"తెలుగు శాఖ, స్నాతకోత్తర కేంద్రం గద్వాల, పాలమూరు విశ్వవిద్యాలయంలో నేను బోధించే సిలబస్, సిలబస్ లోని పాఠ్యాంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారం ప్రతిబింబించే వేదిక."

శకుంతలోపాఖ్యానంలోని వ్యకిత్వ వికాసం - 2

 ఇప్పుడు శకుంతలోపాఖ్యానం కథను పరిశీలిద్దాం. ఇది అందరికి తెలిసిన కథే. అలనాటి ఈ కథ ఈనాడు ఇచ్చే సందేశమేమిటి? అన్న ప్రశ్న ఇందులో గల మనస్తత్వ పరిశీలన మన వ్యక్తిత్వాలను, సమాజంలో మన స్వలాభాలను వెల్లడింపజేస్తుంది. ఇవ్వాళ దుష్యంతుడు వంటి రాజులు లేకపోవచ్చు. కణ్వునిలాంటి ఋషులు లేకపోవచ్చు. కాని అలాంటి స్వభావంగల మరో పేరున్న మనుషులు ఉంటారు.

దుష్యంతుడు ఒంటరిగా కణ్వాశ్రమానికి వచ్చాడు. కణ్వుడు లేడు. అయినా శకుంతల ప్రభువు కాబట్టి ఆతిధ్యమిచ్చింది. ఆతిధ్యం స్వీకరించి వూరుకొన్నాడా? ఆమె అందంపై కన్నువేశాడు. ఆమె చరిత్ర తెలుసుకొన్నాడు. కణ్వమహర్షి కూతురు కాదు కాబట్టి మనసుపడ్డాడు. ఇక్కడే ఉంది మనుష్య స్వభావం. విశ్వామిత్ర-మేనకల అక్రమసంబంధానికి పుట్టినది అనగానే కొంత అలుసు. పైగా రాజ అన్న ఆత్మ ప్రత్యయం ఎలాగో ఉండనే వుంది.

మగవాడి స్వభావాన్ని, స్త్రీ స్వభావాన్ని ఈకథలో తరచి చూడవచ్చు. మనసుపడిన ఆడదానిని ఎలాగైనా లొంగదీసుకోవాలన్నది మగవాడి స్వభావం. మరోవిధంగా చెప్పాలంటే బుట్టలో వేసుకోవడం లేదా అనుభవించడం! మగవాడి దృష్టి సామాన్యంగా ఇదే! పైగా ఆలనాపాలనా మరొకరి దగ్గర కల కన్య! తల్లితండ్రి లేని పిల్ల! 'ట్రాప్' చెయ్యడం సులువన్న భావన.

శకుంతలకి కూడా దుష్యంతునిపై మనసైంది. "అనంత విలాసంబున జయంతుండ పోని దుష్యంతుండనెఱింగి, యతిసంభ్రంబున..." అని నన్నయ శకుంతల అంతరంగాన్ని బయటబెట్టాడు.

"ఈ వల్కలాజినములకు
నీ వన్య ఫలాశనముకీ విటపకుటే
రావాసములకునుచితమే
నీ విలసిత రూపకాంతి నిర్మల గుణముల్"

అన్నాడు దుష్యంతుడు - "నీ అందమైన రూపం, నీ మేనికాంతి, మచ్చలేని నీ గుణాలు... ఈ నార చీరలు కట్టడానికి, అడవిలో పండ్లు తినడానికి, ఈ ఆకుల గుడిసెలో నివసించడానికి తగినవి కావు సుమా!" అని పై పద్యానికి భావం. అంటే ఆవిడ ప్రస్తుత జీవనవిధానంపై వ్యతిరేక భావాన్ని పుట్టించి - తన రాజభోగాలపై మనసును తిప్పటానికి చేసే ప్రయత్నం ఇది! తన వైపుకు తిప్పుకునే ఎత్తులో ఎవరైనా ఎదుటివారికి లేని వాటిని ఎర చూపించటం సహజమైన ప్రయత్నమే! ఈ మునిపల్లెలో ఉండటానికి తగినదానవు కావు" అనడంలో ఈ ఉపాయమే కనిపిస్తుంది.

