కాకతీయ యుగ తెలుగు సాహిత్యం
మనదేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయాన్ని సృష్టించింది కాకతీయ యుగం. శాతవాహనుల తరువాత విశాలమైన సామ్రాజ్యాన్ని నిర్మించి సుస్థిరమైన పాలన చేసిన ఘనత కాకతీయులదే. నన్నయకు పూర్వం నన్నయకు తరువాత కూడ తెలుగు దేశంలో మనకు తెలిసిన కొద్దిపాటి విషయాలు తెలియని వాటితో సమానమేనని కొంత వరకు తెలిసిన భాగం కాకతీయుల కాలమేనని సురవరం ప్రతాపరెడ్డి గారు అన్న మాటలు యథార్థాలు1. కాకతీయ సాంస్కృతిక, సాహిత్య చరిత్ర నిర్మాణానికి శాసనాలు, కైఫీయత్తులు(స్థానిక చరిత్రలు) సమకాలీన రచనలు, లక్షణ గ్రంథాలు, సంకలన గ్రంథాలు, వాస్తుకళ, చిత్రకళ, నృత్యకళారూపాలు మొదలైనవి ముఖ్య ఆధారాలుగా నిలిచాయి. ఇటువంటి అంశాలు ప్రాతిపదికగా చేసుకొని కాకతీయ యుగంలో వెలువడిన సాహిత్యాన్ని పరిశీలించటం ఈ వ్యాస ఉద్దేశం. ముందుగా కాకతీయులు అన్న పేరు వీరి కెందుకు వచ్చిందన్న విషయంలో పలువురు చరిత్రకారులు పలురకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కాకతి అనే నామాంతరం గల దుర్గను పూజించటం వల్ల కాకతీయులైనట్లు ప్రతాపరుద్ర యశోభూషణం తెలుపుతున్నది. కాకతీయుల మూల పురుషుడు గుమ్మడి తీగకు పుట్టాడని ఖాజీపేట శాసనంలో ఉంది. కాకతమ్మ అనుగ్రహం వల్ల గుమ్మడి తీగకు ఒక పుత్రుడు జన్మించాడని, అతని సంతతి వారే కాకతీయులైనారని ‘అనితల్లి’ కలువచేరు శాసనం2 తెలుపుతుంది. కూష్మాండిని జైన దేవత. కూష్మాండం అంటే గుమ్మడి. కూష్మాండినికి మరొక పేరు కాకతి. మొదట కాకతీయులు జైనులు కనుక ఆ సంప్రదాయానికి సంబంధించిన వారిగా శాసనంలో పేర్కొనబడినట్లు ఊహించవచ్చు.
కాకతీయ వంశచరిత్రను తెలిపే శాసనంలో క్రీ.శ 956 నాటి మాంగల్లు శాసనం ప్రధానంగా పేర్కొనదగింది. ఈ శాసనంలో కాకర్త్యగుండన అనే పదం ఉందని అది క్రమంగా కాకత్య, కాకత, కాకతిగా రూపాంతరం చెందిందని చరిత్రకారుల అభిప్రాయం. అంతేకాక గుండన రాష్ట్రకూటరాజైన కృష్ణుని అభ్యర్ధన మేరకు అమ్మరాజును జయించాడు. వేంగీ రాజ్యాన్ని దానార్ణవునికి అప్పగించాడు. గుండన మాంగల్లు శాసనంలో రాష్ట్రకూటునిగానే వ్యవహరింపబడ్డాడు. ‘రాష్ట్రకూటు’ అంటే గ్రామాధికారి అనే అర్ధం నాడు వ్యవహారంలో ఉంది. స్థానికంగా ఆ పదం రట్టడిగా ఆ తరువాత రెడ్డిగా మారింది. కాబట్టి రాష్ట్రకూటుడు అనే శబ్దం అధికార పదవినే సూచిస్తుందని తెలుస్తున్నది.
కాకతీయులు దుర్జయ వంశస్థులని బయ్యారం శాసనం తెలుపుతున్నది. ఖాజీపేట శాసనంలో కూడ బేతరాజు చలమర్తి గండ బిరుదాంచితుడని, దుర్జయ కులమనే సముద్రానికి చంద్రుని వంటి వాడని వర్ణింపబడింది.3 (దుజ్జన్‌య కుళాబ్ది చంద్ర) మరికొన్ని శాసనాలు 4 వీరు విష్టి కులస్థులని తెలుపుతున్నాయి. దుర్జయులు అంటే జయింపనలవి కాని వారని అర్ధం. విష్టి అంటే నిస్వార్ధంగా చేసే సేవ అని అర్ధం. కాబట్టి వీరి శక్తి సామర్ధ్యాలు, పరోపకార బుద్ధి ఆయా శాసనాల్లో ప్రతీకాత్మకంగా వ్యక్తమైనాయి. అంతే కాదు ఆయా శాసనాలు వారి రాజకీయ సాంస్కృతిక జీవన చైతన్యాన్ని పట్టి చూపుతున్నాయి.
కాకతీయులు చంద్రవంశం వారని, మాధవవర్మ సంతతి వారని స్థానిక చరిత్రలో, కాసె సర్వప్ప రచించిన సిద్ధేశ్వర చరిత్రలో పేర్కొనబడింది. గణపతి దేవుని కాలం నాటి మోటుపల్లి, పాఖాల, కాంచీపురంలోని శాసనాలలో వీరు సూర్యవంశీయులుగా, క్షత్రియులుగా పేర్కొనబడినా వారు క్షత్రియులు కారని చరిత్రకారుల అభిప్రాయం. విద్యానాధుడు వీరి వంశం సూర్య, చంద్ర క్షత్రియ వంశాల కంటే గొప్పదని ప్రతాపరుద్రీయంలో వర్ణించాడు. బూదపుర శాసనం సమాజంలో నాలుగు వర్గాలుంటాయని వాటిలో నాలుగవ వర్గానికి సంబంధించిన వంశం జగత్ప్రసిద్ధమైందని ఆ వంశంలో కాకతీయులు ఉద్భవించారని తెలుపటం వల్ల వీరు చతుర్ధాన్వయులుగా పరిగణింపబడుతున్నారు. వీరి సంబంధ బాంధవ్యాలు కూడ చతుర్ధ వంశం వారితో ముడివడి ఉండటం ఈ విషయాన్ని నిరూపిస్తున్నది. మొదట కాకతీయులు రాష్ట్ర కూట సేనానులుగా ఉన్నారు. వారి పతనానంతరం నేటి తెలంగాణ ప్రాంతమంతా పశ్చిమ చాళుక్యుల వశం కాగా కాకతీయ గుండయ ఎవరివైపు పోరాడక స్వతంత్రునిగానే ఉండిపోయాడు ఈలోగా ముదిగొండ చాళుక్యులు విజృంభించి కొరివిసీమను ఆక్రమించుకొని గుండయ్యను సంహరించారు. గుండయ సోదరి కామసానమ్మ మేనల్లుడైన బేతరాజును చేరదీసి పశ్చిమ చాళుక్యులతో దౌత్యం నెరపి కొరివిసీమ నుండి హనుమకొండ వరకున్న రాజ్యాన్ని అతనికి ఇప్పించినట్లుగా గూడూరు శాసనం వల్ల తెలుస్తున్నది.5 కాకతీయ రాజ్యపాలనం మొదటి బేతరాజుతో ప్రారంభమైనట్లుగా చరిత్రకారులు నిర్ణయించారు. క్రీ.శ 992 నుండి 1052 వరకు ఇతడు పరిపాలించాడు.
తరువాత అతని కుమారుడు మొదటి ప్రోలరాజు క్రీ.శ 1052 నుండి 1075 వరకు పరిపాలించాడు. పశ్చిమ చాళుక్యరాజైన మొదటి సోమేశ్వరుని వల్ల ‘అనుమకొండ విషయము’ను లిఖిత పూర్వకంగా పొందాడు. రెండవ బేతరాజు తరువాత దుర్గరాజు క్రీ.శ 1108 నుండి 1116 వరకు పాలించాడు. తరువాత బేతరాజు రెండవ కుమారుడు రెండవ ప్రోలరాజు క్రీ.శ 1116 – 1155 వరకు పరిపాలించాడు. ఇతని కాలంలోనే కాకతీయ రాజ్యం విస్తరించింది. పశ్చిమ చాళుక్యులకు సామంతునిగా ఉన్నప్పటికి వారి బలం క్షీణించినపుడు ప్రోలరాజు విజృంభించి, వారి అధికారాన్ని త్రోసి రాజని స్వాతంత్య్రాన్ని ప్రకటించుకొని మహా మండలేశ్వర బిరుదాన్ని పొందాడు.
రెండవ ప్రోలరాజు కుమారుడు రుద్రదేవుడు క్రీ.శ 1158 నుండి 1195 వరకు పాలించాడు. సంస్కృతంలో నీతి సారమనే గ్రంథాన్ని రచించి విద్యాభూషణ బిరుదాన్ని వహించాడు. దేవగిరి యాదవరాజైన జైతుగితో జరిగిన యుద్ధంలో మరణించాడు. రుద్రదేవుడు మరణించిన తరువాత అతని సోదరుడు మహదేవుడు (1196 – 1198 వరకు) పరిపాలించాడు. కాని జైతుగి మహదేవుని సంహరించి ఇతని కుమారుడైన చిన్న వయస్సులో ఉన్న గణపతి దేవుని చెరపట్టాడు. 11 నెలలు చెరలో ఉంచిన తరువాత ఏ కారణం వల్లనో గణపతి దేవుని విడిచిపెట్టాడు. అంతవరకు రేచెర్ల రుద్రసేనాని కాకతీయ సామ్రాజ్యాన్ని రక్షించి గణపతిదేవునికి అప్పగించాడు. గణపతి దేవుడు క్రీ.శ 1199 నుండి 1262 వరకు పరిపాలించాడు. రాజనీతి దురంధరుడైన గణపతిదేవుని పరిపాలనలో కాకతీయ సామ్రాజ్యం విస్తరించి రాజకీయ ఐక్యతను సాధించింది. దానిని పెంపొందించింది రుద్రమదేవి. గణపతిదేవుని తరువాత క్రీ.శ 1289 వరకు పాలించిన రుద్రమదేవి త్రిపురాంతకం వద్ద అంబదేవునితో జరిగిన యుద్ధంలో అసువులు కోల్పోయింది. రుద్రమ తరువాత ఆమె దత్తపుత్రుడు(దౌహిత్రుడు ముమ్మడమ్మ కొడుకు) ప్రతాపరుద్రుడు రాజ్యానికి వచ్చాడు. క్రీ.శ 1289 నుండి 1323 వరకు పరిపాలించాడు. ఘియాజుద్దీన్ తుగ్లక్ కుమారుడైన ఉలుఘ్ ఖాన్ ఓరుగల్లును ముట్టడించి ప్రతాపరుద్రుని బందీగా ఢిల్లీకి తీసుకొని వెళుతున్నప్పుడు మార్గ మధ్యంలో నర్మదా నదీ తీరంలో ప్రతాపరుద్రుడు మరణించినట్లుగా చరిత్ర తెలుపుతున్నది. నాటితో తెలుగు దేశాన్నంతటిని ఏకచ్ఛత్రాధిపత్యం క్రిందకు దెచ్చిన కాకతీయ సామ్రాజ్యం అంతరించింది.
కాకతీయుల కాలం నాటి సాహిత్యం :
సాహిత్యచరిత్ర అధ్యయనంలో గ్రంథాలకే కాక శాసనాలకు ఎంతో ప్రాధాన్యముంది. వీటి పరిశీలన వల్ల సాహిత్యాంశాలకు సంబంధించిన విషయాలతో పాటు సామాజిక వ్యవస్థల అవగాహన కలుగుతుంది. కాకతీయుల కాలంలో రాజాస్థానాల నాశ్రయించి వెలువడిన సాహిత్యమే కాక సమకాలీన సాహిత్యం విస్తృతంగా వచ్చింది. తెలుగు భాష, సంస్కృత భాష సమానంగా ఆదరించబడింది. కాకతీయుల పాలన అనంతరం కూడ దాదాపు రెండు, మూడు శతాబ్దాల తరువాత వచ్చిన ఏకామ్రనాధుని ‘ప్రతాపరుద్ర చరిత్రము’ కాసె సర్వప్ప ‘సిద్ధేశ్వర చరిత్రము’ కూసుమంచి తిమ్మకవి ‘సోమదేవ రాజీయము’ వినుకొండ వల్లభరాయని ‘క్రీడాభిరామము’ మొదలైన గ్రంథాలు కూడ కాకతీయుల సాంస్కృతిక వైభవాన్ని తెలుపుతున్నాయి.
శాసన సాహిత్యం :
శాసన రచయితలు కూడ కావ్య రచనాధురీణుగా తెలిపే శాసనాలు చరిత్రలో కనిపిస్తాయి. ఆనాటి శాసన రచయితల దృష్టిలో శాసన రచన కావ్యరచన వంటిది. నన్నయ్య భట్టారకుడు నందంపూడి శాసనంలో తనను ‘‘కావ్యానాం కర్తా నన్నిభట్ట’’ అని పరిచయం చేసుకున్నాడు. అప్పటికి నన్నయభట్టు మహాభారతాన్ని రచించలేదు. అట్లే అప్పటికి ఇతడు రచించిన ఇతర కావ్యాలేవీ కనిపించవు. అందువల్ల నన్నయ తాను రచించిన శాసనాలనే కావ్యాలుగా పేర్కొన్నట్లు స్పష్టమౌతున్నది. ద్రాక్షారామంలోని భీమేశ్వరాయంలో ఉన్న రెండు శాసనాలు ప్రకాశ భారతీయోగి కావ్యాలుగా అందే పేర్కొనబడ్డాయి. అట్లే కాకతీయ దుర్గ నృపతి ఖాజీపేట శాసనంలో తద్రచయిత దేవన భట్టు దాన్ని ‘ఒడికొణ్డ ప్రభోర్దేవణ భట్టస్య మహకవే: కావ్య మిదం’ అని పేర్కొన్నాడు.6
కాకతీయుల శాసనాల్లో ఉత్పలమాల, చంపకమాల, శార్దూల మత్తేభ వృత్తాలు, కందము, సీసము, ఆటవెలది, తేటగీతి పద్యాలు కనిపిస్తాయి. పాల్కురికి సోమనాధుడు, గోనబుద్ధారెడ్డి మొదలైన కవులతో ఆదరింపబడిన ద్విపద సమకాలీన శాసనాల్లో కనిపించదు. మాత్రాఛందస్సుకు చెందిన కందపద్యం ఎక్కువగా కనిపిస్తుంది. అంతే కాక చూర్ణమనదగిన వచనాలు కూడ ఈనాటి శాసనాల్లో చూడవచ్చు. కేవలం విషయమే కాక చక్కటి వర్ణనలతో కూడుకున్న సాహిత్య గౌరవం అందుకున్న శాసనాలు కూడ ఉన్నాయి. వీటిలో ఈ క్రింది కరీంనగర్ జిల్లా శాసనం ప్రధానమైంది.
జన వినుతంబగు నంధ్రదేశమునకు విభూషణంబైన
యనుమకొండ యను పురవరంబు నిజ రాజధానిగా
నొప్పుచున్న కాకతె భూపాలక్రమంబున’ 7………………
శాసన సాహిత్యంలో అచింతేంద్రవరుడు రచించిన వేయిస్తంభాల గుడి శాసనం పేర్కొనదగినది. పురవర్ణన, స్త్రీలవర్ణన మొదలైనవి ఇందులో కనిపిస్తాయి. బెక్కల్లు శాసన రచయిత నాగదేవకవి, కుందారం శాసనం రచించిన బాలభారతి సత్కవి, ఎల్కుర్తి శాసన రచయిత హరిహరార్యుడు కరీంనగర్ శాసనకర్త గంగాధరుడు మొదలైన వారే కాక ఉర్సుగుట్టపై ఉన్న శాసనాన్ని రచించిన విశ్వేశ్వర శివాచార్యుని కొడుకైన నరసింహకవి పేర్కొనదగినవారు. ఉర్సుగుట్టపై సంస్కృతంలో ఉన్న ఈ శాసనం చారిత్రకంగా సాహిత్య పరంగా ఎన్నదగింది. ఈ శాసనస్థ శిల్పకావ్యాన్ని ‘సిద్ధోద్వాహం’ అంటారు. సిద్ధదంపతుల ప్రేమ, వివాహం, పెళ్లి అనే మొదలైన అంశాలతో పాటు ఏకశిలా నగర వర్ణనలు ఈ శాసన కావ్యంలో కనిపిస్తాయి. ఈ రచయిత 10 రూపకాలను, మలయవతి అనే కావ్యాన్ని, ఋగ్వేద వ్యాఖ్యను వ్రాశాడు. అంతే కాక ఒక్క రోజులో 8 సర్గలున్న కాకతీయ చరిత్రను వ్రాశాడని చెపుతారు. కాని ఈ గ్రంథం అలభ్యం. ఈ విధంగా శాసన రచయితలు తమ పాండిత్యాన్ని శాసనాల్లో ప్రతిఫలింపచేసినా దానాది వివరణ సమయాల్లో సామాన్య ప్రజల భాషనే ప్రయోగించటం వల్ల నాటి సాహిత్య చరిత్రేకాక బహుముఖీనమైన ప్రజల సజీవ సంస్కృతిని కూడ తెలుసుకునే అవకాశం కలిగింది.
కైఫీయతులు :
‘కైఫీయత్’ అనే అరబ్బీ పదానికి గ్రామ లేదా దేశ సమాచారాన్ని తెలిపే వృత్తాంతమని అర్ధం. విలేజ్ లోకల్ రికార్డ్స్ అని కూడ చెప్పవచ్చు.
కాకతీయుల గురించిన చరిత్ర కైఫీయతుల వల్ల కూడ తెలుసుకునే అవకాశం ఉంది. వీటిలో కొన్ని కల్పిత వృత్తాంతాలుండటం వల్ల ప్రామాణికంగా వీటిని పరిగణించే అవకాశం తక్కువ. అయినప్పటికి ఒక్కొక్క సారి చరిత్ర నిర్మాణానికి ఎంతో దోహదం చేసినట్టుగా సితాబ్‌ఖాన్ కైఫీయత్ నిరూపిస్తున్నది. కొమిరపూడి, వంగిపురం, ముట్నూరు మొదలైన కైఫియతుల ఆధారంగా గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుని చరిత్ర, సామాన్యజన వ్యవహారంలో ఉన్న ఎన్నో కథలు, ఆచార వ్యవహారాలు, సృష్టిసంబంధి గాథలు, క్షేత్ర మాహాత్మ్యాలు, పేరంటాండ్ల కథలు, గ్రామదేవతల కథలు, జానపదుల ఆటపాటలు మొదలైనవి తెలుస్తున్నాయి. ఆ కాలపు సమాజాల భిన్న సంస్కృతులను కూడ అవగాహన చేసుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణా రాజకీయ, ఆర్థిక సామాజిక స్థితిగతుల చారిత్రకతను నిర్ధారించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి ఆనాటి శాసనాలు, కైఫీయతులు.
కాకతీయ యుగంలో తెలుగు, సంస్కృత భాషలకు రెండింటికి రాజాశ్రయం లభించి ఆయా భాషలలో ఎన్నో ఉత్తమ గ్రంథాలు వెలువడినాయి. రాజులే కాక రాజోద్యోగులు, ఇతరులు సాహిత్య కృషి చేసి సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రతాపరుద్రుని ఆస్థానంలో రెండు వందల మంది కవులున్నట్లుగా స్థానిక చరిత్రలు తెలుపుతున్నాయి. 12 వ శతాబ్దపు ఉత్తరార్ధంలో కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రుద్రదేవ మహారాజుకు ‘విద్యాభూషణుడు’ అనే బిరుదున్నట్లు దాక్షారామ శాసనం వల్ల తెలుస్తున్నది. సంస్కృతంలో ‘‘నీతిసారము’’ అనే గ్రంథాన్ని రచించినట్లు బద్దెన తన ‘నీతి శాస్త్ర ముక్తావళి’ లో పేర్కొన్నాడు. తెలుగులో కూడ ‘‘నీతి సారమును’’ రచించినట్లు బద్దెన మానవల్లి రామకృష్ణ కవి తెలిపారు. ఆంధ్రకవుల చరిత్రలో ఆ గ్రంథంలోని ఐదు పద్యాలు ఉదాహరింపబడినాయి.
ప్రతాపరుద్రుడు ఉషారాగోదయము (నాటిక), యయాతి చరిత్రము (ఏడంకాల నాటకం), ప్రతాపమార్తాండము, రాజరుద్రీయము (పాణినీయానికి వ్యాఖ్య అయిన కాశికకు వ్యాఖ్య), అమరుశతక వ్యాఖ్యలను రచించాడు. అచింతేద్రయతి, అప్పయార్యుడు, గంగాధరకవి, జాయపసేనాపతి, త్రిపురాంతకుడు, నరసింహకవి, విద్యానాధుడు, విశ్వనాధకవి, వీరభల్లట దేశికుడు, శాకల్య మల్లన మొదలైన వారు ప్రతాపరుద్రుని ఆస్థానంలో ఉన్న ప్రసిద్ధ విద్వాంసులు.
జాయపసేనాపతి కాకతీయ శిల్పానికి లక్షణ గ్రంథమని చెప్పదగే ‘నృత్త రత్నావళి’ ని రచించాడు. విద్యానాధుడు అగస్త్య నిఘంటువు (అగస్త్యుడు విద్యానాధుడు వేరు వేరు కారని ఒకే వ్యక్తి అని చరిత్రకారుల అభిప్రాయం) కృష్ణ చరిత్రము, నలకీర్తికౌముది, ప్రతాపరుద్ర యశోభూషణము, బాల భారతము అనే గ్రంథాలు రచించి సంస్కృత భాషలో సాహిత్య గ్రంథాలు రచించిన వారిలో ప్రథమునిగా కీర్తి పొందాడు. ప్రతాపరుద్ర యశోభూషణము అలంకార శాస్త్ర ప్రకరణ గ్రంథంగానే కాక గొప్ప ఐతిహాసికగ్రంథంగా కూడ ప్రసిద్ధి చెందింది.
కాకతీయు కాంలో ఎందరో తెలుగు కవులు కవితా సృష్టి చేసి తమ అసమాన ప్రతిభను కనబరిచారు. రాజు, రాజవంశాలను బట్టి సాహిత్య చరిత్ర నిర్మాణానికి పూనుకొన్న ఆరుద్ర వంటి వారు తమ సమగ్ర ఆంధ్ర సాహిత్య (మనవి మాటలు) గ్రంథాల్లో చాళుక్యయుగం, కాకతీయ యుగమని వరుసగా సాహిత్య చరిత్రలో యుగ విభజన చేశారు. పాశ్చాత్య చరిత్రలో ఎలిజబెతీయన్, జాకోబియన్, ఎడ్వర్డియన్ మొదలైన రాజవంశాల పేరు మీదుగా యుగ విభజన జరుగడమనేది ఆనవాయితీగా వస్తున్నదని తన పద్ధతిని సమర్థించుకున్నారు. పింగళి లక్ష్మీకాంతంగారు కవుల పేరు మీద యుగ విభజన చేయగా మరి కొందరు సాహిత్యంలో మార్పులాధారంగా పురాణేతిహాసయుగం, ప్రబంధయుగం ఇత్యాదిగా విభజించారు. మరికొందరు సామాజిక భూమిక మీద యుగ విభజన చేయాలని అభిప్రాయ పడుతున్నారు. ఏది ఏమైనా దేశచరిత్రలో సాహిత్యం ప్రధానాంశం. ప్రజాజీవిత సంబంధాలను, సమకాలపు రాజకీయ సాంస్కృతికాంశాలను సమర్ధవంతంగా వ్యక్తం చేయటంలో సాహిత్యానికి మించిన శక్తివంతమైన సాధనం మరొకటి లేదు.
