శివసాగర్ కవిత్వం
భావోద్వేగాలు హృదయాన్ని తాకి అనుభూతి చెంది తనదైన ముద్ర వేసుకుని పొంగి పొరలే వేళ వెలువడే భావాలే కవిత్వ రూపం దాల్చుతాయని నేననుకుంటాను. శివసాగర్ కవిత్వం ఆయన వ్రాసిన 1968 నుండి 2008 వరకు సాగిన కవితల కూర్పు, విప్లవాత్మకంగా సాగుతుంది. విప్లవంలో ప్రభవించి విప్లవంలో పయనిస్తూ దానితోనే కలిసి కొనసాగిపోతుంటుంది.తాను విప్లవంనుంచి విరమించుకున్నాక కూడా అధిపత్యాల ద్రోహాలనూ స్వార్ధాలనూ చెండాడుతూనే వుంది.కాస్త వ్యంగ్యం హాస్యం హేళనలను కలగలిపి, ఆసలు విప్లవమంటే రాచరికపు వ్యవస్థలు, పెద్ద పెద్ద భూస్వాములూ, బలవంతులూ తమ తమ స్వార్ధంతో పేదలను, కనీసావసరాలకు కూడా నోచుకోని బలహీన వర్గాలను దోచుకోవటం, వారిని అక్రమ శిక్షలకు గురికావించటం. తరతరాలుగా సాగుతున్న ఈ అన్యాయాన్ని పీడిత ప్రజలు మేలుకొని చైతన్యం పొందినవారై ధిక్కరించటమే ఈ విప్లవ మార్గం, విప్లవం.
ఈ విషయాన్ని గ్రహించి ఆకలినీ అన్యాయాన్నీ ఎదిరించి, సమానత్వం సాధించటం కోసం చేసే ప్రయత్నంలో, తోటివారినికూడా భాగస్వాముల్ని చేస్తూ, ప్రభోదిస్తూ, ఉత్తేజపరుస్తూన్న పంధాలో వీరి కవితలు ఊపిరి పోసుకుంటాయి. ఈ కవిత్వం విప్లవాన్ని ప్రేరేపిస్తూ, విప్లవంలో భాగమౌతుంది. ఆ వ్యక్తి కూడా మహోజ్వల విప్లవమై భాసిస్తాడు. విప్లవమే తానై అంతర్భాగమై ప్రేరణ కల్పిస్తూ పిలుపునిస్తాడు. మన రక్తం తాగి ప్రాణాలను పీలుస్తున్న దోపిడీదారులను హతమార్చగ తరలి రమ్మని జేగంటలతో పిలుపు నిస్తాడు.
హింసకు ప్రతిహింసే మార్గమని, ప్రతిహింసనే ఆయుధంగా చేసుకుని ప్రతిఘటనలతో విజయం సాధించాలనే నిర్ణయం కొంత నష్టాన్ని కలిగిస్తున్నా అవతలి వర్గంవారు కూడా అనుభవిస్తేగానీ వారికి తెలిసి రాదనే విషయం, ఆయుధాలు పట్టడానికీ, ఈ హింసా మార్గాన్నెంచుకోడానికీ కారణమౌతాయి. ప్రపంచమంతా చెలరేగుతున్న ఈ అన్యాయాన్ని ఐకమత్యంతోనే సాధించగలమని తెలియజేస్తాడు. కొన్ని పదాలకు తను స్వంతగా అర్ధాలను కల్పించుకుని తన కవితలతో విప్లవాన్ని, తన కవితలలో ప్రకృతితోనూ, సముద్రంతోనూ కలిపి రూపు కట్టిస్తాడు. ప్రజల్ని జాగృతి చేయడమే కాక సామాన్య జన బలగంతో జగతిని కంపింపజేసి తమ లక్ష్యం సాధించుకోవాలనీ చెప్తాడు. కొన్ని వేళల ఈ పోరాటమే తానౌతాడు.
అసలే అది ఆవేశం. పోరాటం సుదీర్ఘ కాలం దాస్యంలో దౌష్ట్యంలో మగ్గి జాగృతి పొంది కట్టలు తెంచుకున్న ఆవేశం. అన్యాయాన్ని అరికట్టే ఆరాటం. భావంయొక్క బలానికి పదాలు కూర్చి చక్కగా కుదిరి కవిత జీవం పోసుకున్నట్లు ఉంటుంది. దానికి తోడు తనకు తానుగా కొత్త అర్ధాలతో ఏర్పాటు చేసుకున్న పదాలు కవితకు కొత్త శోభనీ అందాన్నీ సమకూరుస్తాయి. ఆలలు, కలలు సితారా సంగీతం లాంటివి.కొన్ని కవితలు లయాత్మంగా సాగి మనసులను ఇట్టే ఆకట్టుకుంటాయి. ఈ కవి విప్లవమే తానుగా మారినవాడు కావటం చేత కవితలు తీక్షణతనూ పదునునూ చిక్కించుకున్నాయి కొన్ని.
పోరాటదారులకు అడవి ఆశ్రయమిస్తుంది. చెట్టూ పిట్టలూ కొండలూ గుట్టలూ వీరిని ఆహ్లాదపరుస్తూ సాయపడుతూ నేస్తాలవుతాయి. ఇక్కడ ప్రకృతి ఈయన కవితాహృదయాన్ని తాకి పరవసిస్తుంది. సామాన్యుణ్ణి అసమాన్యునిగా చూపెడుతూ నరుడో భాస్కరుడా పాట సాగుతుంది. భాస్కరరావనే వీరుడు మరణించినపుడు చెట్లనీ గుట్టలనీ గుర్తు చేసుకుంటూ ప్రకృతి సహచర్యాన్ని చెప్తాడు.
కొన్ని నిజమైన సత్యాలను గుర్తించడం వివేకాన్ని తెలియజేస్తుంది. సత్యం చావదు. అది అజేయం. బాధలో దుఃఖంలో కూడా ఆశను ప్రజ్వలనం చేసుకోవడమే ఈయన ధ్యేయం.
పోరాటంలో ఒక్కోసారి గాయాలూ బాధలూ అలసటలూ. కాస్త విశ్రాంతి కావాలి, సేద తీరాలి. ఆన్న, పాన, ఆధరువులూ కావాలి. అలాటప్పుడు మాతృహృదయ దర్శనం చేయిస్తాడు. అడవి తల్లి ప్రేమ మూర్తి. ఆర్తితో అందరికీ ఓదార్పునిచ్చి తన చల్లని ఒడిలో తావిచ్చి ఆకలి దప్పులు తీరుస్తుంది. కొన్ని పదాల్ని, కొంత శైలినీ, ఊళ్ళలో నివసించినపుడు జానపద గీతాల్నుండి గ్రహిస్తాడు. వాళ్ళ గుండె చప్పుళ్ళకు దగ్గరగా కొన్ని కవితలు రూపు కట్టాయి. చెల్లీ చంద్రమ్మ అనే కవితలో విప్లవపు రూపాన్ని చిత్రం కట్టినట్టు చూపెడతాడు.నిరామయమైన లోకం, బాధ, దుఃఖం, కొపం, పగ, ద్వేషంగా మారి తీవ్రమైన ఆవేశం ముంచుకురాగా ప్రతీకారం చేయడం ఇక్కడ కనిపిస్తుంది. తన విశాల తత్వాన్ని శక్తి సామర్ధ్యాలనీ మరింతగా పెంపొందించుకున్న వైనాన్ని నెలబాలుడు లో చూస్తాం.
ఉద్యమంతోపాటుగా కవితలు కూడా మారుతూ కొంత కొత్తదనాన్ని నింపుకుంటాయి. 74లో రెడ్ సిగ్నల్ దగ్గరకొచ్చేసరికి ఈ మార్పు ప్రభుత్వ వ్యతిరేకతను తీవ్రంగా వ్యక్తపరుస్తుంది.