అయితే దుష్యంతుడు కొంతలో కొంత సక్రమమైన పాచికే వేశాడు. అనుభవిస్తానని అనలేదు. "నాకు భార్యవయి భాసురలీల నశేష రాజ్యలక్ష్మి మహనీయ సౌఖ్యముల మేలుగనందుము..." అన్నాడు. సుఖాలపట్ల ఎవరికైనా మక్కువ ఉంటుంది. పైగా మహరాజుకి భార్యగా వెళ్ళడం కంటే అదృష్టం జీవితంలో ఏముంటుంది? కణ్వాశ్రమంలో ఉండే జీవితాన్ని రాణీగా ఉండే జీవితంతో పోల్చుకుంటే ఎవరైనా సుఖాలపట్ల, భోగాలపట్ల ఆకర్షితులవుతారు. మనకు లేనిది, పొందనిది... అలవోకగా వస్తే కాదనగలమా? ఇదీ సైకాలజీ! శకుంతల దైన్యస్థితినుంచి - పెళ్ళిస్థాయికి - అక్కడినుంచి భోగస్థితికి తీసుకవచ్చేలా మాట్లాడుతాడు దుష్యంతుడు. ఎదుటివారిని మచ్చిక చేసుకోవడం ఎలాగో తెలిసిందే కదా!

దుష్యంతుడు ఎత్తుకు పై ఎత్తు వేశాడు. గాంధర్వ వివాహం మేలైనది, ఉత్తమమైనది, సముచుతమైనదని ఆధారం చూపించాడు. అంటే తప్పించుకోలేని విధంగా తన ఆత్రుతను ప్రదర్శించాడు.

అయితే శకుంతల వెంటనే అంగీకరించలేదు. కొంచెం జ్ఞానం కలదే. కణ్వ మహర్షి ఇప్పుడే వస్తారు. ఆయన అంగీకరిస్తే ఇప్పుడే పెళ్ళి చేసుకోవచ్చు అన్నది. అప్పుడు నాకు అభ్యంతరం లేదన్నది. అంటే తనకిషటమే కాని - కణ్వునితో చెప్పి చేసుకుందాం అన్నది. దిక్కులేని దానిని తీసుకవచ్చి, పెంచి, పోషించి, కన్నకూతురిలా చూసుకొన్న కణ్వుని పట్ల ఆమాత్రం కృతజ్ఞత ప్రదర్శించటాన్ని మెచ్చుకొంటాం. ఇది సుగుణమే.

కాని - ఈ గుణం తాత్కాలికమైంది. ఈ అభిప్రాయం పైనే నిలవలేదు. మనసు మార్చుకొంది. స్త్రీ యొక్క చపలచిత్తం అది. అయితే కణ్వుని ప్రాపకంలో పెరిగింది కాబట్టి కొంచెం బుర్ర కలది! నీకూ, నాకు పుట్టిన కుమారుడు యువరాజు అయితే - నాకు అభ్యంతరం లేదంది.

దుష్యంతుడు తడుముకోలేదు. అంటే, No second opinion, No rethinking, వెంటనే అలాగే (OK) అన్నాడు. ఏ మగాడైనా వ్యామోహంలో ఉన్నపుడు ఏ కోరిక కోరినా - సరేనంటాడు. ఇది మగ మనస్తత్వం. తన కోరికను తీర్చుకోవడమే తక్షణ లక్ష్యం. శకుంతల పప్పులో కాలేసింది. మహారాజు కాబట్టి - నమ్మకం ఉంచి 'రతి ' సుఖాన్ని ఇచ్చింది. శకుంతల కూడా రాజుతో పొందు కోరుకుంది. ఏ స్త్రీయైనా తనకంటే ఉన్నత స్థితిలో ఉన్నవారితో "పొందు" లేక "సుఖం" కోరుకుంటుంది. అప్పుడు నమ్ముతుంది. అలాగే దుష్యంతున్ని నమ్మింది. మనం కూడా ఎదుటివారి మాటలకి లొంగిపోతాం. మరీ నమ్ముతాం. ఇది లోకస్థితి కూడా.

కొడుకు పుట్టిన తర్వాత కణ్వుడు -

"ఎట్టి సాధ్వకులకు బుట్టిన యిండ్లను పెద్ద కాలమునికి తద్ద తగదు"

అంటూ శిష్యున్ని ఇచ్చి దుష్యంతుడి దగ్గరకు పంపాడు. దుష్యంతుడు -

"ఎ నెఱుగనిన్ను, నెక్కడి దానవు?" అన్నాడు. తెలిసే అన్నాడు. అవసరానికి ఎవో కబుర్లు చెప్పి అనుభవించాడు. తర్వాత మర్చిపోయాడు.

బహుకార్యభార నిమగ్నుడైన రాజుకి ఇవన్నీ మామూలే! అవసరం తీరాకా ఎవరైనా "కూరలో కరివేపాకు"లా పారేస్తారు. పట్టించుకోరు. రాజు కావచ్చు. సేవకుడు కావచ్చు. ఇదే స్వభావం ఉంటుంది.

ఇక్కడే ఈ కథ స్త్రీకి ఒక గుణపాఠం చెప్తుంది. "వ్యకిత్వ వికాసం" పై సలహా ఇస్తుంది. పెళ్ళికి ఒక సాక్ష్యం ఉండాలి. ఆధారం ఉండాలి. లేకపోతే మాటకి విలువ ఉండదు. తొందరపడి గాంధర్వానికి ఒప్పుకోవడంలోనే తప్పు చేసింది. అందుకే అందుకే పెళ్ళికి సకుంటూంబ సపరివార సమేతంగా పిలుస్తాం. అప్పుడే పెళ్ళికొడుకు బుద్ధిగా ఉంటాడు. "ఇంతమంది" సాక్ష్యులున్నారని జాగరూకతతో ఉంటాడు.

అయినా స్త్రీ ఏడవకూడదు. తన విధి ఇంతేనని నిరాశ, నిస్పహ చెందకూడదు. పరిస్థితిని ఎదుర్కోవాలి. "Life is a challenge. Face it." బేల కాకూడదు. ఆత్మహత్య చేసుకోకూడదు. సమస్యకి పరిష్కారం అది కాదు. పోరాడాలి. సమస్యను పరిష్కరించుకొనే మార్గాలు అన్వేషించాలి. స్త్రీ అబల కాదు, సబల అని చాటాలి. అందుకే శకుంతల దుష్యంతున్ని ఎదుర్కొంది. ఢీ కొట్టింది. వాదించింది. నిండు కొలువులో బుద్ధులు చెప్పింది. రాజు ఎలా ఉండాలో పాఠం చెప్పింది. తప్పు చేయనప్పుడు గుండె ధైర్యంతో వాదించాలి - అన్నదే సందేశం.

శకుంతల ఎంత పోట్లాడినా స్త్రీ కదా! ఆ బేలతనం ఎక్కడికి పోతుంది. అందుకనే -

తడయక పుట్టిననాడు తల్లిచే తండ్రిచే విడియ
బడితి, నిప్పుడూ పతి చేతను విడువ బడియెదనొక్కా
నుడూవులు వేయి నింకేల? ఇప్పాటి నోములు తొల్లి
కడగి నోచితినిగా కేమి యనుచు గందెడెందంబున!

- ఎంత ధైర్యం ఉన్నా, తప్పు చేయక పోయినా... పరిస్థితి తనకు అనుకూలంగా లేనపుడు "డీలా" పడటం సహజం. విధిని, కర్మను తలచుకోవడం - "నా టైం బాగుండలేదు" అని దిగులు చెందడం మానవ స్వభావం.

మరి దుష్యంతుని తత్త్వం ఏమితి? తెలిసి కూడా తెలీనట్లు ఎందుకు పలికాడు?

"అన్యులెఱుగమి చేసి లోకోపవాద భీతి నెఱిగియు, నిత్తన్వి ప్రీతి దప్పి ఎఱుగనంటిని"

అన్నాడు దుష్యంతుడు. శకుంతలను గాంధర్వ వివాహం చేసుకొని తిరిగి వచ్చిన వెంటనే అందరకూ తెలియజేసి ఆమెను తెస్తే సభ్యతగా ఉండేది. అది చెయ్యక పోవడమే పెద్ద నేరం. పెద్దవాళ్ళతో పనులు ఒక్కొక్కసారి ఇలాగే ఉంటాయి. అందుకే అన్నారు - "కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జీ ఉండా"లని.

