"తెలుగు శాఖ, స్నాతకోత్తర కేంద్రం గద్వాల, పాలమూరు విశ్వవిద్యాలయంలో నేను బోధించే సిలబస్, సిలబస్ లోని పాఠ్యాంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారం ప్రతిబింబించే వేదిక."

దిక్సూచి – చెరబండరాజు  


  విప్లవ కవుల్లో విశిష్టమైన వ్యక్తిత్వంగల మహాకవి చెరబండరాజు 38 ఏళ్ల చిరుప్రాయంలోనే అస్తమించాడు. కాని విప్లవమార్గం చేపట్టి కొనసాగిన కొన్ని ఏళ్ల కాలం లోనే ఆయన రాసిన అనేక కవితలు, ముఖ్యంగా పాటలు తెలుగు ప్రగతిశీల ప్రజానీకాన్ని ఉర్రూతలూగించాయంటే అతిశయోక్తి కాదు. అలాంటి మహాకవి దిక్‌సూచిలోని కవితలు ఎంపిక చేసి కొన్ని ఇక్కడ ఇస్తున్నాము. మన బ్లాగు పాఠకులు వీటిని విశేషంగా ఆదరిస్తారని ఆశిస్తాం....

"ఏటికేతం బెట్టి
ఎయిపుట్లు పండించి

గంజిలో మెతుకెరగనన్నా – నేను
కూటిలో మెతుకెరగనన్నా"
అంటూ డెబ్భై ఏళ్ల కర్షక జీవితంలో
ఈ పాటే పాడుకుంటూ కన్ను మూసిన