అప్పటికి ఈ వ్యతిరేకత railway సమ్మె రూపంలో నగరాలకీ పాకింది. ఇక్కడ మాటలే అస్త్రాలు.
కొంత హాస్యం మరికొంత వ్యంగ్యంగా “ఇందిరిస్టు గారడీ” సాగుతుంది. “కంసుని కంప్యూటర్” లో వ్యంగ్యం చోటు చేసుకుంటుంది. ఇది విప్లవాల కాలమని చెప్తూ “ఋతుగీత”. ఇలా కాలంతో పాటు కదలిపోతూ ఎప్పటికప్పుడు ఏర్పడుతూన్న పరిస్థితులలోనుండి వస్తువును స్వీకరిస్తూ కవితలు సాగుతాయి. “గురజాడ” సజీవ స్వతంత్ర పాత్రలుకూడా కాలానుగుణంగా మార్పులు చెందినట్లు మలచిన తీరు ప్రతిభావంతమై నిలిచింది.
తనను కన్నందుకు కన్నతల్లికే ప్రేరణనిచ్చిన విప్లవ చైతన్య స్పూర్తికే విప్లవాభివందనాలర్పిస్తారు. జాఫ్నాలో చనిపోయిన సిపాయితో నిజాల్ని పరికిస్తాడు. ఓ కొడుకుని పోగొట్టుకున్న దళితుని ఆవేదన తెలియజేస్తూ పొంగారిన హృదయదఃఖభాండాన్ని గ్రుమ్మరించాడు.
ప్రకృతిలోని సాదృశ్యాలను చూపెడుతూ అమరత్వం రమణీయమైనదైనదనీ కాలాన్ని కౌగలించుకుని మరో సంతోషప్రదమైన కొత్త లోకాన్నిస్తుందని తెలియజెస్తారు. తన భావాలూ ఆశలూ ఆశయాలూ కలకాలం నిలిచివుంటాయనీ, వీటిని మరే నిజమైన శక్తి జయించలేదనీ, తాను మృత్యుంజయుణ్ణనీ, “ ఎదురు చూడు నాకోసం” లో చెప్తున్నారు. శారీరక అస్వస్థత దరిజేరినా అంతరంగం మాత్రం ఇంకా వల విసిరి కలల్ని పట్టుకోగలిగిన ఉత్సాహంలోనే ఉన్నదని సైనికుడూ రణరంగమూ కూడా తానే ఐనట్లుగా భావిస్తూ ఇంకా పోరాటభావాలు తనను వీడలేదని తెలియజేస్తారు.
ఈ విధంగా స్వచ్చమైన మనస్సుతో శక్తివంతమైన భావాన్ని జతకూర్చి అనుభూతి చెందిన కవితలలో పరిణత సిద్ధించుకున్న ప్రజ్ఞాశాలి శివసాగర్..
మానవజాతి మనుగడకు స్వాభావికమైన విపత్తులెన్నో…వరదలు, అనావృష్టి, కరువు కాటకాలు, భూకంపాలులాంటివి. ఇలాంటివి తలెత్తినపుడు ప్రజల ప్రాణ ధనాలకు నష్టమేకాక బ్రతుకు దుర్భరమౌతుంది. అలా కాక కేవలం మనిషిలో తలెత్తిన స్వార్ధంతో అహంకారంతో ఎదుటివారిని మోసం చేయటం వారి శ్రమ శక్తిని దోచుకుని వారిని హింసకు గురి చేయటం క్షమార్హం కాని నేరాలు.
రాసి పంపిన వారు: కొత్త ఝాన్సీలక్ష్మి
[2009 మార్చ్ 15 వ తేదీన DTLC (Detroit Telugu Literary Club, USA)
లో శివసాగర్ కవిత్వం మీద జరిగిన చర్చ సందర్భంగా రాసిన సమీక్ష]
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి