"తెలుగు శాఖ, స్నాతకోత్తర కేంద్రం గద్వాల, పాలమూరు విశ్వవిద్యాలయంలో నేను బోధించే సిలబస్, సిలబస్ లోని పాఠ్యాంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారం ప్రతిబింబించే వేదిక."

 సాహిత్య పరిశోధకులకు ఓ కొత్త మార్గదర్శిక




పరిశోధకులకు కొన్ని ప్రశ్నలు 

1. సాహిత్య పరిశోధన చేస్తున్న వాళ్ళని మీరు పాటించిన పరిశోధన పద్ధతి ఏమిటి? 
2. మీ పరిశోధనలో ‘సమస్య’ (Problem of the Research) ఏమిటి? 
3. మీపరిశోధనలో గల ఊహాపరికల్పన (Hypothesis), సిద్ధాంతం (Thesis), ఫలితాంశాలు (Results) ల మధ్య భేదాల్ని వివరిస్తారా? 
4. పరిశోధన, విమర్శ, సృజనాత్మక సాహిత్యాలకు, వాటి శైలికీ మధ్య భేదాలేమైనా ఉంటాయా? చూశారా? 
5. రిఫరెన్సులు, ఉపయుక్త గ్రంథ సూచికలు రాయడానికి మీరే పద్ధతిని అనుసరించారు?
6. MLA, Harvard, Chicago, APA...ఇలా అనేకంగా ఉన్న శైలీపత్రాల్లో మీరు దేన్ని అనుసరించారు?
7.  Viva-voce (మౌఖిక పరీక్ష)లో మొదలైన ప్రాథమికాంశాలను అడిగితే చెప్పలేని వాళ్ళెంతోమంది ఉన్నారు

ఇది పరిశోధక విద్యార్ధులకే కాదు, పరిశోధన పూర్తిచేయించిన పర్యవేక్షకులకు కూడా చాలా మందికి తెలియదు. ఈ విషయాన్ని ఆ పరిశోధన గ్రంథాన్ని చూస్తేనే తెలుస్తుంది. ఇది Adjudication కి వస్తున్న పరిశోధన గ్రంథాలను చూసిన స్వీయానుభవంతో చెప్తున్నమాట. ఉపయుక్తగ్రంథాల జాబితాను, రిఫరెన్సులను చూస్తుండగానే ఆ పరిశోధన గ్రంథం ఎంత ‘శాస్త్రీయం’గా రూపొందిందో అర్థమవుతుంది. అయితే, కొన్ని విశ్వవిద్యాలయాల నుండి కొంతమంది శాస్త్రీయంగా రాస్తున్నవారూ, పరిశోధన చేయిస్తున్నవారూ ఉన్నారు.
తెలుగులో పరిశోధనలు ‘ఇలా’ మారడానికి లేదా రావడానికి గల కారణాలేంటి? రీసెర్చ్ మెథడాలజీ అనేదొక క్రమపద్ధతిలో బోధించాల్సిందని గుర్తించకపోవడం ఒక  ముఖ్యకారణం. అలా బోధించాలంటే తగిన పుస్తకాలుండాలి. తెలుగులో అలాంటి పుస్తకాలున్నాయా? కొన్ని ఉన్నాయి!

1. పరిశోధన పద్ధతులు (అప్పారావు గంధం &  కాళిదాసు సూర్యనారాయణ ) 
2. పరిశోధన విధానం (ఎస్‌. జయప్రకాష్‌)జీవియస్‌ వ్యాసాలు (జి.వి. సుబ్రహ్మణ్యం),  
3. పరిశోధన పద్ధతులు (ఆర్వీయస్‌. సుందరం), 
4. పరిశోధన సూత్రాలు ( కుసుమాబాయి &  కులశేఖరరావు), 
5. సాహిత్య పరిశోధన సూత్రాలు( రాచపాళెం చంద్రశేఖరరెడ్డి & హెచ్‌.ఎస్‌. బ్రహ్మానంద),  
6. పరిశోధన విధానం: సిద్ధాంత గ్రంథ రచన (పులికొండ సుబ్బాచారి) 

    మొదలైన పుస్తకాలు తెలుగు భాషాసాహిత్యాలపై పరిశోధన చేస్తున్నవాళ్ళకు పరిశోధన స్వరూప, స్వభావాలు, పద్ధతులను ప్రాథమికంగా అవగాహన చేసుకోవడానికి చాలావరకు సహకరిస్తున్నాయి. ఇంకేమున్నాయి?

    కొన్ని విశ్వవిద్యాలయాల్లోని తెలుగుశాఖలు ఉన్న పరిశోధన తీరుతెన్నుల గురించి కొన్ని ప్రత్యేక సంచికలు ప్రచురించాయి. తెలుగు అకాడమి వారు పరిశోధనలకు సంబంధించిన ఒక ప్రత్యేకసంచికను ప్రచురింది. అభ్యుదయ విశేష సంచికలో కూడా పరిశోధనకు సంబంధించి ఒక ప్రత్యేకసంచికను ప్రచురించారు. వీటితో పాటు కొన్ని మాస, త్రైమాసిక పత్రికలు ఈ అంశాన్ని చర్చించే వ్యాసాలను ప్రచురించాయి.

    ఆచార్య వెలుదండ నిత్యానందరావుగారు విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన గ్రంథాన్ని సాధ్యమైనంతవరకు తాజా సమాచారంతో అందిస్తున్నారు. ఈ పుస్తకంతో పాటు వివిధ విశ్వవిద్యాలయాల తెలుగు శాఖల వారు ఆ శాఖల్లో జరుగుతున్న పరిశోధనల వివరాలను అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ పూర్వ పరిశోధనల సమాచారాన్ని సేకరించుకొని, తమ పరిశోధనల్లో  పూర్వ పరిశోధనల సమీక్ష (Review of literature) కి సహకరిస్తాయి. వీటన్నింటిలోను ‘పరిశోధన పద్ధతులు’ ఉంటున్నప్పటికీ, ఆ పద్ధతులు తెలుగు భాషాసాహిత్య పరిశోధనలకు పూర్తిగా సమన్వయించుకోవడానికి అవకాశం ఉందా? లేదా? అనే సందేహాలు నేటికీ పరిశోధకుల్లో కలుగుతున్నాయి.

    ఆంగ్ల సాహిత్యంలో వస్తున్న Research Methodology  పుస్తకాల్లోను కొంత గందరగోళం ఉన్నా, ఆ గందరగోళాల్లోని సమస్యలకు పరిష్కారాలను వివరణాత్మకంగా వివరించే గ్రంథాలు కూడా చాలా ఉన్నాయి. ఇలా పరిశీలిస్తే- సృజన, పరిశోధన, విమర్శ రచనలను చేయడానికి, వాటిని అధ్యయనం చేయడానికి ఆంగ్లంలో చాలా రచనలున్నాయి. ముఖ్యంగా ఫిక్షన్ ని శాస్త్రీయంగా వివరించే ప్రయత్నం చేసిన గ్రంథాలు పరిశోధకులకు చాలా ఉపయోగపడతాయి. వీటిలో  The Art of the Novel (Milan Kundera), The Art of the Novel (Henry James), Aspects of the Novel ( E.M.Forster),  The Art of Fiction (David Lodge) మొదలైనవి ముఖ్యమైనవి.

    తెలుగులో ఇలాంటి రచనల్ని వెతికితే చాలా తక్కువ సంఖ్యలో కనిపిస్తున్నాయి. ఈ ఆలోచనలతో రాసిన రచనలు కొన్ని వ్యాసాలు రూపంలోను, కొన్ని అనువాదాల ప్రభావంతోను వచ్చాయి. The Novel and the People (Ralph Fox) పుస్తకాన్ని తెలుగులో వల్లంపాటి ‘నవల-ప్రజలు’ పేరుతో అనువదించారు.

    తెలుగులో ఈ దిశగా ఆలోచిస్తే, సంస్కృతంలో కొన్ని లక్షణ గ్రంథాలు, వాటి ప్రభావంతో వచ్చిన రచనలే మనదృష్టికొస్తాయి. సాహిత్య (కావ్య) శాస్త్రం లేదా అలంకార శాస్త్రాలుగా వీటిని పిలుచుకుంటున్నాం. వీటిలోని కొన్ని సిద్ధాంతాలు, లక్షణాలు సాహిత్య విమర్శకు  స్వీకరించక తప్పదు. అయినప్పటికీ, సాహిత్య విమర్శకీ, భారతీయ సాహిత్య (కావ్య) శాస్త్రానికీ మధ్య భేదం ఉంది.  వీటిని విశ్వవిద్యాలయాల స్థాయిల్లో అధ్యయనం చేసేటప్పుడు నేటికీ కొన్ని విశ్వవిద్యాలయాల్లో  ‘తెలుగు సాహిత్య విమర్శ’ గా కలిపేసి బోధిస్తున్నారు. మరి కొన్ని విశ్వవిద్యాలయాల్లో ముఖ్యంగా హైదరాబాదు విశ్వవిద్యాలయం, తెలుగుశాఖలో  కావ్య శాస్త్రం, సాహిత్య విమర్శ, కళాతత్త్వశాస్త్రం మొదలైన కోర్సులను ప్రత్యేకంగా బోధిస్తున్నారు. వీటితో పాటు తెలుగు భాషాసాహిత్య పరిశోధనను ప్రత్యేకంగా ఒక పాఠ్యాంశంగా అధ్యయనం చేస్తున్నారు. ఇదే పద్ధతిలో మరికొన్ని విశ్వవిద్యాలయాలు కూడా కొన్ని ప్రత్యేక కోర్సులను రూపొందించి అధ్యయనం చేయడం హర్షణీయం. ఈ అవగాహన తెలుగు భాషాసాహిత్యాలను అధ్యయనం చేస్తున్న విశ్వవిద్యాలయాలు అన్నింటిలోను రావలసిన అవసరమెంతో ఉంది.  

    ప్రపంచీకరణ ఫలితంగా ‘జ్ఞానం’ ప్రజాస్వామీకరణకు గురవుతున్నట్లు కనిపిస్తూనే, కొన్ని ‘వర్గాల’ గుత్తాధిపత్యం వైపు పయనిస్తోందేమోననిపిస్తుంది. ఇది కేవలం కొన్ని శాస్త్రాలకే పరిమితం కాదు; అన్ని శాస్త్రాలకూ వర్తిస్తుంది. ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంలో కొనసాగుతున్న విద్య కొన్ని వర్గాలకు అందుకోలేని పరిస్థితి రాబోతుందనిపిస్తోంది. నైపుణ్యం, శాస్త్రీయతలు ఉన్నతవిద్యను శాసించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉన్నతవిద్య అనేది ప్రభుత్వ సంస్థల్లో కంటే ప్రయివేటు సంస్థల్లోకి చేరుపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల ప్రభావం అన్ని శాస్త్రాల్నీ శాసించినట్లే, భాషాసాహిత్యాల్నీ ప్రభావితం చేస్తాయనుకుంటున్నాను. అలాంటప్పుడు శాస్త్రీయత, నైపుణ్యాలే అవి నిలబడ్డానికి ప్రధాన కొలమానాలవుతాయి. ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయ విరాళాల సంఘం (University Grants Commission), National Assessment and Accreditation Council (NAAC)  వారు తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాల్ని పరిశీలిస్తే ఈ విషయం మరింత స్ఫష్టంగా బోధపడుతుంది. ఈ సంస్థల పర్యవేక్షణలో మన సీనియర్ ప్రొఫెసర్స్ మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఉన్నత విద్యాభివృద్ధికి కొత్తకొత్త నియమావళిని ప్రకటిస్తున్నారు. స్వయంప్రతిపత్తి కళాశాలలకు అనుమతులిస్తున్నారు. వీటన్నింటికీ పరిశోధనల్లోని నాణ్యతలను అనుసరించి ‘గ్రేడ్స్’ ప్రకటిస్తున్నారు. ఇవన్నీ ఉన్నతవిద్యలో నైపుణ్యాభివృద్ధికి, శాస్త్రీయావగాహనకు తోడ్పడే అంశాలు. ‘శాస్త్రీయత’ అనగానే కేవలం విజ్ఞానశాస్త్రాలు (Pure Sciences) లోనే ఉంటుందనుకోవడానికి వీల్లేదు. అవి Sciences, Social Science, Humanities లలో ఏ శాఖల్లోనైనా ‘శాస్త్రీయమైన’ బోధన అవసరం. Sciences లో ఉన్నంత ఖచ్చితత్వ నిరూపణ మిగతాశాస్త్రాల్లో అసాధ్యమనే మాట అతార్కికం!