తిక్కన :
గణపతిదేవుని కాలంలో రాజ్యం కోల్పోయిన మనుమసిద్ధికి తిక్కన మహాకవి గణపతిదేవుని సహాయంతో రాజ్యం ఇప్పించినట్టుగా ప్రతీతి. సామ్రాజ్య సుస్థిరత కోసం గణపతిదేవుడు మనుమసిద్ధికి తోడ్పడ్డాడు. మనుమసిద్ధి పట్టాభిషేక సందర్భంగా తిక్కన చెప్పిన ఆశీర్వచన శ్లోకమే అనంతర కాలంలో తిక్కన నిర్వచనోత్తర రామాయణానికి ఆరంభ పద్యంగా కుదురుకున్నదని పాటిబండ మాధవ శర్మగారు (భార. ఆర.పీఠిక.9 అకాడమీ ప్రతి) అభిప్రాయపడ్డారు. కాకతీయుల ఆడపడుచు కంపరాయని భార్య అయిన గంగాదేవి తన ‘‘మధురావిజయమ’’నే సంస్కృత చారిత్రక కావ్యంలో ‘తిక్కయజ్వ కవిసూక్తి’ దప్పిగొన్న చకోరాలతో కళానిధి (చంద్రుని) యొక్క వెన్నెల లాగా కవుల చేత స్వేఛ్ఛగా సేవింపబడుతున్నదని పేర్కొన్నది. తిక్కన కేవలం ‘యజ్వేకాదు మహాభారత రచన చేసి ‘‘సోమయాజి’’ అయినాడు. వేదవేదాంగపురాణేతిహాస కావ్యశాస్త్రాలను గాఢంగా అధ్యయనం చేసిన గొప్ప పండితుడు. రాజకీయ వేత్త కూడా. ‘‘అమలోదాత్త మనీష నేనుభయ కావ్య ప్రౌఢి పాటించు శిల్పమునన్ బారగుడన్, కళావిదుడ’’నని’ తిక్కన తన గురించి చెప్పుకొన్నట్లు కనిపించినా ఒక మహేతిహాసాన్ని రచించే కవికి ఉండవలసిన అర్హతలను గురించి చెప్పినట్లే భావించవలసి ఉంటుందని ఆచార్య కోవెల సంపత్కుమారాచార్యులు గారు తమ ‘‘పూర్వ కవుల కావ్య దృక్పధాలు’’ గ్రంథంలో అభిప్రాయపడ్డారు. మహాభారతంలో మొదటి మూడు పర్వములు తప్ప మిగిలిన పదిహేను పర్వములను తిక్కన ఆంధ్రీకరించాడు. తిక్కన నిర్వచనోత్తర రామాయణాన్ని మనుమసిద్ధికి, మహాభారతాన్ని హరిహరనాధునికి అంకితం చేశాడు. హరిహరనాధునికి అంకితం చేయటం కేవలం శైవ వైష్ణవ మతాల మధ్య వైమనస్యాన్ని తొలగించటం కోసమే అని కొందరు అభిప్రాయపడుతున్నారు. కాని వైష్ణవం, నాటి కాలంలో అంతగా వ్యాపించలేదు. కన్నడ దేశం నుండి వీరశైవం వచ్చినట్టు వైష్ణవం రాలేదు. నిజానికి జైన శైవాల మధ్యనే ఆ రోజుల్లో మత వైమనస్యం ఉంది. తిక్కన హరిహర తత్త్వాన్ని సగుణ నిర్గుణ తత్త్వాల సమన్విత రూపంగా భావించాడు. కనుకనే తన భారతావతారికలో ‘‘శ్రీయన గౌరి నాబరగు చెల్వకు చిత్తము పల్లవింప’’ పద్యంలో ‘విష్ణురూపాయ నమశ్శివాయ’ అన్నప్పుడు సగుణ రూపం విష్ణువని, శివుడు రూపాది రహిత నిర్గుణ తత్వ్తమని తాత్పర్యం. అందుకే హరిహరనాథుని గొల్చెద అనకుండా పరతత్త్వము గొల్చెద నన్నాడు తిక్కన. ఈ దృష్టితో గమనిస్తే తిక్కన సగుణ నిర్గుణ సమన్విత పరబ్రహ్మ తత్త్వోపాసనా లక్షణం వ్యక్తమవుతుంది. నిర్వచనోత్తర రామాయణ అవతారికలో ‘‘జాత్యము గామి నొప్పయిన సంస్కృతమెయ్యెడ జొన్ప’ 8 నని భాషా ప్రయోగాల గురించి తిక్కన చెప్పిన మాటలు ఆనాడు ప్రచారంలో ఉన్న శివకవుల భాషా ప్రయోగాదులకు నిరసనగా ప్రస్తావించినట్లు విమర్శకులు భావిస్తున్నారు.
బుహ కథార్ధంబు ఘటిత పూర్వాపరమై
యలతి యలతి తునియలఁ గా
హల సంధించిన విధంబు నమరగ జేతున్ (నిర్వ – రామా 1 – ప-16)
లలిత లలిత పదాలతో మహార్ధాన్ని స్ఫురింప చేయటమేకాదు శ్రవ్యకావ్యంలో దృశ్యకావ్యం తీరును అనువర్తింపచేసే ‘నాటకీయత’ను కూడ తన రచనలో నిక్షిప్తం చేసి తనదైన ఒక విలక్షణ కావ్య దృక్పధాన్ని ప్రకటించాడు.
మారన :
ప్రతాపరుద్రుని సమకాలికాంధ్ర రచయితలలో మారన పేర్కొనదగినవాడు. తిక్కన శిష్యుడైన మారన తన మార్కండేయ పురాణాన్ని ప్రతాపరుద్రుని సేనాని నాగయ గన్నయకు అంకితమిచ్చాడు. ఇది ప్రధమాంధ్ర పురాణంగా ప్రసిద్ధికెక్కింది. ఈ గ్రంథంలో హరిశ్చంద్ర వృత్తాంతం, వరూధినీ ప్రవరుల గాథ, మదాలసా కువలయాశ్వుల కథ, రుచి ప్రజాపతికథ, మరుత్తు వృత్తాంతం మొదలైన ఉపాఖ్యానాలెన్నో ఉన్నాయి. ఇందులోని వరూధిని ప్రవరుల గాధ అల్లసాని పెద్దన మనుచరిత్ర కథకు మూలమైంది. శంకర కవి, గౌరన మొదలైన కవులు రచించిన హరిశ్చంద్రోపాఖ్యానానికి ఈ గ్రంథమే మాతృకగా నిలిచింది. నన్నయ కథాకథన శిల్పాన్ని, తిక్కన రసవత్కావ్య కళాశిల్పాన్ని సమన్వయించుకొని పుట్టిన విశిష్ట రసవత్కావ్యమిదని డా.జి.వి.సుబ్రహ్మణ్యంగారు తన ‘ప్రథమాంధ్ర మహాపురాణం’ గ్రంథంలో పేర్కొన్నారు.