నాన్నకి ప్రథమ ముద్రణ, అక్టోబరు 1970

1. వందే మాతరం
 నా ప్రియమైన మాతృదేశమా
తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా
దుండగులతో పక్కమీద కులుకుతున్న శీలం నీది
అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టుపెట్టిన అందం నీది
సంపన్నుల చేతుల్లో మైమరిచి నిద్రిస్తున్న యవ్వనం నీది
ఊసినా దుమ్మెత్తిపోసినా చలనంలేని మైకం నీది
కోతకొచ్చిన చేనులో కలుగులు తవ్వుతున్న
ఎలకల్నీ పందికొక్కుల్నీ భరిస్తూ నుంచున్న 'భారతి' వమ్మా
నోటికందని సస్యశ్యామల సీమవమ్మా
వందే మాతరం వందే మాతరం
ఒంటిమీది గుడ్డలతో జండాలు కుట్టించి
వివస్త్రవై ఊరేగుతున్న దైన్యం నీది
అప్పుతెచ్చి లేపిన మిద్దెల్లో
కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న దీనత్వం నీది
ఎండిన స్తనాలమీదికి ఎగబడ్డ బిడ్డల్ని
ఓదార్చలేని శోకం నీది
ఆకలికి ఎండి ఎండి ఎరువు సొమ్ములతో వీధినబడ్డ సింగారం నీది
అమ్మా భారతీ నీ గమ్యం ఏమిటి తల్లీ
వందే మాతరం వందే మాతరం
దిక్‌సూచి, చెరబండరాజు, ప్రథమ ముద్రణ, అక్టోబరు 1970, హైదరాబాదు నుండి...
2. నన్నెక్కనివ్వండి బోను
నల్లకోట్లు నీలిరంగు నోట్లతో
ఒక దేశం ఒక కోర్టులో
ఫైసలా అయ్యే కేసు కాదు నాది
నన్నెక్కనివ్వండి బోను
నలుగురి నమ్మికతో 'అమ్మా ' అని పిలవడం తప్ప
నవమోసాలు మోసిందెవరో
ఎవరికైనా ఏమి తెలుసంటున్నాను
సృష్టికర్తనే వెక్కిరిస్తోన్న పాపిష్టిని
మీలో మిమ్మల్ని ప్రశ్నించుకొమ్మంటున్నాను
అంటున్నాను అంటాను
అనుకుంటూనే వస్తున్నాను
మనిషిమీద నమ్మకం పోగొడుతున్న మీరు
దేవుడిమీద ప్రమాణం చేయమంటారెందుకు?
దోషికి నిర్దోషికి ఒకటే సూత్రం
వల్లించిందే వల్లించి వాదిస్తారు
ఫీజు కుడితి కుండలో
న్యాయాన్ని ఎలుకలా ముంచేస్తారు
మీ ఉద్యోగాలకు ప్రమాణాలేమిటి?
ఎక్కనివ్వండి నన్ను బోను
కలాలు కాగితాలు సర్దుకోండి
లా బుక్కుల్లో నా సందేహాలు వ్రాసుకోండి
న్యాయానికి దేశాలేమిటి? యెల్లలేమిటి?
మనిషీ, రక్తం ప్రాణం ముఖ్యం
లింగ భేదాలు వాదాలు తప్పితే
మందిర్, మస్జిద్, చర్చి,
మతాధికారుల మతాలు యెందుకు?
ఆకలి, కామం, కలలూ, కన్నీళ్లు
మనిషిలోని మర్మజ్ఞానమంతా ఒక్కటే
దేశమేదైతేనేం? మట్టంతా ఒక్కటే
అమ్మ యెవరైతేనేం? చనుబాల తీపంతా ఒక్కటే
బిక్కముఖాలతో చూస్తారేం?
పిచ్చివాణ్ణిగా కేసు పుటప్ చెయ్యండి
నన్నెక్కనివ్వండి బోను
తిన్నయింటి మర్యాదెంచని నాకు
బుద్ధుల్లో పెద్దల సహజాతాలేమై యుంటాయ్?
మంచి మనసు పరిమళాలు
విశ్వవ్యాప్తి కాకపోవు
భావితరం గుర్తించకపోదు
జగత్ప్రళయ కావ్యంలో
తపనాగ్ని జ్వాల నిలుస్తోంది
అణువణువున అగ్ని కణం
చల్లారక రగులుతోంది
నన్నెక్కనివ్వండి బోను
తీర్పు మీది జైలు మీది
భయపడతారెందుకు
మీ మనస్సౌధాల నిండా
తరగని తరతరాల బూజు
అనుక్షణం చచ్చే ప్రియత్వం
కాపురాల గోపురాలలో తిరిగే పావురాళ్ళారా!
నరుక్కోరెందుకు తలలు
గది నాల్గు గోడలు కూల్చివేసి
దిశలు నాల్గుగా మార్చుకోండి
ప్రపంచ పౌరులు కారెందుకు అప్పుడు?
నాకు తెలుసు
మీ రాత్రి చొక్కాలు పగళ్ళు నిలవవు
పగటి చొక్కాలు రాత్రుళ్లుండవు
మీ పెళ్ళాలు పిచ్చివాళ్ళు
పాతికచీరతో స్వర్గాన్ని కప్పుకొని
వంటగది ఆలోచనలకు
ఎసర్లు పెడుతున్న వాళ్ళు
మీ వాగ్దానాలు పుచ్చుగింజలు
మీ బిడ్డలు కృత్రిమ నాగరికత షో లో
మోడల్‌గా పనికొస్తున్న వాళ్లు
ఛీ, ఛీ యెవరు మీరు?
నవ్వుతా రెందుకు?
నీవు నేను కలిసి యెదుటివాని పిలుపుకు
'మీరు ' గాక ఏమౌతాం?
నీ గుండెలు, నా గుండెలు
మూతబడిన కొండగుహలు
ఎక్కనివ్వండి నన్ను బోను
ఈ సువిశాలప్రపంచ జీవశాలలో
సిసలైన న్యాయస్థానం ఎక్కడైనా వుంటే
నన్నెక్కనివ్వండి బోను
నా గుండెలు పిండుకునే
కొండల్లాంటి సందేహాలు...
విశ్వశాంతి మన ధ్యేయం
యుద్ధాలకు పరిమితమా?
అబద్ధమా యీ వేదన?
మాంసం ముద్దలుగా మనుషులు
శిశువులుగా జన్మించుట ఏ దేశంలో లేదు
ఏ దేశంలో నైతేనేమి?
అర్ధరాత్రి పడగ్గదుల
అంతరార్థమొకటే గద!
ప్రపంచ మొక నగ్నశిలా
ఫలకము వలె కనిపిస్తున్నది
భగవంతుడి అసలు పేరు నగ్నప్రియుడంటాను
అంటాను అంటున్నాను
అనుకుంటూనే వస్తున్నాను
అందుకే నన్నెక్కనివ్వండి బోను
* * * * *
3. చితి పేర్చుకుందాం
4. చూడలేను
5. ఇంకా నువ్వింకా బానిసవే
6. నీరో సంతతి
7. జవాబు
8. ఆకాశం వెక్కి వెక్కి ఏడుస్తోంది
9. ఊబి
10. కో
11. నా మనుష్య ప్రపంచంలోకి 
12. ఫో
13.  అన్నీ మరణాలే 
14. కాంతి పాదాలు
15. ఆత్మ దిక్
16. నా ఆకాశం
17. రా!
18. దిగంబర సమాజం కోసం
భుజాలు జార్చుకొని
మర్రి ఊడల్లా చేతులు వేలాడేసి
ఒంగి ఒంగి మట్టి కరుస్తూ నడుస్తోన్న
కుంటి వ్యవస్థను నిలబడిన చోటే
గొయ్యి తవ్వి పాతెయ్యమంటున్నా
చాకులా వెన్నెముక ఉంటే
కంఠ కంఠాలలో నిప్పు రగల్చమంటున్నా
నపుంసక మానసిక అంటువ్యాధి
ముందు తరాలకు అంటకుండా
తలవంచుక వెళ్ళిపోదామనే తార్పుల
అగ్ని కీలలలో తలకిందులుగా నిలెయ్యమంటున్నా
ఈ అవ్యవస్థ వ్యవస్థాపకుల్ని
ఇంకా ఇంకా బజార్ల కీడ్చి
చౌరస్తాలోకి వీలుగా చేరెయ్యమంటున్నా
పొద్దుపొడుపుతో మోసగించి మతాలు
గానుగెద్దులుగా మార్చిన రాజకీయాలు
పశుత్వం మిగిల్చిన జాతిద్వేషాలు
దుర్గంధం కక్కిన సిద్ధాంతాలు
నిన్నూ నన్నూ ఇన్నాళ్లూ కమ్ముకున్నాయ్
వ్యవస్థేదీ మిగల్లేదు
అందుకే
ఈ కుంటి జీవచ్ఛవాన్ని నిలబడిన చోటే
గొయ్యి తవ్వి పాతెయ్యమంటున్నా
* * * * *
19. నిమిషం నిమిషం ఒక నిమిషం
20. కుక్కల మేళం
21. యాభై కోట్ల మంటలు
యాభై కోట్ల మంటలు
యాభై కోట్ల కంఠాలు
తిరుగుబాటు మంటలుగా మారాలి
వాస్తవ జీవితాన్ని వేల మైళ్ల దూరంలో విసిరేసిన
విద్యాలయాలు వదిలి
జట్లు జట్లుగా మెట్లు మెట్లుగా
యువకులు నడిరోడ్డుకు పరుగెత్తుకు రావాలి
మూఢనమ్మకాల ఉక్కు కౌగిళ్లలో
నంగనాచి నాయకుల దొంగ వేషాల్లో
నలిగే కృంగే జనం కళ్లగంతలు చించుకొని బయటికి రావాలి
మహావ్యవస్థ రూపొందించని నాయకులు
జనాన్ని జేజమ్మలుగా వాజమ్మలుగా
పురుగులుగా వెధవలుగా
ఎట్లా దిగజార్చారో
ఒక్కసారి వెన్నుతట్టి కళ్ళారా చూపించాలి
యాభై కోట్ల కంఠాలు
తిరుగుబాటు మంటలుగా మారాలి
* * * * *
22. నేనే మీ ఊపిరి
23. మంటలెప్పుడోగాని అంటుకోవు
24. రక్త ఘోష
25. చిలుం
26. కన్నీళ్లేనా
27. జగద్గురువులొస్తున్నారు జాగ్రత్త
జగద్గురువులొస్తున్నారు జాగ్రత్త
పల్లకీలలో తప్ప ప్రయాణం చేయరు
ధనవంతుల మేడల్లోతప్ప పూరిగుడిశెల ఊసెత్తరు
కాళ్లుండీ కుంటివాళ్లు
మనుషుల బుజాల్ని తప్ప యింకేమీ ఎక్కరు
కాషాయాంబరాలు మానరు
ఆధ్యాత్మిక చింత పేర
నవీన పతివ్రతల్ని పావనం చెయ్యందే వదలరు
ఎవరయ్యా ఎవరీ రసరాట్టులు
బతుకంతా మోసంతో గతికి గతికి
జనాన్నీ జాతి నరనరాన్నీ మతమౌఢ్యానికి తీర్చితీర్చి
వయసులో నానాపాయసాలూ మరిగి మరిగి
కొవ్వెక్కిన పిట్టగూళ్ళ తలబుట్టల బాబాలే
చక్రవర్తుల్లా ఊరేగే జగద్గురు సాముల్లారే
 కుష్ఠు వ్యవస్థకు మూలవిరాట్టులు
చీకటి బజారు జలగల్ని
రాజకీయ బొద్దింకల్ని
పదవీ మదాంధుల్ని
సాహిత్య వందిమాగధుల్ని
అభయహస్తంతో కాపాడే కంకణం కత్తుకున్నారు
నిర్వీర్యాన్ని దేశం నలుమూలలా
కాలవలనిండా పారిస్తున్నారు
భయంకర కుష్ఠు సంస్కృతిని దేశమంతా పంచుతున్నారు
నమ్మకు  మతాల సుఖరోగుల్ని
వర్ణాశ్రమధర్మ ద్వేషాలు రేపే అడ్డగాడిదల్ని
బహిరంగంగా సభల్లో వ్యభిచరించే ఆబోతుల్ని
రంకూ బొంకూ పురాణాల బంకును
వేదికలెక్కి కుక్కల్లా కక్కే వెధవల్ని
మన్నించకు
మనిషిని ఏనాడో మరచిపోయి
మంచితనాన్ని అంటరానితనంగా ఎంచే తుచ్ఛులకు
చిలకజోస్యాల పిలకగుళ్ళు
వంటింటి కుందేళ్ళు
పట్టెనామాల పొట్టేళ్ళు
బిళ్ళగోచీ బల్లులు
జందెంపోగుల పందులు
బ్రహ్మరథం పడుతుంటే
కళ్ళుండీ కంటూనే
చెవులు పోటెక్కేట్టు వింటూనే
కదలకుండా మౌనంగా నిలబడకు.
దేవుళ్ల దేవులాటలో
మహామహా మాయల నాయాళ్ళ సన్నాసుల
జోగుల మోజుల్లో
పడిపోయిన దేశాన్ని
భవిష్యత్కాలాన్ని
కాపాడడానికి నడుంకట్టు
పాతిపెట్టు
మైలురాయివేకాదు
మంచికి పతాకాన్నెత్తే మనిషినని
మరోసారి రుజువు చెయ్యి
* * * * *
28. ప్రపంచం నిండా
29. చరిత్ర ద్రోహం
30. వ్రణం
31. "దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ "
ప్రజా జీవనాడి స్పందన పసిగట్టలేని
సమన్వయ మేధావుల అంచనాల వంచనలో
నిలువల్లా మునిగిన దేశం
ప్రణాళికల తాటిచెట్ల నీడల్లో
పడిగాపులుగాచే ప్రజల దేశం
స్వదేశీమార్కు విదేశీయ మార్కెట్టు
మనస్తత్వపు మంది దేశం
కట్టుకో గుడ్డలేని దేశం
దేశి సరుకు ధాన్యానికైనా నోచుకోని దేశం
రెండు దశాబ్దాలు దాటినా
కోట్లాది ప్రజల నోటికందని దేశం
నాదేశం నా ప్రాణం అంటూ
గర్వించే రేబవళ్లు శ్రమించే
శ్రమజీవుల భవిష్యత్తు యావత్తూ
అప్పుల్లో కుక్కబడ్డ దేశం
పిడికెడు సుఖరోగుల చెప్పుచేతల్లో
పడిపోయిన ప్రజాస్వామ్య దేశం
చమటోడ్చి పాటుపడే శ్రమజీవికి
కడుపునిండ తిండెక్కడ కండెక్కడ
పెంచిన మంచి కొన్ని సంచుల్లోకెళ్ళుతోంది
తలపెట్టిన మేలుకు తలలే తాకట్టు పడ్డాయ్
డబ్బు తెచ్చే కీర్తిసంపదల
దోపిడి కిరీటాల తురాయీలొద్దు
కలహాల కారణాలు వెతకని
చరిత్ర పరిణామం యెరుగని ఘనులకు
కత్తివైరాన్ని నిరసించే హక్కు లేదు
ఒరుల మేలుకు సంతసించమనే
కుహనా ఆదర్శవాద ఐకమత్యాని కర్థం లేదు
వొట్టి కడుపులతో మలమల మాడే
అస్థిపంజరాల ఐకమత్యపు సత్యం వేరు
పరులెవరో
కలిమివాళ్ల కెక్కడిదో యోచించక
దు:ఖం అసూయ చిహ్నమనే
సామాన్యులు పాపులనే
సాహసాలు చాలు చాలు
చిక్కని పాలవంటి దేశాన్ని
కొల్లగొట్టే మేలి బతుగ్గాళ్ల మేలును
నా మేలని యెంచే నిర్వీర్యపు నేర్పరితనం
నా ఛాయలకే వద్దు
లాభాల్లో వాటాలు పెంచుకునే
వ్యాపారసరళి దేశభక్తి అక్కర్లేదు
శ్రమఫలితం కాజేసే
పొరుగువాడికి తోడు పడే
వర్గసామరస్య మార్గం వద్దు
మహోన్నత మానవత్వపు సూర్యోదయాన్ని
ఆదిలోనే అడ్డుకొనే
మానవ చరిత్రనిండా మారణహోమాలు రేపిన
మానవ చరిత్రనిండా మారణహోమాలు రేపిన
మానవ చరిత్రనిండా మారణహోమాలు రేపిన
మనిషి మనిషిని క్రూరంగా విడదీసిన
హేతురహిత అశాస్త్రీయ
జాతిమతాల్నొప్పుకునే
విషపానీయ సేవ్యం వద్దు 
అక్కడ అన్నదమ్ముల ప్రసక్తి వద్దు
సంఘానికి దూరంగా అణగిమణగి
వర్తమానం గుర్తించక
రుతుచక్రం మలుపుల్లో గొంతెత్తే
కోయిల కవితలొద్దు రచనలొద్దు
ఆస్తిహక్కు రక్షణకై తపనపడే
నక్కల తోడేళ్ల కెదురుతిరిగి
ప్రాణాలను మానాలను అర్పించే
హెచ్చు తగ్గులసలులేని
దేశభక్తి నిర్వచనం
రక్తతర్పణాలతో
రచిస్తోంది నా తరం
* * * * *

32. రాజధాని లేఖ
33. స్వీయచరిత్ర
34. మరోసారి ఈ దేశం మోసపోగూడదు
మరోసారి ఈ దేశం మోసపోగూడదు
బిర్లాభవనంలో వైభవంగా ప్రార్థనలు జరుపుకునే
హరేరాం బికారులు మళ్లీ పుట్టగూడదు
గీతాధ్యయన నేతలు ఈ జాతికి ఇంకా అక్కర్లేదు
బుద్ధుని యిమిటేషన్ ప్రబుద్ధుని సంతతి
పలికే ప్రగల్భాలతోనే
ఇరవై రెండేళ్లూ నీరుగారిపోయాయ్
శాంతిసహనాలతో ఇన్నాళ్లూ మిన్నకున్నందుకు
చరిత్రలో నా తరం చాలాచాలా పోగొట్టుకుంది
సామాన్యుడు సంఘబహిష్కృతుడిగా
సంక్షేమరాజ్యంలో రోజూ చస్తూనే వున్నాడు
పెంకుటిండ్లు పూరిండ్లై
పూరిండ్లు నేలమట్టమవుతుంటే
ఉన్నవాడు దేశాన్ని పిండిపిండి మరింత ఉన్నతంగా
ఆకాశాన్నందుకుంటున్నాడు
గ్రామాలు కుళ్ళి కుళ్ళి అజ్ఞాన తమస్సులో
కుళ్ళుచూళ్ళేనంత దుర్భర దారిద్ర్యంతో
పగిలి పగిలి ఏడుస్తున్నాయ్
ఇవాళ
శిష్యుల గొప్పతనంగురించి వివరంగా చెబితే
హంతకునిలా నేరస్థునిలా
తలవంచుకుని నించున్నాడు అస్థిపంజరాల బోనులో
అన్నార్తుల కన్నుల్లో ఆశాకిరణం ఎడారిదారిలా చీలిపోయింది
విశ్వాసపు గుడారాలెగి రెగిరి గాలిలో
ఏనాడో శిథిలమయ్యాయి
సహనం చచ్చిన కంకాళాలు కలిసికట్టుగా
గండ్రగొడ్డళ్ళతో ఈటెలతో ఈ చీకటి వృక్షాన్ని
పెల్లగించక తప్పదింక
అరచి అరచి ఇరవైరెండేళ్ల చరిత్ర అలసిపోయింది
అతడు పీడితుల మనిషికాడని చెప్పకనే చెబుతోంది
వర్గచైతన్యం గుండెలో మెత్తమెత్తగా బాకులుదూసి
పోరాటశక్తిని నాశనం చేసిన
పచ్చి సామరస్యవాది ప్రపంచానికిచ్చిందేమిటి?
అధికారానికి అంగరక్షకుడిలా
లంచగొండి ప్రభుత్వానికి కవచంగా
మనమధ్య మనుగడ సాగించడమేమిటి?
ఖద్దరు బట్ట తప్ప దేశానికి మిగిల్చిందేమిటి?
అమాయక ప్రజల భుజాలనెక్కి
భగవద్గీత పారాయణ అభయహస్తంతో
మతమౌఢ్యపు పిచ్చికుక్కలకి
ఎద్దుముఖం పెద్దపులులకి
దేశాన్ని బలియిచ్చినవాడికి
ఈ నేలమీద ఇంకా నామరూపాలుండడమేమిటి?
ప్రజాస్వామ్యపు బ్రోతల్ హౌసులో
ఈ రాజకీయాల రంకు కథలు
అతని బిక్షగాక మరేమిటి?
అతని పేరెత్తిన [లేక 'పేరెత్తని ' యా?] నాయకుడు ఏడి?
అతని విగ్రహం లేని వీధులు ఏవి?
ఈ అస్తవ్యస్తపు మస్తిష్కపు మహాత్ముడికి
ఆరాధనేమిటి ఆర్భాటాలేమిటి?
తారలేమిటి రాగాల భోగాలేమిటి?
పర్వతాలేమిటి? పూజామందిరాలేమిటి?
ఇదంతా మన అజ్ఞానానికి చిహ్నం కాదా!
అతని విగ్రహం లేని వీధులు ఏవి?
ఈ అస్తవ్యస్తపు మస్తిష్కపు మహాత్ముడికి
ఆరాధనేమిటి ఆర్భాటాలేమిటి?
తారలేమిటి రాగాల భోగాలేమిటి?
పర్వతాలేమిటి? పూజామందిరాలేమిటి?
ఇదంతా మన అజ్ఞానానికి చిహ్నం కాదా!
అతని విగ్రహం లేని వీధులు ఏవి?
ఈ అస్తవ్యస్తపు మస్తిష్కపు మహాత్ముడికి
ఆరాధనేమిటి ఆర్భాటాలేమిటి?
తారలేమిటి రాగాల భోగాలేమిటి?
పర్వతాలేమిటి? పూజామందిరాలేమిటి?
ఇదంతా మన అజ్ఞానానికి చిహ్నం కాదా!
సబర్మతీ ఆశ్రమవాసి
సన్యాసీ కాదు సంసారీ కాదు
విజ్ఞానదాత కాదు విద్యావేత్త కాదు
రాజకీయవేత్త కాదు రాజూ కాదు
వేదాంతి కాదు వెర్రివాడూ కాదు
ప్రజల్ని పట్టించుకున్నదీ లేదు పట్టించుకోనిదీ లేదు
అన్నీ తానేగా
తానే అన్నీగా పెరిగి
భ్రమల సాలెగూళ్ళలోకి నినాదాల గాలిలోకీ
పుక్కిటిపురాణాల ఆదిమసంస్కృతిలోకి మనుషుల్ని తోసి
నిజావగాహనలేని ప్రజాద్రోహిగా మోసం చేసి
దూదిపింజల్లాంటి సిద్ధాంతాలు వల్లించి
నా తరానికి సున్నాలు చుట్టి వెళ్ళిపోయాడు
మరోసారి ఈ దేశం మోసపోగూడదు
* * * * *
35. పీడితలోకం పిడికిలి బిగించి పిలుస్తోంది
36. యువతరానికి
37. దిక్‌సూచి
ప్రజారక్త వ్యాపారులు లిప్తపాటులో
మండి మసి అయిపోయే తరుణం ఇదే
పదవుల పోరాటపు
కుటిలనీతి మంతనాల మంత్రుల్నీ అంతరాత్మల్నీ
సజీవంగా స్మశానానికి పంపే సమయమూ ఇదే
డబ్బు రాజ్యాన్ని కూలద్రోసి
కోట్లాది ప్రజల కూడుగుడ్డకోసం
అడుగడుగునా అధికారపు నడ్డి విరగదన్నాల్సిందే
ఒకటికి పది సున్నాలు చేరుస్తూ
ఉన్నవాడు ఉన్నతుడై
సంఘానికి న్యాయాలయమై
సామాన్యుల శాసించే
ధర్మానికి తలవొగ్గక
ఆ వర్గపు కంచుకోట కొల్లగొట్టి
ప్రజాధనం అందరి కందుబాటులో ఉంచాల్సిందే
ఏ దేశపు సంపదైనా
పుట్టిన పుట్టబోయే బిడ్డల జన్మహక్కుగా
సమ సమానంగా వితరణ చెందాల్సిందే
ఒక్కొక్కడూ ఒక్కో మృగరాజై
నక్కల తోడేళ్ళ డొక్కలు చీల్చి రక్తంలో
త్రివర్ణపతాకం ఆసాంతం ముంచి రంగు మార్చాల్సిందే
* * *
[దిక్‌సూచి, చెరబండరాజు, ప్రథమ ముద్రణ, అక్టోబరు 1970,
  హైదరాబాదు నుండి]