    Pure Sciences లో కొన్ని ప్రయోగశాలలు (Labs) ఉంటాయి. వాటిలో కొన్ని పద్ధతుల ప్రకారం కొన్ని ప్రయోగాలు చేసి ఫలితాంశాలను నిరూపిస్తుంటారు. సామాజికశాస్త్రాలు, మానవీయశాస్త్రాలకు సమాజం, మానవ అనుభవాలే ప్రయోగశాలలు. వీటిని నిరూపించడానికి కూడా కొన్ని పద్ధతులున్నాయి. అవి విజ్ఞానశాస్త్ర పరిశోధకులు ఉపయోగించే పరికరాలు, పద్ధతుల వంటివి కాకపోవచ్చు. కానీ, సామాజికశాస్త్రాలు, మానవీయ శాస్త్రాలకు కొన్ని పద్ధతులు ఉంటాయి. వీటన్నింటినీ సర్వసాధారణంగా పరిశోధన పద్ధతులనో, కౌశలాలు (Techniques) అనో పిలుస్తున్నారు. జాగ్రత్తగా పరిశీలిస్తే, ఒక్కొక్క శాస్త్రానికీ ఒక్కొక్క ‘పద్ధతి’ని రూపొందించుకోవలసిన అవసరం ఉంటుంది. నిజానికి భాషా సాహిత్య పరిశోధన, ఇతర శాస్త్ర పరిశోధనల కంటే భిన్నమైందేనని . ఈ దిశగా ఆంగ్ల భాషలో వచ్చిన కొన్ని గ్రంథాలను చూస్తే తెలుస్తుంది.  An Introduction to Research in English Literary History (Chauncey Sanders), Theory of Literature (Wellek and Warren), The Handbook to Literary Research (Delia da Sousa Correa and W.R.Owens), The Craft of Language and Literary Research (Syed Mohammad Haseebuddin Quadri), Research Methods in English (M.P.Sinha) మొదలైన పుస్తకాల్లో Literary Researchలో కొన్ని ప్రత్యేక పద్ధతుల్ని పాటించాలనే స్పృహ కలుగుతుంది. ఆంగ్ల భాషలో ఉన్న పుస్తకాలు, ప్రధానంగా ఆంగ్ల, యూరోపియన్ సాహిత్యాల్ని ఉదాహరిస్తూ వచ్చిన రచనలు. వీటిలో కొన్నింటిని పరిశీలించిన తర్వాత Science Research, Social Sciences / Humanities Research, Literary Researchలకూ మధ్య కొన్నింటిలో సారూప్యాలున్నా, ప్రత్యేక పద్ధతుల్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉందనిపించింది.

     తెలుగులో కూడా ఈ దిశగా పుస్తకాలు అందుబాటులో ఉంటే బాగుండునని అనుకుంటున్న సమయంలో నాకు ‘ఆధునికత-సమకాలికత : కొన్ని పార్శ్వాలు’ (2016) అనే పుస్తకం కనిపించింది. దీన్ని బోధన, పరిశోధన, పాలనా రంగాల్లో విశేషమైన అనుభవం ఉన్న ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణగారు రాశారు. దీనిలో తెలుగు భాషాసాహిత్యాలకు సంబంధించిన ప్రత్యేక పరిశోధన పద్ధతుల గురించి కొన్ని వ్యాసాలు ఉన్నాయి.

    భాషాసాహిత్యాల్లో ‘దర్శనం’ ప్రధానమవుతుందని భారతీయాలంకారికుల్లో అభినవగుప్తుని సిద్ధాంతాలతో పాశ్చాత్య సిద్ధాంతాల్ని సమన్వయిస్తూ విభిన్న అంశాలపై రాసిన వ్యాసాలు సాహిత్య పరిశోధనలు చేసేవారికి మోడల్ గా నిలుస్తాయనిపించింది. సాహిత్యపరిశోధనలో తార్కికత, నిరూపణలు సాధనాలుగా ఉపయోగించుకుంటూ ఆ కవి లేదా ఆ రచనను ‘దర్శింప’ చేయగలగాలి. వీటిని లక్ష్మీనారాయణ గారు వివరించిన విధానం నాకు బాగా నచ్చింది.

    ‘ఆలోచనలోని క్రమబద్ధతలకు, వ్యక్తిలోని హేతుశీలకు రూపం తార్కికత. చక్కటి ఆలోచనావిధానమే తార్కికత’ (ఆధునికత-సమకాలికత: కొన్ని పార్శ్వాలు, పుట:116)

    ‘‘పరిశోధనకు జీవధాతువు కొత్త సమాచార సేకరణ, లేదా, కనీస కొత్త విశ్లేషణ/ఆవిష్కరణ. దానికి ప్రాణం పోసేది విమర్శనాశక్తి. విమర్శనాశక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రతివిషయంలోనూ కొత్తఖాళీ-స్పేస్-కనబడుతూనే ఉంటుంది. కొత్త దర్శనం స్ఫురిస్తూనే ఉంటుంది. ఆ దర్శనమే పరిశోధనకు ఫలం. పరిశోధన చేత ఒక సాహిత్య అధ్యేత సమకూర్చుకొనేది ‘దర్శన’బలం.’’ (పుట: 369)

