గంభీరంగా సాగిపోయే ధారతో - తెలుగు పద్య సౌందర్యం వెలార్చింది ఆయన చేతిలోనే. అంత ప్రసన్నంగా, అంత సుభగంగా, అంత మార్ధవంతో నన్నయ  తర్వాత పద్యం రాయలేదంటే అతిశయోక్తి లేదు. "విశ్వశ్రేయహ కావ్యం.."- కావ్యం విశ్వ శ్రేయము. రసాత్మకమైనదే వాక్యము. కవులు ఏవిధంగానైనా రసాన్ని సాధించవలసివుంది. నన్నయ ప్రారంభించిన మహాకావ్యం - పంచమవేదం. మహాభారతం - మనహ ప్రీతం.

2. నన్నయ రచనా వైశిష్ట్యం:

2.1 నన్నయ శైలి:

కథాగమన క్లిష్టత గాని, వక్రత గాని, అతి సంకుచిత తత్వము, అతి విస్తృతి గాని లేకుండా ప్రసన్నముగా, నిర్విఘ్నముగా నడుపగలిగాడు. ఈ ప్రజ్ఞ నన్నయకే సొంతం. ఒక్క శైలిలోనే కాదు. కథ నడుపుట లో కూడా నన్నయ శైలి భిన్నం. ఆది పర్వము నందలి శకుంతలోపాఖ్యానము, అరణ్య పర్వము నందలి లోపాఖ్యానమును పోల్చిన ఆ తారతమ్యము మనకర్ధమవగలదు.

2.2 నన్నయ భాష -  ఆత్మీయత:

"ధర్మ తత్వజ్ఞులు ధర్మ శాస్త్రంబని …." మొదలుపెట్టిన నన్నయ తన మహాభారతాన్ని ఎలా రాయాలనుకున్నాడో మనకి అక్కడే వివరించాడు. శబ్ద సంగ్రహమునే  కాక,  వాక్య రచనలో  కూడా నన్నయ చాలావరకు సంస్కృత సాంప్రదాయమునే అనుసరిం చెను. 

3. పద్య విశేషాలు:

ఆది, సభా, అరణ్య పర్వాల లో 3906 గద్య, పద్యాలు దాదాపు అన్నీ వృత్తాలు ఒకే ప్రసన్నతను వెలువరిస్తాయి. తిక్కన మాటల్లో నన్నయ" విద్యా దయితుండు…". నన్నయ పద్యాల్లోని ఆ ప్రసాద మాధుర్యాలకు కారణం ఎక్కువగా సంస్కృత పదాలు వాడటం అంటే కొంతవరకు నిజం. సంస్కృత పదాలు దట్టించి తెలుగు పద్యాలు వ్రాసిన వారు చాలామంది ఉన్నారు.  కానీ నన్నయ ఏరుకున్న సంస్కృత పదాలు చాలా మృదువైనవి. ఒక్క పూలమాలలోని పూలన్నీ దారాన్ని లాగితే ఎలా విడి పోతాయో అలా ఉంటాయి నన్నయ పద్యాలు. ఉదా: జలధి, విలోల,వీచి, విలసిత, కల, కంచి, సమంచిత,అవనీ……

4. నన్నయ మాటల్లో అతని గురించి విశేషణాలు:

1. చాళుక్య రాజ్య వంశమునకు కుల బ్రాహ్మణుడు.
2. అవిరళ జప,హోమ తత్పరుడు.
3. నానా పురాణ విజ్ఞాన నిరతుడు.
4. ధర్మే తరము లైన వాక్యములు ముట్టని వాడు.కాలము:  క్రీ. శ.1060 ప్రాంతం.కావ్య రచనలో సహాయమందించింది - నారాయణభట్టు - వీరిద్దరిదీ కృష్ణార్జున మైత్రి.

ఇతర కృతులుగా చెప్పబడేవి 1. చాముండికా విలాసం 2. ఇంద్ర విజయము.

సమకాలికులుగా చెప్పబడే వారు - 1. అధర్వణుడు 2. భీమకవి.

నన్నయ కవితీరీతులు:

నన్నయ్య ఆంధ్ర మహాభారతం ప్రారంభంలో అవతారికని రచించాడు.  దాని నుంచి కృతి భర్త, కృతి కర్త ఇత్యాది విషయాలే కాకుండా తన భారత రచన ఏ యే విశేషాలతో సాగిందో  ఈ క్రింది పద్యం ద్వారా వివరించాడు. (కుమా రాస్త్ర విద్యా ప్రదర్శన - షష్టా శ్వాసము - ఆదిపర్వము)

ఉ.  సారమతిం గవీంద్రులు ప్రసన్న కథాకలితార్థయుక్తి లో     
నారసిమేలునా, నితరు లక్షరరమ్యత నాదరింప నా   
 నా రుచిరార్ధ సూక్తి నిధి నన్నయభట్టు తెనుంగునన్  మహా     
భారత్ సంహితా రచన బంధురుడయ్యె జగద్ధితంబుగన్. (ఆది. 1-26)

పై పద్యంలో నన్నయ మూడు కవిత గుణాలను వ్యక్తీకరించాడు.

1.  ప్రసన్న కథా కలితార్థ యుక్తి, 2.  అక్షర రమ్యత 3.  నానా రుచిరార్ధ సూక్తి నిధిత్వం

1. ప్రసన్న కథా కలితార్థ యుక్తి (ప్రసన్నత+అర్థ యుక్తి):

ప్రసన్నమైన కథలతో కూడిన అర్థ యుక్తి ప్రసన్న కథాకలితార్థయుక్తి. ప్రసన్నత అంటే నిర్మలత్వం. కథలో సువ్యక్త స్థితి కల్పించటం. కుమార్రాస్త్ర విద్యా ప్రదర్శన ఘట్టం ఆంధ్ర మహాభారతంలో మూలానుసారంగానే జరిగింది.  ప్రదర్శన ప్రారంభంలో.."సుతుల విద్య ప్రవీణత జూచు వేడ్క నెంతయును సంతసంబున గుంతిదేవిరాజా సన్నిధి గాంధార రాజుపుత్రికెలననుండె ను న్మీలిత నలిన నేత్ర" ప్రదర్శన సందర్భంలో కుంతీదేవి రాజకాంత ప్రేక్షక సమూహంలో గాంధారి పక్కన కూర్చుంది.  ఆమెకి 'నలిని నేత్ర ' అనే ఒక విశేషణం వేసాడు నన్నయ.  ఇది చాలా ప్రత్యేకంగా గమనించదగినది. నలిననేత్ర అంటే పద్మనయ అని అర్థం. నలిన నేత్రకి, నలినాప్తుడికి గల బంధుత్వం కుమార్రాస్త్ర విద్యా ప్రదర్శన ఘట్టం సమాప్తమైనా అనిశ్చితంగా ఉండిపోయింది.

శా.  సాలప్రాంశు నిజోజ్వలత్కవచు, శస్వత్కుండ లోద్భాసితు
న్బాలార్క ప్రతిమున్, శరాసనధరున్, బద్ధో గ్రనిస్త్రింశ్ర శౌ
ర్యా లంకారు, సువర్ణ వర్ణఘను, గర్ణాఖ్యున్, జగత్కర్ణ పూ
ర్ణా లో లద్గణు జూచి చూపరు ప్రభూతాశ్చర్యులైరచ్చటన్. 

అస్త్ర విద్యా ప్రదర్శనశాల ప్రధాన ద్వారం దగ్గర జబ్బ చరిచి నిలుచున్నప్పటి కర్ణుని మూర్తి వర్ణనం ఇది. ఈ పద్యంలో- - సాలప్రాంశు, బాలార్క, ప్రతిమ, సువర్ణ వర్ణు, జగత్కర్ణ పూర్ణాలో లద్గుణు అనే నాలుగు విశేషణాలు నన్నయ స్వతంత్రంగా ఉపయోగించినవే. కర్ణుడు కనిపించేసరికి ప్రేక్షకులంతా ఆశ్చర్యచకితులై పోయారు. ఎత్తయిన రూపం, మెరిసిపోతున్న కవచకుండలాలు, బంగారు మేనిచాయ, ధనస్సు ఖడ్గాలు పూని ఉండడం. తమ లాగా ప్రేక్షకుడులా కాక కురు వీరుడు అర్జునుడికి ప్రతి స్ఫర్థిగా జబ్బ చరచటం ఇవన్నీ ఆశ్చర్యాన్ని కలిగించేవే.

నన్నయ ఉపయోగించిన విశేషణాలతో- బాలార్క ప్రతిమ- అనేది కర్ణుడు జన్మవృత్తాంతం స్ఫురింప చేస్తుంది. సాల ప్రాంశువు అనే విశేషణం ముందు చెప్పి తర్వాత కవచ, కుండలాల ప్రసక్తి తేవడంతో కర్ణుడు కవచకుండలాలు కోల్పోయి వట్టి శరీరంతో సాలప్రాంశువు గా మిగులుతాడనే ఒక అర్థం స్ఫురిస్తుంది. 'శౌర్యలంకారు ' అనే విశేషణం తో కూడా గొప్పతనం కనిపించదు. శౌర్యమే అలంకారంగా కలిగినవాడని అర్థం. అలంకారం పైపై మెరుగులకు చెందినది. ఇతడి శౌర్యం కూడా అలాంటిదే అనే అంశం ద్యోతకమవుతుంది. అర్జునున్ని పరిచయం చేసే సందర్భంలో అన్ని విశేషణాలు చెప్పి 'పాండవ మద్యముండొప్పె' అనే మాట కూడా చెప్పి బద్ధ తూణీరుడు అనే మాట ఉపయోగించాడు. భవిష్యత్తులో అర్జునుడు అక్షయ తూణీరాలతో నిలుస్తాడనే సూచన గోచరిస్తుంది. ఈ విధంగా కథాంశం చెదిరిపోకుండా, అందచందాలతో చెక్కుచెదరకుండా కథ నడపడంలో ప్రసన్నత, అర్థయుక్తి అనే రెండు అంశాలను సమర్థవంతంగా నిర్వహించాడు.

2. అక్షర రమ్యత:

నన్నయ్య అక్షర రమ్యత పై పరిశోధన చేసిన పండితులు డా. వి. వి. ఎల్. నరసింహారావు. ఆయా సన్నివేశాలందు రసోచితములైన ఆయా శబ్దములు, ఆయా అక్షరములు వానంతట అవే కుదురుకొని ఆ మహా కవి జీవ లక్షణములైన యొకానొక రచనా మార్గమును స్పష్టము చేయును. నన్నయ  గారి రచనలో ఈ అక్షర సంయోజనీయము హృదయాహ్లాదజనకముగా శ్రవణేంద్రియం తర్పణముగా సాగినది. ఈ లక్షణము తన కవితలో నిండారియున్నదని గుర్తించిన జ్ఞాని నన్నయ. నా కవిత యందు అక్షర రమ్యత పరమాదరనీయమని ఆయన విశ్వసించెను. అక్షర రమ్యత శబ్ద ప్రధానమైనది.  శైలి రామణీయకత సంబంధమైనది.  దీనినే అక్షర చంధో రమ్యతగా, కవిత గుణాల వల్ల ఏర్పడే రమ్యతగా, సంగీతము, పూర్వమీమాంశ తత్వ అక్షర సౌందర్యంగా పరిశోధకులు వివేచన చేసారు.

1. నిర్వచనము- అక్షరములు ధ్వనులకు సంకేతికములు. వివిధ ధ్వనులు గల అక్షరములచే శబ్దములు ఏర్పడుచున్నవి. ధ్వని మాట్లాడిన పిమ్మట నశించిపోవును. అక్షరమట్లు గాదు ఎన్నడూ నశించని పరమేశ్వరుడక్షర పద వాచ్యుడు.  అక్షరమగు కవిత లోకోత్తరమైనది.
2. అక్షర ప్రయోగ రమ్యత
3. నాదము, రాగ రసములు - సంగీతము
4. అక్షర చంధో రమ్యత చంధస్సు
5. కావ్య గుణములు - అక్షర రమ్యత - గుణాదులు
6. పూర్వ మీమాంస తత్వము
7. మంత్రశాస్త్ర ప్రసస్తి
8. రసౌచితాక్షర బంధము - నౌ చిత్తము
కం. నీవ కడు నేర్పు కాడవు
గావలవదు, వీని గొన్ని గరచితి మేము
న్నీ విద్యలెల్ల జూపుదు
మే వీరుల సూచి మేలు మేలని పొగడన్.

నాటకీయమైన సంభాషణ ఇది. కర్ణుడి స్వభావాన్ని నిరూపించేది. కర్ణుడి స్వాతిశయం, అర్జునుడిపై స్పర్ధని వ్యక్తం చేస్తుంది.

చం. కురు కులజుండు పాండునకు గుంతికి  బుత్రుండు ;రాజధర్మ బం
ధుర చరితుండు; నీ వితని తోడ రణంబొనరించెదేని వి
స్తరముగ నీదు వంశమును దల్లిని దండ్రిని జెప్పు; చెప్పిన
న్దొరయగుదేని నీకెదిరి దోర్బల శక్తి నితండు సూపెడిన్

ఆచార్య. సుబ్రహ్మణ్యం గారు ఈ పద్యాన్ని శబ్ధ శక్తి మూల ధ్వనికి అమూల్యమైన ఉదాహరణగా భావించారు. ఈ పద్యంలో కుల, రాజు, దొర శబ్ధాలు సాభిప్రాయ  విశేషాలు. దొర శబ్ధం క్షత్రియుడు, రాజు అనే అర్థంలో ఉపయోగించబడింది. దీనిలో ధ్వని అంతా శబ్ధం  మీదే ఆధారపడింది. 

ప్రభువు అనే అర్థం వాచ్యంలో, సమానుడు అనే అర్థం వ్యంగం లోనూ స్ఫురిస్తుంది. భావి కథకు మూలమౌతుంది. కాబట్టి ఇది శబ్ద శక్తి మూల ధ్వని. చమత్కారమేమంటే పఠితకు కర్ణుడి తల్లి,దండ్రుల సంగతి తెలుసు. సన్నివేశంలో ఉన్న వారికి తెలియదు. కర్ణుని స్థితి పఠితలో సానుభూతిని రేకెత్తిస్తుంది. ఇది రస విషయకమైన రహస్యం అని వివరించారు. ( ఆంధ్ర మహాభారతం వ్యాఖ్యానం - తి.తి.దే.ప్రచురణ)

"వినుత ధనుర్విద్యా విదుఘను గర్ణు సహాయబడిసి కౌరవ విభుడర్జుని వలని భయము సెడి రొమ్ము న జేయుడి నిద్రవోయె ముదితాత్ముండై…"

దుర్యోధనుడు కర్ణున్ని సహాయంగా పొందాడు. తత్కారణంగా భయం చెడిన వాడయ్యాడు. ఇంక అదుపులో ఉండడనే  భావం స్ఫురిస్తోంది. దుర్యోధనుడికి శత్రు భయం లేదు . గుండెపై చేయి వేసుకొని నిద్రపోయాడు. కానీ అర్జునుడున్నాడు. ఈ అర్జునుడితో వైరం దుర్యోధనుడికి బదులు కర్ణుడికి సంక్రమించింది. ఇంక కర్ణుడికి నిద్ర పడుతుందా అని వ్యంగమే. 

ఈ విధంగా నన్నయ అక్షర రమ్యత లో భాగమైన భావ చిత్రణ, తదనుకూలమైన పదాల వినియోగం, సంభాషణాత్మక శైలి, వ్యంగ వైభవాలు అక్షర రమ్యత కి అర్థం పడుతున్నాయి.

3. నానా రుచిరార్ధ సూక్తి నిధిత్వం:

ఈ సూక్తి అనే పదం విషయంలో పండితులలో అభిప్రాయ భేదాలు ఉన్నాయి. సూక్తి అంటే మంచి మాట అనే అర్థంలో గ్రహించారు. వృత్తాంతము, సమాచారము అనేవి నిఘంటుకార్థాలు. ఏదైనా ఒక విషయాన్ని చెప్పదలచినప్పుడు హృదయంగమంగా, సంక్షిప్తంగా చెప్పే విధానాన్ని సూక్తి అనాలి.

'సూక్తి ' అనేది విశేషణం. ఈకారాంత స్త్రీలింగ శబ్దం. 'శోభనాచ సా ఉక్తి శ్చ'- సూక్తి అని దీని వ్యుత్పత్తి. శోభన తత్వం అంటే సౌందర్యం. అది ఉక్తికి చెందినది. ఉక్తికి సంబంధించిన సౌందర్యం రెండు విధాలు. ఒకటి అంతరము, రెండు బాహిరము. 'కావ్య గ్రాహ్యమలంకారాత్ సౌందర్య మలంకారాహ" అని లాక్షణికోక్తి. కాబట్టి సూక్తి అనేది అలంకారానికి పర్యాయపదం అవు తోంది. శబ్ద సౌందర్యాన్ని అక్షర రమ్యతగా స్పష్టం చేసాడు. కాబట్టి ఇక్కడ కేవల అర్థాలంకార సౌందర్యాన్నే గ్రహించాలి. ఇతిహాసానికి కావ్యత్వాన్ని కల్పించిన నన్నయ నానా రుచిరార్ధసూక్తి నిధి అనే దళాన్ని కేవలం శిరోధార్యమయ్యే మంచి మాటలకే గాక అర్థాలంకార సౌందర్యాన్ని కూడా ఆపేక్షించి వాడాడు.

ఉ.  హారి విచిత్ర హేమ కవచావృతుడున్నత చాపచారు దీ
ర్ఘోరు భుజండు, భాస్వదసితోత్పల వర్ణుడు, సేంద్ర చాప శం
పా రుచి మేఘమో యనగ, బాండవ మధ్యముడొప్పె బద్ధతూ
ణీరుడు రంగ మధ్యమున నిల్చె జనంబులు దన్ను జూడగన్.

అందమైన, విచిత్రమైన బంగారపు కవచం ధరించాడు ఆజానుబాహుడు. ఒక చేతిలో ఉన్నతమైన ధనస్సు ఉంది. మనిషి నల్ల కలువల రంగుతో కాంతులీను తున్నాడు. పసిడి రంగుతో కలిసిన మొత్తం రూపం హరివిల్లు తో మెరుపుతీగతో కూడిన నీలి మేఘంలా ఉన్నాడు అర్జునుడు. అర్జునున్ని  ఇంద్రచాపంతో కలిసి ఉన్న మెఱుపు మేఘంలా ఉత్ప్రేక్షించాడు. ఈ ఉత్ప్రేక్ష కూడా ఇంద్ర తనయుడనే విషయాన్ని స్ఫురణకు తెచ్చేలా సార్థకంగా ఉంది.

కం.  అనిన నిన తనయు పలుకులు
జనులకు విస్మయము, సవ్యసాచికి గోపం
బును సిగ్గును మరి దుర్యో
ధనునకు బ్రీతియును జేసెదత్ క్షణన మాత్త్రన్.

నువ్వు నేర్పరివి కాదు. మాకు ఆ విద్యలు తెలుసు. మేము నేర్చుకున్నాం.  నువ్వు ప్రదర్శించిన విద్యలు వీరుల మెచ్చుకొనేలా మేమూ ప్రదర్శించగలం అని కర్ణుడు అన్నాడు.ఆ మాటలు అక్కడ ఉన్న ప్రేక్షకులకి ఆశ్చర్యాన్ని, అర్జునుడికి కోపాన్ని, సిగ్గుని దుర్యోధనుడికి సంతోషాన్ని కలిగించాయి. ఇదే ఉల్లేఖాలంకారం "బహుభిర్భుహుధోల్లే ఖాదేక స్యాల్లేఖ ఇష్యతే…" అని ఉల్లేఖం లో ఒక లక్షణం. అయితే ఈ అలంకార వైచిత్రి లో కూడా నన్నయ మూలానుసారమైంది కూడా గ్రహించే అలంకారిక రచన చేశాడు.

నన్నయ యతి విశేషణాలు:

1. పృథ్వీ వృత్తము - సంస్కృతమున 8వ అక్షరము తర్వాత యతి చెప్పబడినది. కన్నడమున నాగవర్మ కూడా అట్లే చెప్పినాడు. కానీ నన్నయ తెలుగులో వడి 11వ అక్షరము తర్వాత వుంచినాడు.
2. శిఖరిణి - సంస్కృతమునందు, కన్నడమునందు 6వ అక్షరము తర్వాత యతి ఉన్నది.  కాని నన్నయ 12 వ అక్షరము తర్వాత వడి నిల్పినాడు.
3. పంచచామరమునకు - సంస్కృతమున 8 తర్వాత యతి, తెలుగున 9 తర్వాత పాటించారు.
4. తరళ వృత్తమునకు - కన్నడమున 8 వ అక్షరము తర్వాత, తెలుగు లో 11 వ అక్షరం తర్వాత వాడబడినది.

విశేషాంశాలు:

1. రచనా బంధురత: 

నన్నయ విపుల శబ్దశాసనుడు. ఆనాడు దేశీయములైన శబ్దములను, సంస్కృత శబ్దములను ఏర్చి, కూర్చి నుడికారపు సొంపులు తీర్చిదిద్దిన శబ్ధశాసనుడు.
2. విశ్వ సాహిత్య ప్రపంచంలో శబ్ధా ర్థములకు, చంధస్సుకు భిన్నమైన నాదముచే కవితా శిల్పమును నిర్మించిన మహా కవులను వేళ్లపై లెక్కించవచ్చు. ఈ మహా కవులలో నన్నయ మేరుపూస.
3. కుమారాస్త్ర విద్యా ప్రదర్శన ఘట్టం చదువుతుంటే కర్ణుడు రంగమాధ్యమాన్ని ప్రవేశించినట్టు కనబడదు. నాటకీయ శిల్పం ఆంధ్ర వాజ్మయంలో అడుగు పెట్టినట్టు తోస్తుంది.
4. నన్నయ మహాభారతాన్ని రచించే నాటికి సంస్కృత సాహిత్యంలో 'రీతి' సంప్రదాయం ప్రముఖంగా వ్యాప్తిలో ఉంది. అందువలన ఆయన తన భారత రచనలో దీనినే అనుసరించారు.
5. నన్నయ నాటికి కన్నడంలో మాత్రమే భారత రచన జరిగింది. అయితే పంపకవి రచించిన కన్నడ భారతం ఇతిహాసం కన్నా జైన పురాణ సాంప్రదాయానికి దగ్గరగా ఉంది. ఇది రాజ, రాజ నరేంద్రుని వంటి భారత కథాభిమానులకు నచ్చలేదు. అందువలననే భారతములోని మౌళిక తాత్వికతకు లోపం లేకుండా ఆ రచన చేయాలని నన్నయను కోరాడు.
6. నన్నయ  సంస్కృత చంధో రీతులను ఎక్కువగా ఇష్టపడినట్టు భారతం చెబుతోంది.
7. తెలుగులో చంపూ రచనలకు మార్గదర్శనం చేసింది నన్నయ భారతమే.
8. విశ్వనాథ సత్యనారాయణ తన రామాయణ కల్పవృక్ష అవతారిక లో "ఋషి వంటి నన్నయ రెండవ వాల్మీకి" అని కొనియాడారు. ఇది అక్షర సత్యం.

పరిశోధన గ్రంథాలు:

1. ఆంధ్ర మహాభారతం - కుమారాస్త్ర విద్యా ప్రదర్శన - పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం.
2. షష్టా శ్వాసం - ఆదిపర్వం - మహాభారతం.
3. అక్షర రమ్యత:-  డా. వి. వి. ఎల్. నరసింహారావు.
4. ఆంధ్ర మహాభారతం వ్యాఖ్యానం - తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ

శ్రీనివాసమూర్తి వి.వి.ఎల్.

AUCHITHYAM | Volume-2 | Issue-1 | January - June 2021

శకుంతలోపాఖ్యానంలోని వ్యకిత్వ వికాసం - 2

 ఇప్పుడు శకుంతలోపాఖ్యానం కథను పరిశీలిద్దాం. ఇది అందరికి తెలిసిన కథే. అలనాటి ఈ కథ ఈనాడు ఇచ్చే సందేశమేమిటి? అన్న ప్రశ్న ఇందులో గల మనస్తత్వ పరిశీలన మన వ్యక్తిత్వాలను, సమాజంలో మన స్వలాభాలను వెల్లడింపజేస్తుంది. ఇవ్వాళ దుష్యంతుడు వంటి రాజులు లేకపోవచ్చు. కణ్వునిలాంటి ఋషులు లేకపోవచ్చు. కాని అలాంటి స్వభావంగల మరో పేరున్న మనుషులు ఉంటారు.

దుష్యంతుడు ఒంటరిగా కణ్వాశ్రమానికి వచ్చాడు. కణ్వుడు లేడు. అయినా శకుంతల ప్రభువు కాబట్టి ఆతిధ్యమిచ్చింది. ఆతిధ్యం స్వీకరించి వూరుకొన్నాడా? ఆమె అందంపై కన్నువేశాడు. ఆమె చరిత్ర తెలుసుకొన్నాడు. కణ్వమహర్షి కూతురు కాదు కాబట్టి మనసుపడ్డాడు. ఇక్కడే ఉంది మనుష్య స్వభావం. విశ్వామిత్ర-మేనకల అక్రమసంబంధానికి పుట్టినది అనగానే కొంత అలుసు. పైగా రాజ అన్న ఆత్మ ప్రత్యయం ఎలాగో ఉండనే వుంది.

మగవాడి స్వభావాన్ని, స్త్రీ స్వభావాన్ని ఈకథలో తరచి చూడవచ్చు. మనసుపడిన ఆడదానిని ఎలాగైనా లొంగదీసుకోవాలన్నది మగవాడి స్వభావం. మరోవిధంగా చెప్పాలంటే బుట్టలో వేసుకోవడం లేదా అనుభవించడం! మగవాడి దృష్టి సామాన్యంగా ఇదే! పైగా ఆలనాపాలనా మరొకరి దగ్గర కల కన్య! తల్లితండ్రి లేని పిల్ల! 'ట్రాప్' చెయ్యడం సులువన్న భావన.

శకుంతలకి కూడా దుష్యంతునిపై మనసైంది. "అనంత విలాసంబున జయంతుండ పోని దుష్యంతుండనెఱింగి, యతిసంభ్రంబున..." అని నన్నయ శకుంతల అంతరంగాన్ని బయటబెట్టాడు.

"ఈ వల్కలాజినములకు
నీ వన్య ఫలాశనముకీ విటపకుటే
రావాసములకునుచితమే
నీ విలసిత రూపకాంతి నిర్మల గుణముల్"

అన్నాడు దుష్యంతుడు - "నీ అందమైన రూపం, నీ మేనికాంతి, మచ్చలేని నీ గుణాలు... ఈ నార చీరలు కట్టడానికి, అడవిలో పండ్లు తినడానికి, ఈ ఆకుల గుడిసెలో నివసించడానికి తగినవి కావు సుమా!" అని పై పద్యానికి భావం. అంటే ఆవిడ ప్రస్తుత జీవనవిధానంపై వ్యతిరేక భావాన్ని పుట్టించి - తన రాజభోగాలపై మనసును తిప్పటానికి చేసే ప్రయత్నం ఇది! తన వైపుకు తిప్పుకునే ఎత్తులో ఎవరైనా ఎదుటివారికి లేని వాటిని ఎర చూపించటం సహజమైన ప్రయత్నమే! ఈ మునిపల్లెలో ఉండటానికి తగినదానవు కావు" అనడంలో ఈ ఉపాయమే కనిపిస్తుంది.

అయితే దుష్యంతుడు కొంతలో కొంత సక్రమమైన పాచికే వేశాడు. అనుభవిస్తానని అనలేదు. "నాకు భార్యవయి భాసురలీల నశేష రాజ్యలక్ష్మి మహనీయ సౌఖ్యముల మేలుగనందుము..." అన్నాడు. సుఖాలపట్ల ఎవరికైనా మక్కువ ఉంటుంది. పైగా మహరాజుకి భార్యగా వెళ్ళడం కంటే అదృష్టం జీవితంలో ఏముంటుంది? కణ్వాశ్రమంలో ఉండే జీవితాన్ని రాణీగా ఉండే జీవితంతో పోల్చుకుంటే ఎవరైనా సుఖాలపట్ల, భోగాలపట్ల ఆకర్షితులవుతారు. మనకు లేనిది, పొందనిది... అలవోకగా వస్తే కాదనగలమా? ఇదీ సైకాలజీ! శకుంతల దైన్యస్థితినుంచి - పెళ్ళిస్థాయికి - అక్కడినుంచి భోగస్థితికి తీసుకవచ్చేలా మాట్లాడుతాడు దుష్యంతుడు. ఎదుటివారిని మచ్చిక చేసుకోవడం ఎలాగో తెలిసిందే కదా!

దుష్యంతుడు ఎత్తుకు పై ఎత్తు వేశాడు. గాంధర్వ వివాహం మేలైనది, ఉత్తమమైనది, సముచుతమైనదని ఆధారం చూపించాడు. అంటే తప్పించుకోలేని విధంగా తన ఆత్రుతను ప్రదర్శించాడు.

అయితే శకుంతల వెంటనే అంగీకరించలేదు. కొంచెం జ్ఞానం కలదే. కణ్వ మహర్షి ఇప్పుడే వస్తారు. ఆయన అంగీకరిస్తే ఇప్పుడే పెళ్ళి చేసుకోవచ్చు అన్నది. అప్పుడు నాకు అభ్యంతరం లేదన్నది. అంటే తనకిషటమే కాని - కణ్వునితో చెప్పి చేసుకుందాం అన్నది. దిక్కులేని దానిని తీసుకవచ్చి, పెంచి, పోషించి, కన్నకూతురిలా చూసుకొన్న కణ్వుని పట్ల ఆమాత్రం కృతజ్ఞత ప్రదర్శించటాన్ని మెచ్చుకొంటాం. ఇది సుగుణమే.

కాని - ఈ గుణం తాత్కాలికమైంది. ఈ అభిప్రాయం పైనే నిలవలేదు. మనసు మార్చుకొంది. స్త్రీ యొక్క చపలచిత్తం అది. అయితే కణ్వుని ప్రాపకంలో పెరిగింది కాబట్టి కొంచెం బుర్ర కలది! నీకూ, నాకు పుట్టిన కుమారుడు యువరాజు అయితే - నాకు అభ్యంతరం లేదంది.

దుష్యంతుడు తడుముకోలేదు. అంటే, No second opinion, No rethinking, వెంటనే అలాగే (OK) అన్నాడు. ఏ మగాడైనా వ్యామోహంలో ఉన్నపుడు ఏ కోరిక కోరినా - సరేనంటాడు. ఇది మగ మనస్తత్వం. తన కోరికను తీర్చుకోవడమే తక్షణ లక్ష్యం. శకుంతల పప్పులో కాలేసింది. మహారాజు కాబట్టి - నమ్మకం ఉంచి 'రతి ' సుఖాన్ని ఇచ్చింది. శకుంతల కూడా రాజుతో పొందు కోరుకుంది. ఏ స్త్రీయైనా తనకంటే ఉన్నత స్థితిలో ఉన్నవారితో "పొందు" లేక "సుఖం" కోరుకుంటుంది. అప్పుడు నమ్ముతుంది. అలాగే దుష్యంతున్ని నమ్మింది. మనం కూడా ఎదుటివారి మాటలకి లొంగిపోతాం. మరీ నమ్ముతాం. ఇది లోకస్థితి కూడా.

కొడుకు పుట్టిన తర్వాత కణ్వుడు -

"ఎట్టి సాధ్వకులకు బుట్టిన యిండ్లను పెద్ద కాలమునికి తద్ద తగదు"

అంటూ శిష్యున్ని ఇచ్చి దుష్యంతుడి దగ్గరకు పంపాడు. దుష్యంతుడు -

"ఎ నెఱుగనిన్ను, నెక్కడి దానవు?" అన్నాడు. తెలిసే అన్నాడు. అవసరానికి ఎవో కబుర్లు చెప్పి అనుభవించాడు. తర్వాత మర్చిపోయాడు.

బహుకార్యభార నిమగ్నుడైన రాజుకి ఇవన్నీ మామూలే! అవసరం తీరాకా ఎవరైనా "కూరలో కరివేపాకు"లా పారేస్తారు. పట్టించుకోరు. రాజు కావచ్చు. సేవకుడు కావచ్చు. ఇదే స్వభావం ఉంటుంది.

ఇక్కడే ఈ కథ స్త్రీకి ఒక గుణపాఠం చెప్తుంది. "వ్యకిత్వ వికాసం" పై సలహా ఇస్తుంది. పెళ్ళికి ఒక సాక్ష్యం ఉండాలి. ఆధారం ఉండాలి. లేకపోతే మాటకి విలువ ఉండదు. తొందరపడి గాంధర్వానికి ఒప్పుకోవడంలోనే తప్పు చేసింది. అందుకే అందుకే పెళ్ళికి సకుంటూంబ సపరివార సమేతంగా పిలుస్తాం. అప్పుడే పెళ్ళికొడుకు బుద్ధిగా ఉంటాడు. "ఇంతమంది" సాక్ష్యులున్నారని జాగరూకతతో ఉంటాడు.

అయినా స్త్రీ ఏడవకూడదు. తన విధి ఇంతేనని నిరాశ, నిస్పహ చెందకూడదు. పరిస్థితిని ఎదుర్కోవాలి. "Life is a challenge. Face it." బేల కాకూడదు. ఆత్మహత్య చేసుకోకూడదు. సమస్యకి పరిష్కారం అది కాదు. పోరాడాలి. సమస్యను పరిష్కరించుకొనే మార్గాలు అన్వేషించాలి. స్త్రీ అబల కాదు, సబల అని చాటాలి. అందుకే శకుంతల దుష్యంతున్ని ఎదుర్కొంది. ఢీ కొట్టింది. వాదించింది. నిండు కొలువులో బుద్ధులు చెప్పింది. రాజు ఎలా ఉండాలో పాఠం చెప్పింది. తప్పు చేయనప్పుడు గుండె ధైర్యంతో వాదించాలి - అన్నదే సందేశం.

శకుంతల ఎంత పోట్లాడినా స్త్రీ కదా! ఆ బేలతనం ఎక్కడికి పోతుంది. అందుకనే -

తడయక పుట్టిననాడు తల్లిచే తండ్రిచే విడియ
బడితి, నిప్పుడూ పతి చేతను విడువ బడియెదనొక్కా
నుడూవులు వేయి నింకేల? ఇప్పాటి నోములు తొల్లి
కడగి నోచితినిగా కేమి యనుచు గందెడెందంబున!

- ఎంత ధైర్యం ఉన్నా, తప్పు చేయక పోయినా... పరిస్థితి తనకు అనుకూలంగా లేనపుడు "డీలా" పడటం సహజం. విధిని, కర్మను తలచుకోవడం - "నా టైం బాగుండలేదు" అని దిగులు చెందడం మానవ స్వభావం.

మరి దుష్యంతుని తత్త్వం ఏమితి? తెలిసి కూడా తెలీనట్లు ఎందుకు పలికాడు?

"అన్యులెఱుగమి చేసి లోకోపవాద భీతి నెఱిగియు, నిత్తన్వి ప్రీతి దప్పి ఎఱుగనంటిని"

అన్నాడు దుష్యంతుడు. శకుంతలను గాంధర్వ వివాహం చేసుకొని తిరిగి వచ్చిన వెంటనే అందరకూ తెలియజేసి ఆమెను తెస్తే సభ్యతగా ఉండేది. అది చెయ్యక పోవడమే పెద్ద నేరం. పెద్దవాళ్ళతో పనులు ఒక్కొక్కసారి ఇలాగే ఉంటాయి. అందుకే అన్నారు - "కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జీ ఉండా"లని.

దుష్యంతుడు మహారాజు. చక్రవర్తి. గొప్ప పేరున్నవాడు. అప్పటిదాకా మచ్చలేని వ్యక్తిత్వం గలవాడు. ఏ పరిపాలకుడైనా లోకానికి జంకాలి. 'యధా రాజా తధా ప్రజా' అన్నదే అనాటి గొప్పనీతి. రాజు నడవడికకు గొప్ప ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రజలు అతనిని ఆదర్శంగా తీసుకొంటారు. అందుకే 'లోకాపవాది' భీతీచే అన్నాడు.

ఇది దుష్యంతుడికే కాదు - సమాజంలో ఏ వ్యక్తికైనా అవసరమే. పేరున్న వాళ్ళకి, మంచి పదవిలో ఉన్నవాళ్ళకి మరీ అవసరం. 'తనను గురించి లోకం ఏమనుకొంటొందీ' అన్నప్పుడే నడవడిక సవ్యంగా ఉంటుంది. లోకం చూపు కూడా పేరున్నవాళ్ళ మీదే ఉంటూంది. గొప్పవాళ్ళు ఏ చిన్నతప్పు చేసినా పెద్ద ప్రచారం పొందుతుంది. చిన్నవాళ్ళు పెద్దతప్పు చేసినా లోకం అంతగా పట్టించుకోదు.

శకుంతల చెప్పగానే, "అవును నువ్వే నా భార్యవి. వీడు మన కుమారుడే. లోపలికిరా" అని దుష్యంతుడన్నాడనుకోండి. మంత్రులు, సామంతులు, ప్రజలు, బంధువులు ఏమనుకొంటారు? ఎప్పుడు ఈ సంగతి చెప్పలేదే?... అని రాజు శీలాన్ని శంకిస్తారు. ప్రజలలో రాజుపై గౌరవం, భక్తి ఉండవు. పరిపాలకుడు వీటన్నిటినీ పరిగణలోకి తీసుకోవాలి.

ఆకాశవాణి నిజం చెప్పడంతో కథ సుఖాంతమయింది. అప్పటిదాకా సాక్ష్యం లేదు కదా - అని దుష్యంతుడు బుకాయించాడు. సాక్ష్యం లభించేసరికి - పైగా ఆకాశవాణి అంత పెద్ద సాక్ష్యం లభించేప్పటికి నిజం ఒప్పుకున్నాడు. ఇక గత్యంతరంలేని పరిస్థితి. ఆకాశవాణి చెప్పటంతో ఇక ప్రజలు కూడా దుష్యంతునిపై సానుభూతి చూపిస్తారు తప్ప ద్వేషించరు. లోకంలో కూడా తగాదా వచ్చినప్పుడు దొంగమాటలు చెప్తాం. బుకాయిస్తాం. ఎవడో పెద్దమనిషి వచ్చి హితవు చెప్తాడు. అప్పుడు శాంతించి 'సరే' అంటాం. ఇదీ లోకరీతి. దుష్యంతుడు తను ఇచ్చిన వాగ్దానం మేరకు కొడుకును యువరాజుగా అభిషక్తుడ్ని చేశాడు.

సారాంశం ఏమిటంటే... పెళ్ళికి తొందరపడకూడదు. పెద్దవాడు కదా, గొప్పవాడు కదా అని అతని మాటల్ని పూర్తిగా నమ్మకూడదు. పెద్దలు, తల్లిదండ్రులు, బంధువులు 'సాక్ష్యం' ఉండాలి. లేకపోతే చిక్కులు తప్పవు. ఆపద లేదా సమస్య ఎదురైనపుడు ధైర్యంగా ఎదుర్కోవాలి. నిరాశతో కుంగిపోవడం, ఆత్మహత్య చేసుకోవడం, ఇంటినుంచి పారిపోవడం తగదు. పరిస్థితిని ఎదుర్కొంటే విజయం లభిస్తుంది - కాకపోతే ఆలస్యం కావచ్చు. 'పరిపాలకుడూ, 'గొప్పవాడూ' ఎప్పుడూ లోకోపవాద భీతిని కలిగివుండాలి. సమాజం తనను వెయ్యి కళ్ళతో చూస్తూవుంటుందన్న తెలివి కలిగి ఉండాలి. 'లోకమా, గీకమా - ఐ డోంట్ కేర్' అన్న స్వభావం మంచిది కాదు. ఇవీ నేర్చుకోవలసినవి!!

-- ద్వా. నా. శాస్త్రి,  
సుజన రంజని, 
ఏప్రిల్ -2007 




గంగుల శాయిరెడ్డి (1890-1975) ( భూమి పుత్రుడు )

హలమే కలమై అక్షర సేద్యం చేసిన కాపుబిడ్డ.....

సాలు సాలును తన గుండె గొంతుకగా వినిపించిన మట్టిమనిషి.....
కృషీవలుడి తలపాగై వెలుగొందిన భూమిపుత్రుడు.....
ఓ రైతు గర్జన....
ఓ సాహిత్య స్పూర్తి....


గంగుల శాయిరెడ్డి !👉వీరి స్వస్థలం పూర్వ నల్లగొండ జిల్లా
ఇప్పటి వరంగల్ జిల్లాలో భాగమైన జీడికల్లు గ్రామంలో 1890లో శివారెడ్డి, రామక్క దంపతులకు వీరు
జన్మించారు. ▪️కీర్తనలు పాడే గాయకుడుగా 👉 పుట్టిన జీడికల్ గ్రామంలోనే వీధి బడిలో ఓనమాలు నేర్చుకున్నాడు.ఆ తర్వాత మహా భారతము, రామాయణము, భాగవతం కథలను అభ్యసించాడు. అందలి పద్యాలను కంఠస్థం చేసాడు. రామదాసుగా పిలవబడిన కంచర్ల గోపన్న, అన్నమయ్య, రాకమచర్ల వేంకటదాసులు రాసిన కీర్తనలను కూడా కంఠస్థం చేసాడు. సాయిరెడ్డి మధుర గాయకుడు కూడా. ఆలపించేవాడు. తాను కంఠస్థం చేసిన పద్యాలనూ కీర్తనలను రాగయుక్తంగా ఆలపించేవాడు.

▪️రచయితగా 👉సాహిత్యం అంటే రాజులు వారి పల్లకీలు, యుద్దాలు వారు గెలిచిన రాజ్యాలు, ఇవి మాత్రమే కాదు అంటూ.... రైతుల జీవితం కూడా గొప్ప సాహిత్యమే అంటూ.... రైతు బతుకును సాహిత్యంగా మలిచిన మహనీయుడు శాయిరెడ్డి. ▪️సాహిత్యకారుడిగా శాయిరెడ్డి ప్రస్థానం గొప్పది. వీరి రచనల్ని గమనిస్తే...
ముద్రిత_రచనలు
1)'కాపుబిడ్డ' వ్యవసాయం ప్రధాన అంశంగా కొనసాగిన పద్యకావ్యం. వ్యవసాయంలో ఉన్న కష్ట నష్టాలు ఈ కావ్యంలో పద్య రూపాల్లో చెప్పబడ్డాయి.
2) తెలుగు పలుకు
3) వర్ష యోగం
3) మద్యపాన నిరోధం
4 )బాలశిక్ష కూర్పు. వయోజన విద్య అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని సాయిరెడ్డి బాలశిక్ష కూర్చాడు. ఈ క్రమంలో నాలుగు బాలశిక్షలలు రచించాడు. ఇవన్నీ ముద్రితాలు.
అముద్రిత_రచనలు
5)గణిత రహస్యం
6) ఆరోగ్య రహస్యం
రచయితగా మాత్రమే కాదు పోరాట వీరుడుగా కూడా తన శక్తిని చాటుకున్నాడు శాయిరెడ్డి. నిజాం వ్యతిరేక పోరాటంలో తన వంతు కర్తవ్యంగా ప్రజల పక్షాన నిలిచాడు. నిజాం ప్రభుత్వం ఆగ్రహానికి గురయ్యాడు. ఫలితంగా జైలు జీవితం గడిపాడు.


ప్రస్తుతం ‘కాపుబిడ్డ’ కావ్యం తెలంగాణ ప్రభుత్వం ముద్రించిన తరగతి ఎనిమిదవ విద్యార్థులకు
పాఠ్యాంశంగా బోధించబడుతున్నది. అప్పట్లో ఈ కావ్యం గొప్పతనాన్ని తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి, గాడిచర్ల హరిసర్వోత్తమరావులు గుర్తించి ప్రంశంసించారు.
ఇచ్చుచుండు ను నీశ్వరుడింద్ర పదవి
వచ్చుచుండును ప్రకృతి బల్వలపు చేత
దాని జూడవు కన్నెత్తి తాపేసేంద్రా? !
కర్షకా ! నిన్ను కెలెత్తి గౌరవింతు !

అంటే.... ఒక రైతుకు భగవంతుడు ఇంద్రపదవి ఇస్తున్నాడు. ప్రకృతి కాంత రైతును వలిచి వస్తున్నది. కానీ రైతు దేన్నీ పట్టించుకోలేదు. తన వృత్తిని గౌరవిస్తూ తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. అందుకే రైతుకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను అంటున్నాడు. సాయిరెడ్డికి రైతుల మీద ప్రేమ, గౌరవం, ఎంత ఉందో ఈ పద్యం ఒక్కటి చూసినా అర్థం అవుతుంది. ▪️సంఘ_సంస్కర్తగా 👉 ఆలేరు, పెంబర్తి, కొలనుపాక, జీడిపల్లి గ్రామాల్లో
సాయిరెడ్డి 1916 నుంచి 1926 వరకు
వీధి బడులు నడిపాడు. చదువుకోవాలని ఆసక్తి ఉన్న పిల్లలను గుర్తించి చదువు చెప్పాడు.
నెలకు ఐదు రూపాయల జీవనభృతిని పొందిన సాయిరెడ్డి, ఆ ఐదు రూపాయలను పేద ప్రజల కోసం ఉపయోగించేవాడు.

విద్యార్థుల ఇబ్బందుల్ని గుర్తించి 1936-39 సంవత్సరాల్లో భువనగిరి, నెల్లుట్ల, గుమ్మడవెల్లి గ్రామాల్లో వసతిగృహం ఏర్పాటు చేశాడు. ఎందరో విద్యార్థులకు తిండి నీడ కల్పించి తన ఉదారతను చాటుకున్నాడు. ▪️చిరస్మరణీయులు 👉పేదల కోసం పనిచేసి -

రైతు శ్రేయస్సు కోసం పరితపించి -
అక్షరం కోసం ఆత్రుతపడిన శాయిరెడ్డి
తెలుగు సాహిత్య ప్రపంచంలో చిరస్మరణీయులు. !

వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

గంగుల శాయిరెడ్డి

 ”ప్రకృతి సౌందర్యాలను ఆస్వాదిస్తూ, సామాజిక సందపసృష్టికి కారకులైన కర్షకలోకానికి హస్తభూషణమైనది నాగలి. ఈ నాగలి కృషీవలులకు వారి పూర్వజన్మ పుణ్యపరిపాక విశేషముచేత లభించింది. హలధరుడవై, ఆయురారోగ్యాలతో ఈ ధరాతలంలో తిరుగాడే కర్షకా! నీకు హితమవుతుంది” అంటూ ఆరుగాలం చెమటోడ్చే రైతు బిడ్డను కవితా వస్తువుగా స్వీకరించి తన పద్యాలకు ద్రాక్షాపాకంలో ముంచి పాఠక హృదయ సీమలను దోచిన కవులు తెలుగు సాహిత్యంలో పలువురున్నారు. వారిలో తెలంగాణ ప్రాంతంలో హాలికుడైన పోతన్న ప్రథముడు. ఆయన కవితా వ్యవసాయాన్ని, కృషి వ్యవసాయాన్ని స్ఫూర్తిగా స్వీకరించి కవిత్వమల్లిన లబ్దప్రతిష్ఠుడైన మరో కవి గంగుల శాయిరెడ్డి. పూర్వపు వరంగల్‌ జిల్లాలోని శ్రీరామ క్షేత్రం జీడికల్లు వాస్తవ్యులు రామక్క, శివారెడ్డి దంపతులకు రామచంద్రునిగూడెం నుంచి దత్తు వచ్చిన శాయిరెడ్డి 1890లో జన్మించాడు. చిన్నతనంలోనే భారత, భాగవత రామాయణాలను తల్లిదండ్రులనుంచి విన్న శాయిరెడ్డి వాటిసారాన్ని ఒంట బట్టించుకున్నాడు. రామదాసు, అన్నమయ్య, రాకమచర్ల వేంకటదాసు ప్రభృతుల కీర్తనలను సుశ్రావ్యంగా వీనుల కింపుగా ఆలపించడం, తనకు తెలిసిన, నేర్చిన విషయా లను పలువురికి తెలియజెప్తూ తల్లిదండ్రుల సేవలోను శ్రీరామచంద్ర సేవలోనూ తరించిన ధన్యజీవి గంగుల.

జీడికల్లులోనే సంప్రదాయ వీధి బడిలో అక్షరాలు దిద్దుకొని 1916 నుంచి 1926 వరకు ఆలేరు, పెంబర్తి, కొలనుపాకలతోసహా స్వగ్రామంలోనూ వీధి బడులు నడిపి, చిన్నారులను తీర్చిదిద్దాడు. నెలసరి ఐదు రూపాయల జీవనభృతిని పొందిన శాయిరెడ్డి 1936-39ల మధ్య భువనగిరిలో వసతిగృహం ఏర్పాటు చేశాడు. పిల్లల సంరక్షణ బాధ్యతలు స్వీకరించి వారికి విద్యాబుద్ధులు నేర్పి, చుట్టుపక్కల గ్రామాల ప్రజల హృదయాలను శాయిరెడ్డి దోచు కున్నాడు. ఈ క్రమంలోనే జీడికల్లు శ్రీరామ చంద్ర ఆలయ మేనేజరుగా 1951-57 మధ్య కాలంలో స్వామివారి నిత్యకైంకర్య విధులకు లోటు రానీయక శ్రీరామచంద్రుల కృపా పాత్రుడైన శాయిరెడ్డి స్వయంగా ఆలయానికి అను బంధంగా ఒక సంస్కృత పాఠశాలను ప్రారంభించి సంస్కృతం బోధించాడు. హైదరాబాద్‌ ఆకాశవాణి కేంద్రం ప్రసారంచేసే గ్రామ స్థుల కార్యక్రమాల సలహా దారుగా, సంస్కృత పాఠశాలకు కార్యదర్శిగా పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి వారి సన్మానాన్ని (1976) వరంగల్‌ సభలో రూ. 500/- నగదు పురస్కారాన్ని అందుకొన్న నిరాడంబరుడు శాయిరెడ్డి.

ఒకవైపు వ్యవసాయం చేస్తూనే స్వయంగా కాపుబిడ్డ, వర్షయోగము, గణిత రహస్యము, జేర్పకుంటి మహాత్స్యము, వయోజనుల విద్యా వాచకాలను రచించాడు. గ్రామీణుల ఆరోగ్య పరిరక్షణ ఆసక్తితో గంగుల ప్రకృతి వైద్యం, పశువైద్యం, ఆయుర్వేద వైద్యం ఉచితంగా చేస్తూ పలువురి ప్రశంసలకు పాత్రుడయ్యాడు.

శాయిరెడ్డి తన కావ్యం ‘కాపుబిడ్డ’ను ‘వ్యవసాయ పద్యకావ్యం’ అని పేర్కొన్నాడు. ఈ కావ్యంలోని ఉత్పలమాలాదివృత్తాలు, ఆటవెలదులు, తేటగీతులు 147 ఉన్నాయి. ఈ పద్యాలన్నీ 27 నక్షత్రాలుగా విభజితమై ప్రతి నక్షత్రభాగంలో రెండునుంచి పదునాల్గు పద్యాలున్నాయి. కర్షకుల నిత్య జీవనశైలి, వారి కుటుంబం, భార్యాపిల్లలు, సమాజ జీవనము, పనిముట్లు, పాడిపంటలు, ప్రకృతి సోయగాలు, ఆహార నియమాలు, అతిథి సత్కారాలు, ఆలమందల వృషభరాజులు ఈ పద్యాలలో హృద్యంగా చిత్రితమయ్యాయి. ‘సత్యవాక్యాళిని సతతంబు బోధింప.. సద్బ్రాహ్మణుడని జగతి మెచ్చు.. విశ్వమంత వ్యాపించి వెలసినావు… కర్షకా చేతులెత్తి నే గౌరవింతు’ అంటూ రాసిన ఒక పద్యం కర్షకుల ఆంతరిక, బాహిర జీవనశైలిని కనులకు కడుతుంది. కర్షకుల ఇళ్ళు వాన నీటికి చెరువులవుతాయని, గింజలు, గుడ్డలు తడిసి ముద్దవుతాయని, గిత్తలు, గేదెలు, ఆవులు లేవలేకపోతాయని, వంట చెరుకు తడిసి నిప్పు రాజుకోక పొగలు చిమ్ముతుందని, ఇలా కాపు బిడ్డలకు వర్షాకాలంలో ఎదురయ్యే కష్టాలు ల్కెకు మిక్కిలి అంటూ చెప్పిన ‘ఇల్లిల్లు నీరయ, యిల్లాలు పిల్లలు.. కాపు బిడ్డల ఘో(గో)రముల్‌ గాంతురెవరు” అను పద్యం కాపుల జీవిత బాధలను పాఠకుల ముందుంచింది.

గంగుల అనుభవ పూర్వక నిశిత పరిశీలనాశక్తి.. విషయ విశ్లేషణా శక్తి ప్రతి పద్యంలోనూ పాఠకులను అబ్బురపరుస్తుంది. గ్రామీణుల ఆటలైన.. చిర్రగోనె, మర్రి ఊడలూగుటతోబాటు తేనెతుట్టెలు, ఎగిరే కౌజులు, పూరేళ్ళ వంటి పక్షుల వర్ణనలు శాయిరెడ్డికిగల ప్రకృతి విజ్ఞాన సంపదలను పాఠకులకు తెలియజెప్తున్నాయి.

గంగుల రాసిన ‘వర్షయోగము” సమకాలీన ఋతు పరిణామాలవల్ల ప్రకృతిలో కలిగే మార్పులు.. వానలు పడుట, పడకపోవుట, మబ్బులు వచ్చుట, విత్తనాలు చల్లుట, నాట్లు వేయుట, కోతలకు అనువైన కాలములను సవివరంగా కర్షకలోకానికి తెలిపి, అత్యధిక పంటలు పండించుటకు తోడ్పడే వారి సలహాలు ప్రాచుర్యం పొందాయి. ఇక ‘గణిత రహస్యము’ అను మరో రచన వ్యవసాయదారులకు విద్యావసరమైన గణిత పరికర్మలు, కొలమానము, దైర్ఘ్యమానము, ద్రవ్యనామము, ధాన్యము/సరుకుల మార్పిడి, మిత్తి లెక్కలు తెలిపే నిఘంటువు అని చెప్పవచ్చు. అట్లే శాయిరెడ్డి రాసిన ‘జీలెకంటి మహాత్మ్యము’ క్షేత్ర విశేషాలతో కూడిన ఒక వచన రచన.

శాయిరెడ్డి రాసిన ‘కాపు బిడ్డ’ను చదివిన ప్రఖ్యాత విమర్శకుడు కట్టమంచి రామలింగారెడ్డి ‘తమ కాపుబిడ్డను చదివి మిక్కిలి ఆనందించాను. కవిత్వము బహు బాగుగా ఉన్నది. విషయము ఉత్తమోత్తమము తమ విధేయుడ నంటూ’ ఒక లేఖలో గంగులను ప్రశంసించాడు. గాడిచర్ల, హరిసర్వోత్తమరావు, రాతి గుండెలను కూడా కరిగించగల కావ్యం కాపుబిడ్డ అంటూ గంగులను అభినందించారు. తెలంగాణమున కవులే లేరన్న వారికి సమాధానంగా సుర వరం ప్రతాపరెడ్డి (1937) తన గోల కొండ కవుల సంచికలో గంగులవారి కావ్యాన్ని గూర్చి రాస్తూ ‘మధ్యయుగ కవుల ప్రబంధ ధోరణిలోనే యింకను కవితలల్లువారు ఈ రాష్ట్రమున బహు ళమని ఇందుకు శాయిరెడ్డి గ్రంథముదా హరణమని చెప్తూ ఇందలి ప్రకృతి వర్ణన ములు శ్లేషయమకాద్యలంకారములు. సాధారణ నిఘంటువులలోకెక్కని పద సంపద మరే రచనల్లోనూ కనబడలేదని – కాపుబిడ్డ ఉత్కృష్ట కవితయని ప్రశంసించాడు.

స్వయంగా హాలికుడు, బహుముఖీన ప్రతిభా సంపన్నుడు, ప్రకృతి ప్రేమికుడు, పశువైద్య నిపుణుడుగా తెలంగాణలోనూ, కోస్తా ప్రాంతంలోనూ విస్తృతంగాపర్యటిస్తూ తన విభిన్న సంపదను పదుగురికి పంచిన శాయిరెడ్డి సమకాలీన సమాజ ఆదరాభిమానాలకు పాత్రుడయ్యాడు. ఈ మహనీయుని రచనలను ఈనాటి తరాల వారికి పరిచయం చేయాల్సిన బాధ్యత సమకాలీన సమాజం, సాహితీ సంస్థలపై ఉంది. తద్వారా కర్షక లోకానికి ఆనంద సౌభాగ్య సంపదలను అందిం చవచ్చు. అందుకే ”కర్షకానీకు శుభములు కల్గుగాక” అన్న శాయిరెడ్డిని వేనోళ్ళ కీర్తిద్దాం.

డా|| దహగాం సాంబమూర్తి

తెలంగాణ మాసపత్రిక

 

 



డాక్టర్. శ్రీవైష్ణవ వేణుగోపాల్ 
సహాయాచార్యులు (పి.టి)
తెలుగు శాఖ, 
స్నాతకోత్తర కేంద్రం, గద్వాల  

పాలమూరు విశ్వవిద్యాలయం 


Dr. Srivaishnava Venugopal
Assistant Professor (P.T)
Department of Telugu
PG Centre, Gawdal
Palamuru University


 

 

పాలమూరు విశ్వవిద్యాలయం
ఎం. ఏ.తెలుగు, ప్రథమ సంవత్సరం
సెమిస్టర్ -III, పేపర్ IV ()
304 తెలంగాణ చరిత్ర - సంస్కృతి

*******************************************************

మొదటి యూనిట్    

1.     సంస్కృతి - నాగరికత నిర్వచనాలు
2.    సంస్కృతి - నాగరికత స్వరూప స్వభావాలు       
3.    తెలంగాణ పండుగలు- జాతరలు             
4.    తెలంగాణ కళారూపాలు

రెండవ యూనిట్    

1.     శాతవాహనులు - సాంఘిక సాంస్కృతిక సాహిత్య విశేషాలు

2.     తూర్పు చాళుక్యులు - సాంఘిక సాంస్కృతిక సాహిత్య విశేషాలు
3.     రాష్ట్ర కూటాది చిన్న రాజ్యాలు సాంఘిక సాంస్కృతిక సాహిత్య విశేషాలు

మూడవ యూనిట్ 

1. కాకతీయులు – సాంఘిక, సాంస్కృతిక, సాహిత్య విశేషాలు
2. పద్మనాయకులు – సాంఘిక, సాంస్కృతిక, సాహిత్య విశేషాలు
3. కుతుబ్‌షాహీలు – సాంఘిక, సాంస్కృతిక, సాహిత్య విశేషాలు

నాల్గవ యూనిట్ 

1. మొఘలులు – సాంఘిక, సాంస్కృతిక, సాహిత్య విశేషాలు
2. అసఫ్ జాహీలు – సాంఘిక, సాంస్కృతిక, సాహిత్య విశేషాలు
3. గ్రంథాలయోద్యమం- ఆంధ్ర మహాసభలు సాహిత్యం

ఐదవ యూనిట్ 

1. నాన్ ముల్కీ ఉద్యమాలు- ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు
2. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు - సాహిత్య సాంస్కృతిక సంస్థల కృషి
3. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం - ప్రజాసంఘాల పాత్ర



 

పాలమూరు విశ్వవిద్యాలయం
ఎం. ఏ., తెలుగు, ప్రథమ సంవత్సరం
సెమిస్టర్ -I, పేపర్ - II
102. సంప్రదాయ కవిత్వం – పాఠ్యాంశాలు

*******************************************************

I1. నన్నయ : మహాభారతం- ఆదిపర్వం–చతుర్థాశ్వాసం-శకుంతలోపాఖ్యానం: 3-109
   2. పాల్కురికి సోమనాథుడు: వృషాధిప శతకం (మొదటి 25 పద్యాలు)

II. 1. తిక్కన:మహాభారతం-ఉద్యోగ పర్వం--తృతీయాశ్వాసం-శ్రీకృష్ణరాయబారం:3-118
   2. గోన బుద్ధారెడ్డి:రంగనాథ రామాయణం, బాలకాండ, భగీరథ ప్రయత్నం:1132-1332 (శాశ్వత ధర్మ నిష్టా పరుండగుచు నుండి – భగీరథుడు రాజ్యము చేయుచుండె వరకు)

III.1. ఎఱ్ఱన:మహాభారతం–ఆరణ్యపర్వం-పంచమాశ్వాసం ధర్మవ్యాధోపాఖ్యానం:27-112 
    2. శ్రీనాథుడు:భీమేశ్వరపురాణం ద్వితీయాశ్వాసం-వ్యాసుడు కాశిని బాసిన విధం:87-160

IV. 1. పోతన : శ్రీ మహా భాగవతం - అష్టమ స్కంధం- వామన చరిత్ర:506 - 621
     2. అనంతామాత్యుడు: భోజరాజీయము - షష్టమాశ్వాసం - గోవ్యాఘ్ర సంవాదం: 2 -73 

V. 1. కొరవి గోపరాజు: సింహాసన ద్వాత్రింశిక-ప్రథమాశ్వాసం-ససేమిరా కథ:240-317
    2. చరిగొండ ధర్మన  : చిత్ర భారతం–పంచమాశ్వాసం - శ్రీకృష్ణ ప్రతిజ్ఞ:1-67