చెరబండరాజు కవితలు పాటలు


శివసాగర్ కవిత్వం 


    భావోద్వేగాలు హృదయాన్ని తాకి అనుభూతి చెంది తనదైన ముద్ర వేసుకుని పొంగి పొరలే వేళ వెలువడే భావాలే కవిత్వ రూపం దాల్చుతాయని నేననుకుంటాను. శివసాగర్ కవిత్వం ఆయన వ్రాసిన 1968 నుండి 2008 వరకు సాగిన కవితల కూర్పు, విప్లవాత్మకంగా సాగుతుంది. విప్లవంలో ప్రభవించి విప్లవంలో పయనిస్తూ దానితోనే కలిసి కొనసాగిపోతుంటుంది.తాను విప్లవంనుంచి విరమించుకున్నాక కూడా అధిపత్యాల ద్రోహాలనూ స్వార్ధాలనూ చెండాడుతూనే వుంది.కాస్త వ్యంగ్యం హాస్యం హేళనలను కలగలిపి, ఆసలు విప్లవమంటే రాచరికపు వ్యవస్థలు, పెద్ద పెద్ద భూస్వాములూ, బలవంతులూ తమ తమ స్వార్ధంతో పేదలను, కనీసావసరాలకు కూడా నోచుకోని బలహీన వర్గాలను దోచుకోవటం, వారిని అక్రమ శిక్షలకు గురికావించటం. తరతరాలుగా సాగుతున్న ఈ అన్యాయాన్ని పీడిత ప్రజలు మేలుకొని చైతన్యం పొందినవారై ధిక్కరించటమే ఈ విప్లవ మార్గం, విప్లవం.

    ఈ విషయాన్ని గ్రహించి ఆకలినీ అన్యాయాన్నీ ఎదిరించి, సమానత్వం సాధించటం కోసం చేసే ప్రయత్నంలో, తోటివారినికూడా భాగస్వాముల్ని చేస్తూ, ప్రభోదిస్తూ, ఉత్తేజపరుస్తూన్న పంధాలో వీరి కవితలు ఊపిరి పోసుకుంటాయి. ఈ కవిత్వం విప్లవాన్ని ప్రేరేపిస్తూ, విప్లవంలో భాగమౌతుంది. ఆ వ్యక్తి కూడా మహోజ్వల విప్లవమై భాసిస్తాడు. విప్లవమే తానై అంతర్భాగమై ప్రేరణ కల్పిస్తూ పిలుపునిస్తాడు. మన రక్తం తాగి ప్రాణాలను పీలుస్తున్న దోపిడీదారులను హతమార్చగ తరలి రమ్మని జేగంటలతో పిలుపు నిస్తాడు.

    హింసకు ప్రతిహింసే మార్గమని, ప్రతిహింసనే ఆయుధంగా చేసుకుని ప్రతిఘటనలతో విజయం సాధించాలనే నిర్ణయం కొంత నష్టాన్ని కలిగిస్తున్నా అవతలి వర్గంవారు కూడా అనుభవిస్తేగానీ వారికి తెలిసి రాదనే విషయం, ఆయుధాలు పట్టడానికీ, ఈ హింసా మార్గాన్నెంచుకోడానికీ కారణమౌతాయి. ప్రపంచమంతా చెలరేగుతున్న ఈ అన్యాయాన్ని ఐకమత్యంతోనే సాధించగలమని తెలియజేస్తాడు. కొన్ని పదాలకు తను స్వంతగా అర్ధాలను కల్పించుకుని తన కవితలతో విప్లవాన్ని, తన కవితలలో ప్రకృతితోనూ, సముద్రంతోనూ కలిపి రూపు కట్టిస్తాడు. ప్రజల్ని జాగృతి చేయడమే కాక సామాన్య జన బలగంతో జగతిని కంపింపజేసి తమ లక్ష్యం సాధించుకోవాలనీ చెప్తాడు. కొన్ని వేళల ఈ పోరాటమే తానౌతాడు.

    అసలే అది ఆవేశం. పోరాటం సుదీర్ఘ కాలం దాస్యంలో దౌష్ట్యంలో మగ్గి జాగృతి పొంది కట్టలు తెంచుకున్న ఆవేశం. అన్యాయాన్ని అరికట్టే ఆరాటం. భావంయొక్క బలానికి పదాలు కూర్చి చక్కగా కుదిరి కవిత జీవం పోసుకున్నట్లు ఉంటుంది. దానికి తోడు తనకు తానుగా కొత్త అర్ధాలతో ఏర్పాటు చేసుకున్న పదాలు కవితకు కొత్త శోభనీ అందాన్నీ సమకూరుస్తాయి. ఆలలు, కలలు సితారా సంగీతం లాంటివి.కొన్ని కవితలు లయాత్మంగా సాగి మనసులను ఇట్టే ఆకట్టుకుంటాయి. ఈ కవి విప్లవమే తానుగా మారినవాడు కావటం చేత కవితలు తీక్షణతనూ పదునునూ చిక్కించుకున్నాయి కొన్ని.

    పోరాటదారులకు అడవి ఆశ్రయమిస్తుంది. చెట్టూ పిట్టలూ కొండలూ గుట్టలూ వీరిని ఆహ్లాదపరుస్తూ సాయపడుతూ నేస్తాలవుతాయి. ఇక్కడ ప్రకృతి ఈయన కవితాహృదయాన్ని తాకి పరవసిస్తుంది. సామాన్యుణ్ణి అసమాన్యునిగా చూపెడుతూ నరుడో భాస్కరుడా పాట సాగుతుంది. భాస్కరరావనే వీరుడు మరణించినపుడు చెట్లనీ గుట్టలనీ గుర్తు చేసుకుంటూ ప్రకృతి సహచర్యాన్ని చెప్తాడు.

    కొన్ని నిజమైన సత్యాలను గుర్తించడం వివేకాన్ని తెలియజేస్తుంది. సత్యం చావదు. అది అజేయం. బాధలో దుఃఖంలో కూడా ఆశను ప్రజ్వలనం చేసుకోవడమే ఈయన ధ్యేయం.

    పోరాటంలో ఒక్కోసారి గాయాలూ బాధలూ అలసటలూ. కాస్త విశ్రాంతి కావాలి, సేద తీరాలి. ఆన్న, పాన, ఆధరువులూ కావాలి. అలాటప్పుడు మాతృహృదయ దర్శనం చేయిస్తాడు. అడవి తల్లి ప్రేమ మూర్తి. ఆర్తితో అందరికీ ఓదార్పునిచ్చి తన చల్లని ఒడిలో తావిచ్చి ఆకలి దప్పులు తీరుస్తుంది. కొన్ని పదాల్ని, కొంత శైలినీ, ఊళ్ళలో నివసించినపుడు జానపద గీతాల్నుండి గ్రహిస్తాడు. వాళ్ళ గుండె చప్పుళ్ళకు దగ్గరగా కొన్ని కవితలు రూపు కట్టాయి. చెల్లీ చంద్రమ్మ అనే కవితలో విప్లవపు రూపాన్ని చిత్రం కట్టినట్టు చూపెడతాడు.నిరామయమైన లోకం, బాధ, దుఃఖం, కొపం, పగ, ద్వేషంగా మారి తీవ్రమైన ఆవేశం ముంచుకురాగా ప్రతీకారం చేయడం ఇక్కడ కనిపిస్తుంది. తన విశాల తత్వాన్ని శక్తి సామర్ధ్యాలనీ మరింతగా పెంపొందించుకున్న వైనాన్ని నెలబాలుడు లో చూస్తాం.

    ఉద్యమంతోపాటుగా కవితలు కూడా మారుతూ కొంత కొత్తదనాన్ని నింపుకుంటాయి. 74లో రెడ్ సిగ్నల్ దగ్గరకొచ్చేసరికి ఈ మార్పు ప్రభుత్వ వ్యతిరేకతను తీవ్రంగా వ్యక్తపరుస్తుంది.
అప్పటికి ఈ వ్యతిరేకత railway సమ్మె రూపంలో నగరాలకీ పాకింది. ఇక్కడ మాటలే అస్త్రాలు.

    కొంత హాస్యం మరికొంత వ్యంగ్యంగా “ఇందిరిస్టు గారడీ” సాగుతుంది. “కంసుని కంప్యూటర్” లో వ్యంగ్యం చోటు చేసుకుంటుంది. ఇది విప్లవాల కాలమని చెప్తూ “ఋతుగీత”. ఇలా కాలంతో పాటు కదలిపోతూ ఎప్పటికప్పుడు ఏర్పడుతూన్న పరిస్థితులలోనుండి వస్తువును స్వీకరిస్తూ కవితలు సాగుతాయి. “గురజాడ” సజీవ స్వతంత్ర పాత్రలుకూడా కాలానుగుణంగా మార్పులు చెందినట్లు మలచిన తీరు ప్రతిభావంతమై నిలిచింది.

    తనను కన్నందుకు కన్నతల్లికే ప్రేరణనిచ్చిన విప్లవ చైతన్య స్పూర్తికే విప్లవాభివందనాలర్పిస్తారు. జాఫ్నాలో చనిపోయిన సిపాయితో నిజాల్ని పరికిస్తాడు. ఓ కొడుకుని పోగొట్టుకున్న దళితుని ఆవేదన తెలియజేస్తూ పొంగారిన హృదయదఃఖభాండాన్ని గ్రుమ్మరించాడు.

    ప్రకృతిలోని సాదృశ్యాలను చూపెడుతూ అమరత్వం రమణీయమైనదైనదనీ కాలాన్ని కౌగలించుకుని మరో సంతోషప్రదమైన కొత్త లోకాన్నిస్తుందని తెలియజెస్తారు. తన భావాలూ ఆశలూ ఆశయాలూ కలకాలం నిలిచివుంటాయనీ, వీటిని మరే నిజమైన శక్తి జయించలేదనీ, తాను మృత్యుంజయుణ్ణనీ, “ ఎదురు చూడు నాకోసం” లో చెప్తున్నారు. శారీరక అస్వస్థత దరిజేరినా అంతరంగం మాత్రం ఇంకా వల విసిరి కలల్ని పట్టుకోగలిగిన ఉత్సాహంలోనే ఉన్నదని సైనికుడూ రణరంగమూ కూడా తానే ఐనట్లుగా భావిస్తూ ఇంకా పోరాటభావాలు తనను వీడలేదని తెలియజేస్తారు.

    ఈ విధంగా స్వచ్చమైన మనస్సుతో శక్తివంతమైన భావాన్ని జతకూర్చి అనుభూతి చెందిన కవితలలో పరిణత సిద్ధించుకున్న ప్రజ్ఞాశాలి శివసాగర్..

    మానవజాతి మనుగడకు స్వాభావికమైన విపత్తులెన్నో…వరదలు, అనావృష్టి, కరువు కాటకాలు, భూకంపాలులాంటివి. ఇలాంటివి తలెత్తినపుడు ప్రజల ప్రాణ ధనాలకు నష్టమేకాక బ్రతుకు దుర్భరమౌతుంది. అలా కాక కేవలం మనిషిలో తలెత్తిన స్వార్ధంతో అహంకారంతో ఎదుటివారిని మోసం చేయటం వారి శ్రమ శక్తిని దోచుకుని వారిని హింసకు గురి చేయటం క్షమార్హం కాని నేరాలు.

రాసి పంపిన వారు: కొత్త ఝాన్సీలక్ష్మి
[2009 మార్చ్ 15 వ తేదీన DTLC (Detroit Telugu Literary Club, USA) 
లో శివసాగర్ కవిత్వం మీద జరిగిన చర్చ సందర్భంగా రాసిన సమీక్ష]

********************************************************************
పుస్తకం వివరాలు:
రచయిత: శివసాగర్
వెల: 100 రూపాయలు
కాపీలు: తెలుబు బుక్ హౌస్, నవోదయ – హైదరాబాద్ శాఖల్లో లభించును

ఈ వ్యాసం కాపీరైట్లు DTLC వారివి.
*********************************************************************



సిటీ లైఫ్’ నేపథ్యం 


    గుండె నిండా బాధ కళ్ల నిండా నీళ్లున్నప్పుడు మాట పెగలదు. కొంత సమయం కావాలి. దట్టంగా కమ్ముకున్న విషాద మేఘాలు చెల్లాచెదురై హృదయం నిర్మలాకాశం కావడానికి కొంత వ్యవధి కావాలి. భారమవుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసల మధ్యే మృత్యువును పరిహసించేందుకు ఒకింత సాహసం కావాలి. ఉండీ ఉండీ ఉధృతమయ్యేందుకు ఉద్వేగభరితమైన సన్నివేశం కావాలి…

    సరళమైన భాష నుంచి సంక్లిష్టమైన వ్యాకరణంలోకి ప్రవేశించినట్టు, కలల వంతెన కూలి కన్నీటి నదిలోకి దూకినట్టు హైదరాబాదనే మానవారణ్యంలోకి అడుగిడి సరిగ్గా ఇప్పటికి పది సంవత్సరాలు.

    కుంచె నుంచి ప్రవహించే చైతన్యం ఘనీభవించి, కెమెరా ముందు సృజనాత్మకత ఒక అపరిపక్వ స్వప్నంగానే చితికిపోయి, నానాటికీ దారిద్య్రమనే ఊబిలోకి దిగబడి బహుశా ఏ పౌరుడూ పాత్రికేయుడూ పడనన్ని కష్టాలతో చితికి… చితికి… చివరికి ‘సిటీ లైఫ్‌’ పారితోషికమే జీవనాధారంగా స్వీకరిస్తున్న నేపథ్యంలో హృదయం విప్పి నన్నీ నాలుగు మాటలు చెప్పుకోనివ్వండి.

    ఒకప్పుడు పచ్చపచ్చగా బతికినవాణ్ని ఇప్పుడు పత్రహరితం కోల్పోయిన పిచ్చి మొక్కలా… అస్థిపంజరంలా… అసంపూర్తి వాక్యంలా తయారవ్వడానికి గల అనేకానేక కారణాల్లో ఒక నయవంచకుడు నాకు తలపెట్టిన ద్రోహాన్ని కూడా చేర్చవచ్చు. అయితే ఇప్పుడా వివరాలన్నీ తవ్వుకోవడం సముచితం కాదుగానీ… క్రమేణా కంప్యూటర్ల సుడిగుండంలో పడి చిక్కి మునిగిపోయే ముందు విద్యానగర్‌ బస్టాప్‌ పక్కన మెయిన్‌ రోడ్‌లో ‘చిత్రలేఖ’ పేరున నాకో చిన్న స్టూడియో ఉండి ఉండేది. మనిషి బతికుండగానే గుండెల్లో స్ట్రా గుచ్చి రక్తం పీల్చే ఈ రాక్షస వ్యవస్థలో అతికష్టంగా ఆరు సంవత్సరాలు ఆ స్టూడియోను నడిపిన పర్యవసానానికి దాదాపు నలబై వేల రూపాయల విలువకట్టగల నా చెమట నా యజమానైన ఒకానొక మార్వాడీ గాడి జేబులోకి ఇంకిపోయిందే తప్ప నాకు లాభించిందేమీ లేదు. పైగా అన్నమాట ప్రకారం అప్పులు చెల్లించేందుకు కరీంనగర్‌లో కన్నతండ్రి కట్టించిన ఇల్లు అమ్ముకోవాల్సిన అగత్యం ఏర్పడింది.

    మధ్యతరగతి కౌగిట్లో మాధుర్యం కూడా తరిగిపోయి పరిపరి విధాల మానసిక వేదనతో పాటు పెరిగే ఇద్దరు పిల్లల భారాన్ని మోయటమెలాగనే ఆరాటం.

    మందులు కొనుక్కోలేని నిర్భాగ్యపు నగరంలో మళ్లీ మళ్లీ ఊపిరితిత్తుల్లో క్షయ రాజుకోవటం పరిపాటయి పోయింది. పుట్టిన గడ్డ నుంచి ఇక్కడికి రావటమే పొరపాటయి పోయింది.