దుష్యంతుడు మహారాజు. చక్రవర్తి. గొప్ప పేరున్నవాడు. అప్పటిదాకా మచ్చలేని వ్యక్తిత్వం గలవాడు. ఏ పరిపాలకుడైనా లోకానికి జంకాలి. 'యధా రాజా తధా ప్రజా' అన్నదే అనాటి గొప్పనీతి. రాజు నడవడికకు గొప్ప ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రజలు అతనిని ఆదర్శంగా తీసుకొంటారు. అందుకే 'లోకాపవాది' భీతీచే అన్నాడు.

ఇది దుష్యంతుడికే కాదు - సమాజంలో ఏ వ్యక్తికైనా అవసరమే. పేరున్న వాళ్ళకి, మంచి పదవిలో ఉన్నవాళ్ళకి మరీ అవసరం. 'తనను గురించి లోకం ఏమనుకొంటొందీ' అన్నప్పుడే నడవడిక సవ్యంగా ఉంటుంది. లోకం చూపు కూడా పేరున్నవాళ్ళ మీదే ఉంటూంది. గొప్పవాళ్ళు ఏ చిన్నతప్పు చేసినా పెద్ద ప్రచారం పొందుతుంది. చిన్నవాళ్ళు పెద్దతప్పు చేసినా లోకం అంతగా పట్టించుకోదు.

శకుంతల చెప్పగానే, "అవును నువ్వే నా భార్యవి. వీడు మన కుమారుడే. లోపలికిరా" అని దుష్యంతుడన్నాడనుకోండి. మంత్రులు, సామంతులు, ప్రజలు, బంధువులు ఏమనుకొంటారు? ఎప్పుడు ఈ సంగతి చెప్పలేదే?... అని రాజు శీలాన్ని శంకిస్తారు. ప్రజలలో రాజుపై గౌరవం, భక్తి ఉండవు. పరిపాలకుడు వీటన్నిటినీ పరిగణలోకి తీసుకోవాలి.

ఆకాశవాణి నిజం చెప్పడంతో కథ సుఖాంతమయింది. అప్పటిదాకా సాక్ష్యం లేదు కదా - అని దుష్యంతుడు బుకాయించాడు. సాక్ష్యం లభించేసరికి - పైగా ఆకాశవాణి అంత పెద్ద సాక్ష్యం లభించేప్పటికి నిజం ఒప్పుకున్నాడు. ఇక గత్యంతరంలేని పరిస్థితి. ఆకాశవాణి చెప్పటంతో ఇక ప్రజలు కూడా దుష్యంతునిపై సానుభూతి చూపిస్తారు తప్ప ద్వేషించరు. లోకంలో కూడా తగాదా వచ్చినప్పుడు దొంగమాటలు చెప్తాం. బుకాయిస్తాం. ఎవడో పెద్దమనిషి వచ్చి హితవు చెప్తాడు. అప్పుడు శాంతించి 'సరే' అంటాం. ఇదీ లోకరీతి. దుష్యంతుడు తను ఇచ్చిన వాగ్దానం మేరకు కొడుకును యువరాజుగా అభిషక్తుడ్ని చేశాడు.

సారాంశం ఏమిటంటే... పెళ్ళికి తొందరపడకూడదు. పెద్దవాడు కదా, గొప్పవాడు కదా అని అతని మాటల్ని పూర్తిగా నమ్మకూడదు. పెద్దలు, తల్లిదండ్రులు, బంధువులు 'సాక్ష్యం' ఉండాలి. లేకపోతే చిక్కులు తప్పవు. ఆపద లేదా సమస్య ఎదురైనపుడు ధైర్యంగా ఎదుర్కోవాలి. నిరాశతో కుంగిపోవడం, ఆత్మహత్య చేసుకోవడం, ఇంటినుంచి పారిపోవడం తగదు. పరిస్థితిని ఎదుర్కొంటే విజయం లభిస్తుంది - కాకపోతే ఆలస్యం కావచ్చు. 'పరిపాలకుడూ, 'గొప్పవాడూ' ఎప్పుడూ లోకోపవాద భీతిని కలిగివుండాలి. సమాజం తనను వెయ్యి కళ్ళతో చూస్తూవుంటుందన్న తెలివి కలిగి ఉండాలి. 'లోకమా, గీకమా - ఐ డోంట్ కేర్' అన్న స్వభావం మంచిది కాదు. ఇవీ నేర్చుకోవలసినవి!!

-- ద్వా. నా. శాస్త్రి,  
సుజన రంజని, 
ఏప్రిల్ -2007 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి