''వసంతపంచమి విశిష్టత''


''సరస్వతీం శుక్లవర్ణాం సుస్మితాం సుమనోహరామ్‌
కోటిచంద్ర ప్రభా ముష్ట పుష్ట శ్రీయుక్త విగ్రహమ్‌
వహ్ని శుద్దాంశుకాధానం వీణా పుస్తక ధారిణీమ్‌
రత్న సారేంద్ర నిర్మాణ నవ భూషణ భూషితామ్‌'' 

తిథుల్లో ఒక్కో రోజుకు ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి, నెలల్లో వచ్చే మాఘమాసం శుక్ల పక్షంలో ఐదవ రోజున వసంత పంచమిగాను, శ్రీపంచమిగాను జరుపుకుంటారు. అలాంటి విశేషమైన రోజున చదువులతల్లి సరస్వతీ దేవి ఆవిర్భవించిన రోజు కావడం మరో ప్రత్యేకత.

వసంత ఋతువు మనకు చైత్ర, వైశాఖమాసాల్లో వస్తుంది. కానీ ఈ వసంత శోభ మాఘమాసం నుంచే వస్తుందనేటటువంటి ఉద్దేశంతో వసంత పంచమి అని పిలుస్తారు. ప్రకృతిలో అనేక మార్పులు ఉంటాయి. ఆ మార్పుల్లో భాగంగానే వసంత శోభను దృష్టిలో పెట్టుకొని వసంత పంచమిగా చెప్పినట్లు మనకు శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. అలాగే  మన్మధుడు ఈ రోజున పరమశివునిచే దహనం చేయబడి మల్లి రతీ దేవి ప్రార్ధన  వళ్ళ తన రూపాన్ని ఆమెకు కనపడేటట్లు వరం పొందాడు కాబట్టి మాధనపంచమి అని కూడా వసంత  పంచమిగా పిలిచే పద్దతి ఉన్నది. ఈ మన్మధుడు వసంతుడు  వీళ్ళిద్దరు కూడా చాలా మంచి స్నేహితులు వాళ్ళ వాళ్ళ చర్యల్లో ఒకళ్ళకొకరు సహకరించుకుండేటటువంటి వాళ్ళు కాబట్టి ఇది మధనపంచమిగా, వసంత పంచమిగా ఖ్యాతి పొందింది. 

ఈ వసంతపంచమినే మాఘశుద్ధ పంచమిగా, శ్రీపంచమిగా, సరస్వతీ జయంతిగా కూడా చెప్పబడుతూ ఉంటుంది. అంటే బ్రహ్మదేవుని యొక్క సృష్టిలో సరస్వతి సృష్టి ఈనాడు జరిగింది కాబట్టి దీన్ని సరస్వతీ జయంతి అని అంటారు. సరస్వతీ దేవాలయాన్నిటిలో కూడా ఈ రోజు చాలా విశేషమైన పూజలు జరుగుతాయి. ఇది మాఘమాసం ఈ మాఘమాసం సూర్యునికి సంబంధించినటువంటి మాసం. సూర్యుని శక్తి మూడురకాలుగా ఉంటుంది. గాయిత్రి, సావిత్రి, సరస్వతి. కాబట్టి సూర్యుడు అంటే సవితృదేవతా, బుద్ధిప్రచోదనం కలిగించేటటువంటి వాడు. ఆ బుద్ధి ప్రచోదనం కలిగించేటటువంటి శక్తి స్త్రీ స్వరూపిణి సరస్వతీ ఆ సవితృదేవత యొక్క స్వరూపమే. ఈ విధంగా శ్రీపంచమిగా సరస్వతి జయంతిగా పిలవబడుతోంది.   వేదవ్యాసునిచేత ప్రతిష్ట అయినటువంటి సరస్వతి దేవాలయం బాసరలో ఉన్నది. అటువంటి క్షేత్రాల్లో 
వసంతపంచమినాడు సరస్వతీదేవికి, విశేషపూజలు సేవలు నిర్వహిస్తారు. ఆరోజు చదువులతల్లి ఆశీర్వాదం లభిస్తే చిన్న, పెద్ద అందరిలో జ్ఞానం, జ్ఞాన జ్యోతులు వెలుగుతాయని భక్తుల నమ్మకం అందుకే శ్రీపంచమినాడు చిన్నారులకు అక్షరబ్యాసాలు చేస్తారు. ఆతల్లి అనుగ్రహంతో వారి బావి జీవితం తేజోమయం అవుతుందని భావిస్తారు. సరస్వతీదేవిని పూజించే మరో పర్వదినం సరస్వతీ పూజ దసరాలో వస్తుంది. ముఖ్యంగా వసంతపంచమినాడు ఎక్కువగా పిల్లలకు అక్షరాబ్యాసం చేయిస్తారు. హిందూ సంస్కారాల్లో నామకరణం, అన్నప్రాసన, కేశఖండనం, అక్షరాబ్యాసం, ఉపనయనం, వివాహం మొదలైనవన్నీ సంస్కారాలే . 

మాఘశుద్దపంచమి, వసంత పంచమి, శ్రీపంచమి,  రోజునే సరస్వతీదేవి ఉద్భవించింది. ఆమె జయంతి కాబట్టి ఆ సరస్వతీ మనలోకూడా ఉద్భవించాలి. మన పిల్లల్లో కూడా ఆమె ఉద్భవించాలి అనేటటువంటి లక్ష్యంతో ఈ పంచమినాడు అక్షరాబ్యాసం పిల్లలకు చేయించడం జరుగుతుంది. పాఠశాలలో కూడా ఈ రోజున సామూహిక అక్షరాబ్యాసాలు చేయిస్తూ పిల్లల్నితమ తమ పాఠశాలలకి ముందుగానే వారు ఆ సరస్వతి అనుగ్రహానికి పాత్రులను చేసి తమతమ శిష్యులుగా స్వీకరిస్తారు. 

''సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి |
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా'' 

అంటూ అక్షరాబ్యాస సమయంలో సరస్వతీదేవిని స్తుతిస్తారు. అక్షరాబ్యాసం అంటే అక్షరాలను సాధన చేయడం. వసంతపంచమినాడు తొలిసారిగా అక్షరాలు దిద్దటంతో ఈ ప్రక్రియ ఆరంభిస్తారు. సాధారణంగా పిల్లలకు మూడు లేదా ఐదు సంవత్సరాల ప్రాయంలో అక్షరాబ్యాసం చేస్తారు. అక్షరం అంటే క్షరం క్షీణతి లేనిది లేదా నశింపనిది అని అర్థం. అబ్యాసం అంటే సాధన ఇంకో విశేషం ఏమిటంటే అక్షరంలో ఆ మొదలు క్ష, ఱ తో ముగిసేవి కనుక అక్షరములు అని చెబుతారు. అక్షరాబ్యాసం చేసేటప్పుడు '' ఓం నమ : శివాయ, సిద్ధం నమ : అని ముందుగా ఒక పళ్లెంలో బియ్యం వేసి వేలితో రాయించి తరువాత కొత్తపలకపై రాయిస్తారు. 
వాగ్దేవి సరస్వతి ఆలయాల్లో బాసర  జ్ఞాన సరస్వతి మందిరం చెప్పుకోదగ్గది. ఈ ఆలయం తెలంగాణా జిల్లాలోని పావన గోదావరి తీరాన ఉంది. వసంతపంచమినాడు ఈ బాసర పుణ్యక్షేత్రానికి భక్తులు తరలివస్తారు. ఆ రోజు చిన్నారులకు అక్షరాబ్యాసాలు ఘనంగా నిర్వహిస్తారు. చదువులతల్లి కొలువైన ఈ క్షేత్రంలో అమ్మవారి అనుగ్రహంతో పిల్లలు విజ్ఞానవంతులుగా ఎదుగుతారని ప్రతీతి. 

కురుక్షేత్ర యుద్దానంతరం శాంతికోసం వేదవ్యాసుడు తన శిష్యులతో తపస్సు చేసుకోవడానికి ఒక ప్రశాంతమైన ప్రదేశంకోసం అన్వేషిస్తూ దండకారణ్యం దర్శించి ఆ స్థలం చాలా అనుకూలంగా ఉంటుందని తలచి సమీపంలోని గోదావరి నది నుంచి దోసిళ్ళతో ప్రతిరోజూ ఇసుకతెచ్చి మూడు రాశులుగాపోస్తే అవి పసుపు పూసిన సరస్వతీ , లక్ష్మి, కాళీ మూర్తులుగా ముగ్గురమ్మలుగా మారారట. ఈ పసుపును కొద్దిగా తింటే విజ్ఞానం, వివేకం పెంపొందుతాయని భక్తుల నమ్మకం. వ్యాసుడిచేత సృష్టించబడిన ఈ ప్రదేశం వాసరాగా, తర్వాత కాలంలో బాసరగా వాసికెక్కిందని స్థలపురాణం. ఈ విదంగా వసంతపంచమినాడు ఎక్కడ చూసినా పసుపురంగును దర్శనమిస్తుంది .

వసంతపంచమినాడు ఎందరో తల్లిదండ్రులు తమపిల్లలకు అక్షరాబ్యాసంకోసం బాసరకు వస్తారు. అంతేకాదు చాలామంది యుక్తవయస్కులు సరైన ఉపాధిలేక జీవితంలో స్థిరపడనివారు బాసర క్షేత్రం దర్శించి ఇక్కడి  పావన గోదావరిలో మూడు మునకలు వేస్తె వారికి అనువైన బ్రతుకుదెరువు లభిస్తుందని పలువురి నమ్మకం . అందుకే భాష పెంపొందించి బతుకుబాట చూపి బాసటగా నిలిచేది బాసర, చదువులతల్లి మన అమ్మకు, నాన్నకు మనకు అందరికి మాటలు నేర్పే మా మంచి తల్లి. మనకు  జ్ఞానమిచ్చే జగజ్జనని ఆ సరస్వతీదేవి. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, అనే పంచభూతాత్మకమైన ఈ ప్రపంచంలో సకల విద్యలు పంచిపెట్టే అమృత హస్తం ఆమెది. అదే హస్తం వీణ మీటి సంగీత ప్రపంచాన్ని ఆవిష్కరించి వీనులవిందు కూర్చింది. పంచమి తిథి తనదైనందుకు కోకిలకు పంచమస్వరమిచ్చి వసంతఋతువు మొదలయ్యేలా ప్రకృతిని చూసుకోమంది. పలుకులు పలుకమీద పరచి అక్షరం నాశనం కానిది అనే అద్భుత విషయాన్ని ప్రసాదించింది. 

ఏ పాఠశాలల్లో అయినా సరస్వతీదేవిని ప్రతిష్టించడమనేది ఉంటుంది. మిగితా దేవీదేవతలు ప్రతిష్టించినా లేకపోయినా ఎందువల్లనంటే చదువులకి ఆమె అధిష్టాన దేవత కాబట్టి. అక్షరాబ్యాసం తొలివిద్య ఈ తిథినాడే  ఆరంభిస్తే నేటి బుడి బుడి అడుగులే రేపటి అడుగుజాడలవుతాయి. ఇప్పుడు అ, ఆ, ఇ, ఈ అనే యాభైఆరు తెలుగు అక్షరాలతోపాటు A, B, C, D అనే ఇరువైయారు ఆంగ్లఅక్షరాలు కూడా అవసరమే. సరస్వతీదేవి కరుణిస్తే జీవితంలో అనుకున్న ఫలితాలతో ఘన విజయాలు సొంతమవుతాయని హిందువుల విశ్వాసం. ఉత్తరాదితో పోలిస్తే వసంతపంచమి పశ్చిమ బెంగాల్, ఒడిషాలో విభిన్నంగా జరుపుకుంటారు. బెంగాల్ లో విద్యార్థులే గాక అన్ని వయసులవారు సంప్రదాయరీతుల్లో ఈ పండుగ జరుపుకుంటారు. మిగితా దేవీ దేవతలమాదిరి నిత్య  పూజలు జరిగే ఆలయాలు ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ. ఈ కారంగానే ఏటా దసరా నవరాత్రి ఉత్సవాల్లో సరస్వతి పూజకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ పండుగ సందర్బంగా సామూహికంగా అక్షరాబ్యాసాలు, ఆరాధనతోపాటు, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వసంతపంచమి రోజు  పంజాబ్ లోని ఫిరోజ్ పూర్  లో గాలిపటాల పండుగ ఘనంగా నిర్వహిస్తారు. గాలిపటాల విన్యాసాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాలనుంచి సందర్శకులు భారీ సంఖ్యలో ఇక్కడికి  చేరుకుంటారు. రాబోయే వసంతఋతువును స్వాగతించే సందర్భమిది. ఆ శారదా మాత అందరిపై కరుణ ప్రసాదిస్తుంది.  జ్ఞానం, వివేకం, వాక్కు ప్రసాదిస్తుంది. 

భారతదేశంతో పాటు నేపాల్, బంగ్లాదేశ్ లోను సరస్వతీమాతను ఇదే రోజున ఆరాధిస్తారు.సంప్రదాయబద్దంగా జరుపుకునే ఆ ఉత్సవంలో పసుపు పచ్చరంగుకు విశేష ప్రాధాన్యం ఉంటుంది. పసుపురంగు వస్త్రాలు ధరించి పూజలుచేసి అదే రంగులో వండిన ప్రసాదాలు దేవికి నైవేద్యంగా పెడతారు. ముఖ్యంగా ఉత్తరాదిలో ఆ పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. పలుకా బలపాలు, పుస్తకాలు, పెన్నులు, సరస్వతీ చిత్రపటం ముందుఉంచి చదువులో బాగా రాణించాలని , జీవితంలో స్థిరపడాలని కోరుకుంటూ విద్యార్థులు అమ్మవారిని ప్రార్థిస్తారు. ఈ వసంతపంచమి రోజున సరస్వతీదేవి అమ్మవారి అనుగ్రహం అందరికి కలగాలని కోరుకుంటూ అమ్మవారి ఆశిస్సులతో ... 

శ్రీవైష్ణవ వేణుగోపాల్ 
పరిశోధక విద్యార్థి, తెలుగు శాఖ,
కాశీ హిందూ విశ్వవిద్యాలయం. వారణాసి
09848707978