    వాస్తవానికి` అవసరానికి నన్ను వినియోగించుకున్న వాళ్లే నాపై జాలీ నోటులా జాలి కురిపించి కుళ్లిన ఆసుపత్రిలా పక్కనజేరి పరామర్శించినా నా నించి ఏమీ ఆశించని వాళ్లే నాకెంతగానో సహకరించారు. ‘ఐసోనెక్స్‌’ నుంచి ‘సైక్లో సెరిన్‌’ వరకూ ఉచితంగా మందులందించిన మహానుభావులెందరో ఉన్నారు.

    ముఖ్యంగా ఇటీవలి కాలంలో వి.వి., ఎ.ఎన్‌., నిఖిలేశ్వర్‌, నిమ్స్‌ మధు, వెంకట్‌, చక్రపాణి, గచ్చు మీద పచ్చనోటులా మోగే నిజాం వెంకటేశం, గంగారెడ్డి మొదలుకొని గద్దర్‌, కాళోజీల వరకూ, మా తమ్ముడు దయాకర్‌, దయామయుడు డాక్టర్‌ పి.పి.ఆర్‌. భాస్కర్‌రావు, డాక్టర్‌ రవీంద్రారెడ్డి, డాక్టర్‌ వెంకటేశ్వరరెడ్డి (సాయిరాం నర్సింగ్‌హోం), డాక్టర్‌ రామచంద్రారెడ్డి (సంఘం నర్సింగ్‌ హోం), డాక్టర్‌ విజయకుమార్‌, ప్రొఫెసర్‌ వేణు, ఆయుర్వేద వైద్యులు ప్రధ్యుమ్నాచార్య నీలంగేకర్‌, రాధాకృష్ణమూర్తి ఇంకా ఎందరో మృత్యువు బారి నుంచి నన్నెప్పటికప్పుడు సంరక్షిస్తూ వస్తున్నారు. ఆక్స్‌ఫర్డు గ్రామర్‌ స్కూల్‌ అధినేత వేదకుమార్‌ మామీద చిలకరించే సానుభూతి జల్లులే మా పిల్లల చదువై కొనసాగుతుంది.

    అయితే నాలోని అరాచకం, వేళకి మందులు వాడని క్రమశిక్షణా రాహిత్యం వల్ల రాను రాను నా శరీరంలోని రోగనిరోధక శక్తి సన్నగిల్లి ఆరునెలల్లో అవలీలగా నయం చేసుకోగలిగిన వ్యాధి పదేళ్లు అంచెలంచెలుగా ముదిరి నా రెండు ఊపిరితిత్తుల్నీ పాడుచేసింది. దశలవారీగా 45, 60, 90, 120 ఇలా వందలాది స్ట్రెప్టోమైసిన్‌, క్యానమైసిన్‌ ఇంజక్షన్‌లు నా ఒంటిమీద స్వైరవిహారం చేసిన ఫలితంగా వ్యాధి సంగతటుంచి భయంకరమైన సైడ్‌ ఎఫెక్ట్స్‌ ప్రారంభమై ఆపాదమస్తకం నా దేహమే ఒక ఆసుపత్రి రోదనగా మారిపోయింది.

    మరీ సందర్భంగా ఖరాఖండిగా ఓ నిజం చెప్పాల్సేవుంది. ఎడతెరిపిలేని దగ్గు, అడుగు కదపనివ్వని ఆయాసం, రక్తం ముద్దలుగా పడుతున్న రోజుల్లో కూడా నేను కవిత్వాన్ని నిర్లక్ష్యం చేయలేదు. నాలోని విలువల్ని భగ్నం చేసుకోలేదు. నా ప్రాపంచిక దృక్పథాన్ని వీడి ఏ ప్రలోభాలకు లోబడలేదు. ఆఖరికి కాలి ధూళితో సమానమైన కలర్‌ సినిమా గ్లామర్‌ను సైతం నా కళ్లల్లో పడకుండా జాగ్రత్తపడ్డానే తప్ప ఎటువంటి కుళ్లు మార్గాలకు తలవొగ్గలేదు. మనోహరాకాశంలో ఎగిరే కొంగ మొదలుకుని మదరాసులోని కొంగర జగ్గయ్య వరకూ నా కవిత్వాన్ని అమితంగా ప్రేమిస్తారని తెలుసు.

    అలిశెట్టి ప్రభాకర్‌కు పాత చెత్త కవుల్లాగా శాలువాలు కప్పించుకోవాల్సిన అవసరమెప్పుడూ కలగదనే ఆత్మవిశ్వాసం కలిగిన ఎమ్వీయల్‌ ఆనాడే ఆంధ్రదేశపు అనేకానేక సభల్లో నన్నూ, నా కవిత్వాన్నీ పలవరించి, పలవరించి పదైదులు నిండకుండానే ఈ ప్రపంచాన్ని విస్కీ సీసాలా తన్నేసి వెళ్లిపోయాడనీ తెలుసు. అయినా నేనేనాడూ పొగడ్తలను పోషక పదార్థాలుగా స్వీకరించి ఉబ్బి తబ్బివ్వలేదు. సగం సగం కమ్యూనిస్టుల సాహవాస దోషం లేకున్నా సహపంక్తి భోజనాల్లో కూర్చున్నట్లే కూర్చొని ఒకర్నొకరు అనుమానాస్పదంగా చూసుకొనే సాహిత్య సభల్లోకి తరచూ వెళ్లకున్నా అడపా దడపా జననాట్య మండలి గుండె చప్పుడు వినో అరుదుగా కదిలే జన మైదానాలను కనో ప్రతిస్పందించే నాకు మెజార్టీ ప్రజల బాధలూ గాధలే ముడిసరుకయ్యాయి.

    చాటుమాటుగా అర్ధాంగి చేటలో కన్నీళ్లు చెరుగుతున్నప్పుడు సంసారం బరువెంతో సమీక్షించగలిగిన వాణ్ని, ఆకుపచ్చని చెట్టు, ఆహ్లాదభరితమైన వాతావరణమేమీ లేకుండానే పగలూ రాత్రీ యాస్బెస్టాస్‌ రేకుల కింద ఎంత వేడెక్కినా మాడిపోకుండా ఉండగలిగిన మానవాతీతుణ్ని. నరకప్రాయమైన నగర నాగరికతకు నరనరానా జీర్ణించుకున్నవాణ్ని. రోజుకో రెండు కవితా వాక్యాలు రాయలేనా… అది మనకు పెన్నుతో పెట్టిన విద్య… అఫ్‌కోర్స్‌ కవిత్వం ఎంత నిత్యనూతనంగా వెలికి వచ్చినా రాసిన ప్రతిది ఆణిముత్యం కాదని అందరికి తెలుసు. కవిత్వమే పాత్రికేయ వృత్తిలో అంతర్భాగమైన ఈ రోజుల్లో ‘న్యూస్‌ ప్రింట్‌’ మీద రోజూ నా పేరు అచ్చు కావడం పెద్ద విశేషమూ కాదు.

    ‘ఆంధ్రజ్యోతి’ హైదరాబాద్‌ ఎడిషన్‌ వెలువడుతున్న సందర్భంగా ఆప్యాయంగా నన్ను పిలిచి ఈ శీర్షిక ‘సిటీ లైఫ్‌’నప్పగించింది ఎ.బి.కె. ప్రసాద్‌ గారే అయినా ఆనాటి నుంచి ఆరేళ్లుగా, ధారావాహికంగా ప్రచురించబడటానికి సౌమ్యులూ, సౌహార్ధ్ర హృదయులైన మా నండూరి రామమోహనరావు గారు, ఎం.డి.జగదీష్‌ ప్రసాద్‌, ఆంక్షలేవీ విధించని ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్‌ బోర్డే కారణం. ముఖ్యంగా నగరం పొలిమేరలు దాటని ఈ శీర్షికను తెలంగాణ జిల్లాలకు విస్తరింపచేసిన ఐ.వెంకట్రావు గారు అభినందనీయులు. అంతేకాదు నెలకు ఏ ఒకటి, రెండుసార్లో ఆఫీసుకెళ్ళినా మురళి, శ్రీనివాస్‌, గుడిపాటి, రవికిషోర్‌ ఎవరెదురైనా ‘‘అన్నా! ఆరోగ్యం బావుందా?’’ అని ప్రేమతో పలకరించి అరకప్పు ‘టీ’ తాగించే సబ్‌ఎడిటర్‌ మిత్రులూ, సంధ్యా సమయాన టెలిప్రింటర్ల మీద వార్తలు నెత్తురోడుతున్న సందట్లో సైతం ‘సిటీ లైఫ్‌’ను ఫోనులో చెప్పినా చక్కగా రిసీవ్‌ చేసుకునే ఆంజనేయులు, చిన్ని రామకృష్ణ, ఇంకా నర్సిమ్‌, భూషణ్‌, లే అవుట్‌ ఆర్టిస్టులు.

    సమయానికి ప్రెస్‌కందించే జైహింద్‌, జనసత్యం లాంటి తమ్ముళ్ల సహకారముండబట్టే నా అనారోగ్యం కూడా అడ్డంకి కాకుండా ‘సిటీ లైఫ్‌’ ఇలా నిర్నిరోధంగా సాగిపోతుంది. సిటీ లైఫే నా సమగ్ర కవితా స్వరూపానికి కొలబద్దా కాదు. సుదీర్ఘ కవితా ప్రకంపనా కాదు… కానీ ధ్వంసమై పోతున్న సమస్త మానవ విలువల్నీ, హింసా రాజకీయాల్నీ నిరసించటంతో పాటు నిప్పు కణికల్లాంటి, కన్నీటి గుళికల్లాంటి చిన్న చిన్న కవితలెన్నో ప్రతిరోజూ ‘ఆంధ్రజ్యోతి’ పాఠకులకందించగలుగుతున్నాను.

    రోజుకో మందు బృందంలో పాల్గొని పలుచబడిపోతున్న సాహిత్య భ్రష్టుల కోసమో, అవార్డుల కోసం క్యూలో నిలబడే అర్భకుల కోసమో, ఇస్త్రీ నలక్కుండా విప్లవ సందేశాల్ని అందించే మేధావుల కోసమో, కవిత్వంలోనూ జీవితంలోనూ ద్వంద్వ ప్రమాణాలనవలంబించే దౌర్భాగ్యుల కోసమో కాక, సామాన్య పాఠకుడి కోసమే ఈ సిటీ లైఫ్‌ని ప్రచురించటానికి పూనుకున్నామని చెప్పొచ్చు.

    సామాజిక స్పృహ కలిగిన రచనల సరసన చేర్చిన ఈ ‘సిటీ లైఫ్‌’ ముద్రణకు తెలుగు విశ్వవిద్యాలయం తరఫున ‘సినారే’నే దీనికి మొదట శ్రీకారం చుట్టినా ఈ ప్రచురణా కార్యక్రమం మొదలైనప్పటి నుంచీ మూడుసార్లు ఆస్పత్రిలో చేరి డిశ్చార్చి కావటం. అరవై బొమ్మల కోసం అతి సన్నిహితుడైన నర్సిమ్‌ చుట్టూ ఆరు నెలలు ప్రదక్షిణ చేయాల్సి రావటం, బ్రోమైడ్‌లు అనుకున్న విధంగా రాకపోవటం, లై అవుట్‌ ఆర్టిస్టులైన నారాయణ, శ్రీనివాసులు చెరో గంట పనిచేసి చెప్పాపెట్టకుండా పారిపోవటం… ఇటువంటి చిన్నా పెద్దా సమస్యలెన్నో ఎదుర్కొన్నా వాటినధిగమించడానికి తోడ్పడిన మిత్రులు రాధాంజనేయ స్వామి (యు.ఎస్‌.జి.సి), ఉదయ భాస్కర్‌, జయధీర్‌, తిరుమలరావు, రాజమౌళి, పెన్మెత్స రాజు, మాధవి, కవిత్వం విషయంలో ప్రత్యేకాభిమానం చూపించే పద్మజా విద్యాసాగర్‌లు, పవన్‌, ఆనంద్‌, ప్రవీణ్‌లు, కవితాత్మీయులు స్మైల్‌, ఆర్కె, నవీన్‌, మల్లారెడ్డి, నాగేశ్వర్‌రావులు, నరేష్‌, హరీష్‌ విజన్‌ గ్రాఫిక్స్‌ మిత్రులు ఆనంద భాస్కర్‌ మరియు శ్రీనివాస్‌, ప్రెస్‌ కార్మికులకు హృదయపూర్వకాభివందనాలు తెలుపుతూ అతి సమయమనంగా వ్యవహరించి ముద్రించగలిగినప్పటికీ ఎంతో కొత్త అసంతృప్తి నాలాంటి వాడికి మిగిలిపోతూనే వుంటుంది. ఏమైనప్పటికీ అలల హోరులా అంతరంతరాల్లో రగులుతున్న ఈ సిటీ లైఫ్‌ నేపథ్యాన్ని ఇంతటితో ముగిస్తూ ఈ చిన్ని కవితా ప్రపంచంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ…

ప్రేమతో
మీ అలిశెట్టి ప్రభాకర్‌
4 జులై 1992
(‘సిటీ లైఫ్’ కవితా సంకలనం ముందుమాట నుంచి…)
పుట్టింది కరీంనగర్ జిల్లా, జగిత్యాల. కవి, చిత్రకారుడు. ఫొటో గ్రాఫర్. విరసం సభ్యుడు. జగిత్యాల జైత్రయాత్ర వెల్లువలో విప్లవోద్యమాన్ని ప్రేమించాడు. 1979లో విప్లవ రచయితల సంఘంలో సభ్యుడయ్యాడు. అద్భుతమైన సాహితీ సృజనచేసి, తెలుగు సాహిత్యంపై చెరగని ముద్రవేశాడు. రచనలు : ఎర్ర పావురాలు (1977), మంటల జెండాలు (1979), చురకలు (1981), రక్త రేఖ (1985), సంక్షోభ గీతం (1990), సిటీ లైఫ్ (1992), మరణం నా చివరి చరణం కాదు. తీవ్ర అనారోగ్యంతో 1993 జనవరి 12న చనిపోయాడు.
*********************************************************

అలిశెట్టి ప్రభాకర్ కవితలు

కొలిమి
ప్రత్యామ్నాయ కళా సాహిత్య సాంస్కృతిక వేదిక