తిక్క భూపతి :
మనుమసిద్ధి కుమారుడైన తిక్క భూపతి సకల విద్యా విశారదుడని, కవి సార్వభౌమునిగా పేరు గాంచినవాడని తిక్కన తన నిర్వచనోత్తర రామాయణ అవతారికలో పేర్కొన్నాడు. ఇతని ఆస్థానంలోనే పెద్దయామాత్యుడనే కవి ఉన్నాడని, ఆశు, మధుర, చిత్ర, విస్తరములనే చతుర్విధ కవితా మార్గాలలో నిష్ణాతుడని జక్కన తన విక్రమార్క చరిత్రలో తెలిపాడు.
బద్దెన :
బద్దెన కవి గణపతి చక్రవర్తి సామంతులలో ఒకడు. భద్రభూపాలుడని ఇతనికి మరొక పేరు. నీతి శాస్త్ర ముక్తావళి, సుమతి శతకం, నీతి కృతులు ఈ కవి రచనలు. సుమతి శతక ప్రాశస్త్యం ఎనలేనిది.
రావిపాటి త్రిపురాంతకుడు :
‘‘త్రిపురాంతకోదాహరణము’’ను రచించిన రావిపాటి త్రిపురాంతకుడు ప్రతాపరుద్రుని సమకాలికుడు. ఆయన రచనలు అలభ్యం. సంస్కృతంలో ఇతడు రచించిన ప్రేమాభిరామం గ్రంథం కూడ లభించకపోయినా వినుకొండ వల్లభరాయడు ఈ గ్రంథాన్ని అనుసరించే తెలుగులో క్రీడాభిరామాన్ని రచించాడు. కాకతీయుల సామాజిక జీవనానికి ఈ రచన అద్దం పట్టింది.
భాస్కరుడు :
భాస్కర రామాయణం కాకతీయుల కాలంలో వచ్చిన మరొక గ్రంథం. రెండవ ప్రతాపరుద్రుని అశ్వసైన్యాధ్యక్షుడైన సాహిణిమారునికి అంకితమివ్వబడింది. చంపూ కావ్య రూపంలో వచ్చిన తెలుగు రామాయణాల్లో మొట్టమొదటిది భాస్కర రామాయణం. ఈ రామాయణంలోని బాల కిష్కింధాసుందర కాండలను భాస్కరుని శిష్యుడైన కుమార రుద్రదేవుడు, అరణ్య యుద్ధకాండ పూర్వభాగాలను భాస్కరుడు, యుద్ధకాండ శేషాన్ని భాస్కరుని మిత్రుడైన అయ్యలార్యుడు రచించారు. నలుగురు కవులు వాల్మీకి రామాయణాన్ని అనుసరించినప్పటికి కొన్ని కల్పితాంశాలు ఈ రచనలో కనిపిస్తాయి. కవితా శిల్పంలో, శాబ్దిక చమత్కృతిలో ఒకరికొకరు సాటి అన్నట్లుగా రచించబడిన భాస్కర రామాయణం తెలుగు సాహిత్య చరిత్రలో అపురూపమైనది.
గోనబుద్ధారెడ్డి :
గోనబుద్ధారెడ్డి రచించిన రంగనాధ రామాయణం ద్విపద సంప్రదాయంలో వచ్చింది. తెలుగులో ద్విపదలో వచ్చిన రామాయణాల్లో ఇది మొదటిది. గ్రంథారంభంలో గోనబుద్ధారెడ్డి తన తండ్రి అయిన విఠ్ఠలుని పేర రచించినట్లుగా ఉంది. గ్రంథ కర్తృత్వానికి సంబంధించిన విషయంలో వాద వివాదాలున్నాయి. గోనబుద్ధారెడ్డే ఈ రామాయణ కర్త అని పలువురి అభిప్రాయం. వాల్మీకి రామాయణమే రంగనాధ రామాయణానికి మూలమైనా, వాల్మీకంలో లేనివి, ప్రజాసామాన్యంలో వ్యాపించి ఉన్న ఎన్నో కథాంశాలు తన రచనలో చేర్చాడు. గ్రంథారంభంలో
పదశయ్యలర్థ సౌభాగ్యముల్ యతులు
రసములు కల్పనల్ ప్రాస సంగతులు
అసమాన రీతులు నన్నియు గలుగ’
రామాయణాన్ని రచిస్తానని చెప్పినట్లుగానే సమర్ధవంతంగా రచించాడు. వర్ణనలతో పాటు కథను సరళంగా చెప్పి భావోల్బణం కలిగించడం కవి ప్రజ్ఞకు, కథనరీతికి ఉదాహరణగా చెప్పవచ్చు. రాముడు వనవాసానికి బయలుదేరుతున్నపుడు దశరధుడు పుత్ర వియోగం భరించలేక సుమంత్రునితో రథమాపుమని చెపుతాడు. రథ మాగకనే వెళ్లిపోతుందని అతడు చెప్పినప్పుడు దశరధుని దు:ఖం, మనోవ్యాకులత ఈ సందర్భంలో అద్భుతంగా వర్ణించబడింది.
తన సూను రథమును తప్పక చూచి
అదియును గానక ధూళినటు చూచి చూచి
అదియును గానక బయలటు చూచి చూచి
హాయని యెలుగెత్తి హా రామ రామ
హాయని మూర్ఛిల్లె…….
‘అదియును గానక’ అనే మాటను, ‘అటు చూచి చూచి’ అనే మాటలను రెండు సార్లు ప్రయోగించటం వల్ల దశరథుని దు:ఖావేశం అభివ్యక్తమైంది. రధగమనం సూచింపబడింది. పాల్కురికి సోమనాధుడు తెలుగులో ద్విపద రచనా సంప్రదాయాల్ని పాటించినా సోమనాధుని కావ్యాల్లో ప్రతికూల లక్షణం అధికంగా కనిపిస్తుంది. శైవమతాభిమానులకే పరిమితమై పోయింది. కాని రంగనాధ రామాయణం అనుకూల లక్షణం కలది. కాబట్టి అందరికీ అంగీకారమే కాక ప్రబంధ కవుల పద బంధాలకు దూరంగా ఉండటం, ప్రజాసామాన్యంలో వ్యాపించి ఉన్న కథాంశాలను స్వీకరించటం జన భావనలకు సన్నిహితమై ఉండటమనే గుణాలు రంగనాధ రామాయణానికి గొప్ప ప్రశస్తిని తెచ్చిపెట్టాయి.
విశ్వేశ్వర శివదేశికవి :
విశ్వేశ్వర శివదేశికవి గణపతి దేవునికి దీక్షా గురువు. గోళకీ మఠాధిపతి, ఇతడు రచించిన ‘శివ తత్త్వ రసాయన’ మనే గ్రంథం లభించలేదు.
శివదేవవిద్వత్కవి :
గణపతిదేవ, రుద్రమదేవి, ప్రతాపరుద్రుల దగ్గర ఇతడు మంత్రిగా ఉన్నాడు. పురుషార్ధసారము, శివదేవ ధీమణి శతకము మొదలైన గ్రంథాలు రచించినట్లు ‘సకనీతి సమ్మతము’ పీఠికలో మానవల్లి రామకృష్ణకవిగారు తెలిపారు.
ఇంకా తెలుగు రచయితలలో విద్యానాధుని సమకాలికులలో కేతన, అధర్వణాచార్యుడు, మంచన, అప్పనమంత్రి, పావులూరి మల్లన, ఎఱ్ఱన మొదలైన వారు పేర్కొనదగినవారు.
శ్రీపతి పండితుడు :
శ్రీపతి పండితుడు కాకతీయ సామ్రాజ్య తెలుగు కవులలో శైవ పండిత త్రయంలో మొదటివాడు. రెండవ ప్రోలరాజుకు సమకాలికుడు. శైవులు ఆ కాలంలో తమ మతవ్యాపనం కోసం తెలుగులో రచనలు చేశారు. ఇతడు ‘శివదీపిక’ అనే గ్రంధాన్ని రచించినట్లు తెలుస్తున్నది. అదిప్పుడు అలభ్యం. శివుడొక్కడే దైవమని నిరూపించటానికి కొంగున నిప్పులు మూటకట్టిన మహానీయుడని శివతత్త్వసార గ్రంథంలో పండితారాధ్యులు ప్రశంసించారు.
శివలెంక మంచన :
శివలెంక మంచన శైవ పండిత త్రయంలో రెండవవాడు. రెండవ ప్రోలరాజు కాలంలో ఉన్నట్లు చెపుతారు. ఇతడు రచించిన తెలుగు గ్రంథాలు అలభ్యం. ‘యత్సంవిత్’ అనే వాక్యానికి నాలుగు వేల గూఢార్ధాలు (మునుయత్సంవిత్తను వాక్కునకు జెప్పె నాల్గువేల గూఢార్థములన్) చెప్పినట్లు శివకవి కంఠాభరణం తెలుపుతున్నది.
మల్లికార్జున పండితారాధ్యుడు :
మల్లికార్జున పండితారాధ్యుడు శైవ పండితత్రయంలో తృతీయుడు. ఆరాధ్యశైవ సంప్రదాయానికి మూలపురుషుడు. కాకతీయ రుద్రదేవుని సమకాలికుడు. పాశుపత శైవ సంప్రదాయానికి చెందినట్లుగా ఇతని ‘శివతత్త్వసారం’ వల్ల తెలుస్తున్నది. దక్షాధ్వరము, వ్యాసాష్టకము, గణాడంబరము, శారభము, పంచగద్యములు, శివతత్వ్తసారము, తుమ్మెద పదాలు, ప్రభాతపదాలు మొదలైనవి పండితుని రచనలుగా తెలుస్తున్నాయి. వీటిలో శివతత్త్వ సారం పేరుతో అయిదువందల కంద పద్యాలు తప్ప మరే ఇతర రచనలు లభించలేదు.
నన్నెచోడుడు :
నన్నెచోడ మహాకవి పన్నెండవ శతాబ్దం కంటే పూర్వుడని కాకతీయ రాజుల ఆరంభ కాలంలో ఉన్నాడని విమర్శకుల అభిప్రాయం. కుమార సంభవమే కాక, కళా విలాసమనే కావ్యాన్ని కూడా రచించినట్లు కుమార సంభవ ప్రథమ భాగ పీఠికలో మానవల్లి రామకృష్ణ కవి తెలిపారు. మార్గదేశి భేదాన్ని తెలుగు సాహిత్యానికి పరిచయం చేసి ‘కుమార సంభవం’ అవతారికలో ఈ విధంగా ప్రస్తావించాడు.
బున వెలయగ దేశికవిత బుట్టించి తెనుం
గున నిల్పి రంధ్ర విషయం
బున జన చాళుక్యరాజు మొదలుగ పలువుర్
అంతేకాక నన్నె చోడుడు ‘సరళముగాగ భావములు జాను తెనుంగున నింపు పెంపుతో’ అన్న పద్యంలో తన కవిత్వ లక్షణాలుగా వస్తు కవిత, జాను తెనుగు, వర్ణనా నైపుణ్యం, అర్ధపుష్టి, రసదృష్టి మొదలైనవి పేర్కొన్నాడు. వస్తు కవిత అంటే ఆయన కావ్యంలో చేసిన వస్తు ప్రయోగ సందర్భాలను సమన్వయిస్తే కావ్యానికి అవసరమైన ‘సూక్తులు, వర్ణనలు, గుణములు రసములు’ మొదలైన సామగ్రిని ఆయన వస్తువుగా భావించినట్లు స్పష్టపడుతుంది.9
నన్నెచోడుడు తన కావ్యాన్ని గురువైన జంగమ మల్లికార్జునికి అంకిత మిచ్చాడు. కావ్యమంతటా శివపారమ్యమే చిత్రింపబడింది. పరమత నిందకనిపించదు. కోవెల సంపత్కుమారాచార్యులు గారు అభిప్రాయపడినట్లుగా కుమార సంభవంలో భక్తి సంప్రదాయం కన్న జ్ఞాన సంప్రదాయమే పుష్కలంగా కనిపిస్తుందన్నది నిజం. ‘జ్ఞాన దీపంబు హృత్సదనంబులో దాన, దీవియగా నెత్త దివురువారు… వెలయ మత్కృతి సదువుడు, వినుడు, వ్రాయుడీశ్వరాంబికాగుహులిత్తురీప్సితము’ .. (12`225) అన్న పద్యమే దీనికి తార్కాణంగా చెప్పవచ్చు.
కేతన :
కాకతీయుల కాలం నాటి వాడైన కేతన తన ‘దశకుమార చరిత్ర’ను తిక్కనకు అంకితమిచ్చాడు. దండి సంస్కృతంలో రచించిన ‘దశకుమార చరిత్ర’ వచన కావ్యాన్ని తెలుగులో పరివర్తింపచేశాడు. ఒక కవికి మరొక కవి కావ్యాన్ని అంకిత మివ్వటం కేతన నుండే ప్రారంభమైంది. విజ్ఞానేశ్వరీయం అనే ధర్మ శాస్త్రగ్రంథాన్ని, ఆంధ్ర భాషా భూషణం అనే వ్యాకరణ గ్రంధాన్ని రచించాడు. వ్యాకరణ శాస్త్ర వికాసంలో, భాషాశాస్త్ర దృష్ట్యా కేతన రచించిన వ్యాకరణ గ్రంథానికి ఎంతో ప్రాముఖ్యమున్నది. దశకుమార చరిత్రలో సామాన్య జనుల విశ్వాసాలు, ఆచార వ్యవహారాలు, అధికార వర్గాల్లో ఉండే మోసాలు మొదలైన నాటి సామాజికాంశాలు వర్ణింపబడ్డాయి. కాకతీయ యుగంలో బయ్యన, వేములవాడ భీమకవి, యధావాక్కుల అన్నమయ్య ఉన్నట్లు తెలుస్తున్నది. కొందరి కాల నిర్ణయంలో అభిప్రాయ భేదాలున్నాయి. కాకతీయుల సమకాలంలో ఉన్న పాపులూరి మల్లన్న రచించిన ‘‘గణితసారము’’ అన్న గ్రంథం పేర్కొనదగింది. ఇందులో ఆనాటి తూనికలు – కొలతలు మొదలైన విషయాల వివరణ ఉంది.
పాల్కురికి సోమనాధుడు :
కాకతీయుల సమకాలంలో వెలసిన మహాకవి పాల్కురికి సోమనాధుడు మొదటి ప్రతాపరుద్రుని ఆశ్రయం పొందాడని బండారు తమ్మయ్యగారు అభిప్రాయపడ్డారు.10 కాలం విషయంలో అభిప్రాయ భేదాలున్నప్పటికి కాకతీయరాజుల ఆశ్రయంలో ఉన్నాలేకపోయినా వారి సమకాలంలో సోమన ఉన్నట్లు సర్వులు అంగీకరించిన విషయమే. మత ప్రచారానికి సాహిత్యాన్ని సాధనంగా ఉపయోగించుకున్న సోమన తెలుగు సాహిత్య చరిత్రలో తొలి ఉద్యమకారుడు. క్రీ.శ 1168 వ సంవత్సరానికి ఇంచుక ముందో తరువాతనో జన్మించి క్రీ.శ 1240 ప్రాంతం వరకు జీవించాడని బండారు తమ్మయ్యగారు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. సోమన సంస్కృత, ఆంధ్ర, కన్నడ భాషలలో ఎన్నో రచనలు చేసిన గొప్ప సాహిత్య వేత్త. ‘దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావుగారు సోమనాధుని రచనలను ఈ విధంగా పేర్కొన్నారు. 1. అనుభవసారము 2. బసవ పురాణము 3. వృషాధిపశతకము 4. అక్షరాంక గద్య 5. అక్షరాంక పద్యములు 6. పంచప్రకారగద్య 7. శరణుబసవ గద్య (కన్నడం, తెలుగు) 8. అష్టోత్తర శతనామ గద్య (సంస్కృతం) 9. సద్గురు రగడ (తెలుగు, కన్నడం) 10. గంగోత్పత్తి రగడ (అలభ్యం) 11. బసవోదాహరణము (తెలుగు, సంస్కృతము) 12.చతుర్వేదసారము (బసవలింగ శతకము) 13. సోమనాధ భాష్యము (సంస్కృతం) 14. రుద్రభాష్యము (అలభ్యము) 15. వృషభాష్టకము (సంస్కృతం) 16. చెన్నమల్లు సీసములు 17. సోమనాధ స్తవము 18. మల్లమదేవి పురాణము (అలభ్యం) 19. పండితారాధ్య చరిత్ర మొదలైనవి.
సంస్కృత భూయిష్ఠ రచన సర్వసామాన్యం కాదని, ప్రాచీన పురాణాలను వదలి తేట తెనుగు మాటలతో సోమన తన సమకాలికులైన బసవని, పండితారాధ్యుల జీవితాలనే పురాణాలుగా రచించాడు. సంస్కృత వృత్తాలను వదలి ద్విపదలలో రచన చేసినాడు.
సరసమై పరగిన జాను తెనుంగు
కూర్చెద ద్విపదల కోర్కెదైవార
ఆరూఢ గద్య పద్యాది ప్రబంధ
పూరిత సంస్కృత భూయిష్ఠ రచన
మానుగా సర్వసామాన్యంబుగామి’ అని
పలికి ‘జాను తెనుగు విశేషము ప్రసన్నతకు’ అని స్పష్టం చేసి భాషా విషయంలో సంస్కృత భూయిష్ఠ రచనకు ప్రతిగా జాను తెనుగును స్వీకరించాడు. మత విషయంలో సాహితీ రీతుల విషయంలో సాహిత్య వస్తువు విషయంలో ఒక విలక్షణ మార్గాన్ని అనుసరించాడు. ఆ కాలంలో ప్రచలితమై ఉన్న మార్గపద్ధతిని కాదని,సంస్కృత కావ్య సంప్రదాయాలకు స్వస్తి చెప్పి, ప్రజల నిత్య జీవితంలో వినబడే దేశీ ఛందస్సంప్రదాయాలను స్వీకరించి వాటికొక ఉత్తమ స్ధానాన్ని కలిగించి విభిన్న దేశి కావ్య పద్ధతులకు శ్రీకారం చుట్టాడు. ముఖ్యంగా ద్విపద, శతక, ఉదాహరణ, గేయాది కృతులకు ఇతడే ప్రవర్తకుడైనాడు. కన్నడ దేశంలో బసవేశ్వరుడు ఉజ్జీవింపచేసిన వీరశైవ మతం సోమన కవితాశక్తికి ఆలంబనంగా నిలిచింది. ఇతడు ప్రచారం చేసిన శైవ మతంలో భక్తియే జీవనాడి, జాతికుల భేదాలు కాని స్త్రీ, పురుష విభేదాలు కాని లేవు.
బసవ పురాణంలో ఒక్కొక్క భక్తుని కథ ఒక్కొక్క మణిపూస, బల్లేశుమల్ల, కాట కోటయ్య, ముగ్ధ సంగయ్య, రుద్రపశుపతి, బెజ్జమహాదేవి, గొడగూచి, దీపద కళియారు నాట్య నమిత్తండి, కన్నప్ప, మడివాలు మాచయ్య, నిమ్మవ్వ, సిరియాలుడు మొదలైన భక్తుల కథల నెన్నింటినో వర్ణించి వాయార భక్తుల వర్ణింపగంటి పాయక నా జిహ్వ పావనంబయ్యె’ అని భావించినాడు.
ద్విపద సాహిత్యంలోనే మకుటాయమైనది పాల్కురికి సోమనాధుని పండితారాధ్య చరిత్ర గ్రంథం. ఇందులో అతడు స్పృశించని అంశమే లేదంటే అతిశయోక్తికాదు. ఆనాటి ఆటలు, పాటలు, విద్యలు, వినోదాలు మొదలుకొని వస్త్రాలు, వీణలు, రాగాలు, ఆభరణాలు, నేత్ర వ్యాధులు, చికిత్సలు మొదలైన వెన్నో చెప్పాడు. కాకతీయుల కాలం నాటి స్థితిగతులకు ఈ రచన అద్దం పట్టింది. విషయ విన్యాసంలోను, దేశీయతను ప్రదర్శించటంలోను తూగులో, ధారలో, నడకలో, ఔద్ధత్యంలో పండితారాధ్య చరిత్రను మించిన గ్రంథం లేదని తెలుగు సాహిత్యంలో మహాభారతం ఎటువంటిదో, శివకవుల రచనలలో సోమనాధుడు రచించిన ఈ గ్రంథం అటువంటిదని విమర్శకుల అభిప్రాయం. అది ఒక విజ్ఞాన సర్వస్వమని చెప్పవచ్చు. తన కవితా ప్రవాహానికి అవరోధాలనిపించినపుడు భాషా సంప్రదాయాలను, వ్యాకరణ నిబంధనలను నిరాటంకంగా త్రోసి పుచ్చుతాడు. చౌర్యం, ద్యూతం, విటత్వం, రసవాదం, సంగీత శాస్త్రం, చతుర్వేదాలు, అష్టాదశ పురాణాలు, నానా విధాహార విహార వేష వైఖరులు మొదలైన ఎన్నో అంశాలను సోమనాధుడు సందర్భోచితంగా తన రచనలలో వర్ణించాడు. సోమనాధుని వైదుష్యానికి అతనికి రచనలే ప్రమాణం.
జనసామాన్యం వాడుకలో ఉన్న పలుకు బడులను, జాతీయాలను, సామెతలను విరివిగా ప్రయోగించి ఈ సాహిత్యం తమదే అన్న భావం కలిగించాడు. పునరుక్తులు ప్రయోగించటం, ఒకే అంశాన్ని ఒకేవిధంగా వరుసగా చెప్పుకు పోవటం వంటి బుర్రకథలలోని లక్షణాలను సోమనాధుడు తన కావ్యాలలో స్వీకరించాడు. కథకుడు, శ్రోత ఉభయులు దాదాపు ఒకటిగా మారేస్థితి జానపద కథాగేయాల్లో కనిపిస్తుంది. ఆ లక్షణం తన సాహిత్యంలో ప్రవేశ పెట్టాడు. పండితులకు, జనసామాన్యానికి ఆమోద యోగ్యంగా నన్నయ మార్గానికి ప్రతిగా దేశీ సాహిత్యోద్యమ్యాన్ని ఆరంభించి తుదముట్ట కొనసాగించాడు. తన రచనలో ప్రధాన జీవన సంస్కృతితో పాటు భిన్న భిన్న ప్రజా సమూహాల సంస్కృతిని అభివ్యక్తీకరించటంలో సోమనాధుని మించిన వారులేరు. సోమనాధుని మత పాక్షికత రుచించక పోవటం వల్ల శైవేతర కవులు అతని కావ్యాలను ఉపేక్ష చేసినట్లు కనిపిస్తుంది. ఎవరు ఉపేక్షించినప్పటికి అతని రచనలలోని సాహిత్యపు విలువలు, దేశి ఉద్యమం, తరువాతి కాలపు సాహిత్యాన్ని ఎంతో ప్రభావితం చేసింది. ఆనాటి తెలంగాణా జన జీవితాన్ని మన కళ్ళ ముందుంచింది.
వినుకొండ వల్లభరాయడు :
కాకతీయ సామ్రాజ్య పతనానంతరం వచ్చిన ప్రతాపరుద్ర చరిత్రము, సిద్ధేశ్వర చరిత్రము, సోమదేవ రాజీయము, క్రీడాభిరామము గ్రంథాలు కాకతీయ వైభవాన్ని తెలుపుతున్నాయి. ముఖ్యంగా వినుకొండ వల్లభరాయడు రచించిన క్రీడాభిరామం కాకతీయుల జన సామాన్య జీవన విధానాన్ని ప్రతిబింబింపచేసింది. రావిపాటి త్రిపురాంతకుని సంస్కృత ప్రేమాభిరామానికి ఆంధ్రానుసరణం ఇది.
ఈ త్రిపురాంతకుడు, రావిపాటి తిప్పన ఒక్కరే అని ఇతడు ప్రతాపరుద్రుని కాలంలో ఉన్నాడని విమర్శకుల అభిప్రాయం. కనుకనే తెలుగులోకి అనువర్తింపబడిన క్రీడాభిరామంలో ఏకశిలా నగర వర్ణన ఉండటంలో ఆశ్చర్యం లేదు. కాకతీయ కాలం నాటి సాంఘిక ఆర్థిక పరిస్థితుకు అద్దం పట్టింది ఈ రచన. క్రీడాభిరామం ‘‘సిటీమ్యాప్’’ లాంటిదని అంటారు. నగర నిర్మాణ తీరుతెన్నులు, నాటి వృత్తులు, కులాలు, ఆటలు, పూటకూళ్ల భోజనాలు, సామాన్య ప్రజల ఆచారాలు, విశ్వాసాలు మొదలైన వెన్నో ఈ గ్రంథంలో మనోజ్ఞంగా చిత్రింపబడ్డాయి. ఏకవీర, మైలారుదేవుడు, భైరవుడు, చమడేశ్వరి, మూసానమ్మ, వీరభద్రుడు, పాండవులు, మాచెర్ల చెన్నడు మొదలైన దేవతల ప్రస్తావనలు ఇందులో చోటుచేసుకున్నాయి. రాజప్రసాదంలో గడియారమున్నట్లు తెలుస్తున్నది. నాడు దేవాలయాలలో కూడా గడియారాలున్నట్లు శాసనాలు తెలుపుతున్నాయి. పూట కూటిండ్లు, వేశ్యావాటికలు, మేషయుద్ధాలు, పాములాటలు, కోళ్ళపోరు మొదలైనవి కూడ వీధి ప్రక్రియకు చెందిన ఈ క్రీడాభిరామంలో ప్రస్తావించబడినాయి. మాచల్దేవి అనే వారాంగన ఇంట్లో ఉన్న చిత్రశాల కూడ వర్ణించబడటం వల్ల కాకతీయుల కాలంలో ఉన్న వాస్తు కళతోపాటు చిత్రకళ ప్రాధాన్యం తెలుస్తున్నది. ఓరుగల్లు మహావైభవాన్ని తెలిపే ఈ గ్రంథం తెలుగు సాంస్కృతిక సాహిత్య చరిత్రలో అపురూపమైంది.
కాకతీయుల కాలంలో వెలసిన తెలుగు సాహిత్యానికి ఎంతో సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఎందరో కవులు, తమ రచనలతో తెలంగాణా నేలను సుసంపన్నం చేశారు. అవకాశాన్ననుసరించి ఆయా కవుల రచనల్లోని అంతస్తత్త్వాన్ని, సామాజిక చైతన్యాన్ని అందించే ప్రయత్నమే ఈ వ్యాసం. సాహిత్యానికి సంస్కృతికి పరస్పర సంబంధముంది. సామాజిక యుగధర్మాలు ఆయా కాలాల్లో వెలువడిన సాహిత్యంలో అనివార్యంగా చోటు చేసుకుంటాయి. కనుక తద్వారా సామాజిక, సాంస్కృతిక పరిణామాలను కూడ అవగతం చేసుకునే వీలున్నది.
పాదసూచికలు :
- ఆంధ్రుల సాంఘిక చరిత్ర, సురవరం ప్రతాపరెడ్డి, సాహిత్య వైజయంతి ప్రచురణ, 1982
2,4. Inscriptions of Andhra Pradesh, Warangal District no. 15.
- కాకతీయ సంచిక – సంపాదకుడు డా. మారేమండ రామారావు – పుట. 363
- తెలంగాణా శాసనములు – లక్ష్మణరాయ పరిశోధక మండలి.
6,7. కాకతీయ శాసనాలు – ఆంధ్రభాషాపరిశీలన. పుట. 53, 78. డా. ఎన్. ఎల్. ఎన్. ఆచార్య
- తెలుగు సాహిత్య చరిత్ర (SDCLCE), Kakathiya University, Warangal.
- పూర్వ కవుల కావ్య దృక్పధాలు – కోవెల సంపత్కుమారాచార్య.
- కాకతీయ సంచిక – పాలకురికి సోమనాథకవి – శ్రీ బండారు తమ్మయ్యగారు. పుట. 207
ఉపయుక్త గ్రంథ సూచిక :
- ఆంధ్ర ప్రతాపరుద్ర యశోభూషణము – చెలమచెర్ల రంగాచార్యులు శ్రీనివాస పబ్లికేషన్స్ – 2005
- కాకతీయ శాసనాలు – ఆంధ్ర భాషా పరీశీలన – డా. ఎన్.ఎల్. ఎన్ ఆచార్య – తెలుగు పరిశోధన ప్రచురణలు – 1987
- తెలుగు సాహిత్య సమీక్ష – డా. జి. నాగయ్య, నవ్య పరిశోధక ప్రచురణలు – తిరుపతి
- ఆంధ్రుల సాంఘిక చరిత్ర – సురవరము ప్రతాపరెడ్డి – సాహిత్య వైజయంతి ప్రచురణ – 1982
- కాకతీయ సంచిక – సంపాదకులు – డా. మారేమండ రామారావు – పురావస్తు ప్రదర్శన శాలలశాఖ – హైదరాబాద్ – 1991
- కాకతీయ వైభవ తోరణాలు – డా. పోలవరపు హైమవతి – భార్గవ పబ్లిషర్స్ – వరంగల్ – 2003
- కైఫియత్తు – చారిత్రక పౌరాణికాంశాలు – డా. ఎస్. వాణీకుమారి (సిద్ధాంత గ్రంథం) – 1993
- కాకతీయ వైభవము – సాహిత్యము – కళలు – శిల్పము – ఆచార్య హరిశివకుమార్ – శ్రీకృష్ణ ప్రచురణలు, వరంగల్ – 2000
- తెలంగాణా శాసనములు – 1 – లక్ష్మణరాయ పరిశోధక మండలి
- తెలంగాణా శాసనములు – 2 – గడియారం రామకృష్ణ శర్మ
- పాల్కురికి సోమనాథుని కృతులు – పరిశీలన డా.వే.న. రెడ్డి – జాతీయ సాహిత్య పరిషత్ – వే.న. రెడ్డి పరిశోధన గ్రంథ ప్రచురణ సంఘం.
- ప్రతాపరుద్ర చరిత్ర – ఏకామ్రనాధుడు.
- బసవపురాణము – పాల్కురికి సోమనాథుడు.
- ఆంధ్రుల సాంఘిక చరిత్ర – సంస్కృతి – డా. బిఎన్. శాస్త్రి
- విజ్ఞాన సర్వస్వము – 3,4, సంపుటాలు – తెలుగు భాషా సమితి – మద్రాసు
- తెలుగు సాహిత్య చరిత్ర SDLCE (Course Material) Kakaatiya University
- పూర్వ కవుల కావ్య దృక్పథాలు – కోవెల సంపత్కుమారాచార్య.
- Inscriptions of Andhra Pradesh Warangal District – No. 15.
ఆచార్య జ్యోతి పాకనాటి
విశ్రాంతాచార్యులు
తెలుగు శాఖ
కాకతీయ విశ్వవిద్యాలయం
వరంగల్.