    ‘‘కంటితో భౌతికంగా చూసేది వీక్షణం. మనసుతో లోన-అంతస్తులను-చూడగలిగేది దర్శనం...వ్యక్తిని చూడ్డం వీక్షణం-‘వ్యక్తిత్వా’న్ని గ్రహించడం దర్శనం...ఆ వ్యక్తిత్వ నిర్మాణానికి కారణమైన భూమికలను, వాటి తాత్త్వికతలను సవిమర్శకంగా చూడగలిగితే అది నిజమైన దర్శనం.’’ (పుట: అదే)

‘‘ఎందులో పరిశోధన చేసినా, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పట్టా ఇస్తాం. ఆ మాటకు న్యాయం చేకూరేది ఆ పరిశోధనలో దర్శనం సిద్ధించినప్పుడే. పరిశోధనకు అంతిమ ఫలం దర్శనం’’ (పుట: అదే)

    ఇలా ‘దర్శనం’ చేసి, నిరూపించినవాటినే పరిశోధనలుగా పిలుస్తున్నామా? 

విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలుగా సమర్పిస్తున్న గ్రంథాల పుటలను బట్టి డిగ్రీలను నిర్ణయించాలా? డిగ్రీలను బట్టి పుటలను నిర్ణయించాలా? 

    పరిశోధన గ్రంథంలో ప్రధానమైనవి పుటలా ? ప్రతిపాదనా? సమన్వయమా?  సిద్ధాంతమా? – ఇలాంటి ప్రశ్నలు అప్పుడే పరిశోధనలో ప్రవేశించిన వాళ్ళకు ఎదురవ్వడం సహజం. దీన్ని తమ గ్రంథంలో ఇలా ప్రస్తావించారు. ‘‘ఎం.ఫిల్., కు 120 పుటలు, పిహెచ్.డి. కి 250 పుటలని కొందరో సూత్రాన్ని ఏర్పరిచారు. చివరికవి పుటలకోసం పరిశోధనలుగా మారాయి. ఎం.ఫిల్.కు విస్తృత పరిశోధన చేయకూడదని కాదు. ఎం.ఫిల్.కు పిహెచ్.డి. కి మధ్య అంతరాన్ని గుర్తించడంలో ఒక ప్రణాళిక బద్ధమైన విధానం ఏర్పడాలి’’ (పుట: 171)

1.      దీనితో పాటు మరో విషయాన్ని కూడా చర్చకు పెట్టారు. ఎం.ఏ. పూర్తయిన వెంటనే ప్రతిభ లేదా అదృష్టం వల్లనో బోధనలోకి వెళ్తున్నారు. వారికెలాంటి భాషాసాహిత్యాల బోధన, పరిశోధనల్లో శిక్షణా ఉండటంలేదు. దాని వల్ల బోధనా ప్రమాణాలు సన్నగిల్లుతున్నాయనేది వీరి అభిప్రాయం. (పుట: 172)

2.      తెలుగు పరిశోధన కేవలం సాహిత్య భాషాశాఖలకే పరిమితం కానక్కరలేదు. చరిత్రశాఖల్లోనూ సాహిత్యాంశాల ఆధారంగా పరిశోధనలు చేయవచ్చు. చరిత్రలో లిఖిత, అలిఖిత ఆధారాలకు శాసనాల వంటివి ఆకరాలుగా పనిచేస్తాయి. వీటిలో భాషాసాహిత్యాంశాలు ఉంటాయి. వీటిపై కేవలం భాషాసాహిత్య శాఖలే కాకుండా ఇతర శాఖలు కూడా పరిశోధనలు చేస్తున్నాయి. (పుట: 180)  అందువల్ల వీటికి కేవలం సాహిత్య పరిశోధన పద్ధతులే సరిపోవు. సామాజికశాస్త్రాల పద్ధతులను మిళితం చేసుకొని సమన్వయించుకోవాల్సిన అవసరం ఉంది.

3.      ‘‘తెలుగులో పరిశోధన ‘మెథడాలజీ’ని పటిష్టంగా పాటిస్తున్నారా?... అసలు మెథడాలజీకి సరైన పుస్తకాలున్నాయా? అన్న ప్రశ్నలు తరచూ వినబడుతూనే ఉన్నాయి. ఇందుకు స్పందనగా పరిశోధనలపై వచ్చిన పుస్తకాలలో సాహిత్యశాస్త్రాన్ని అన్వయించి చూడవలసి ఉంటుందన్న భావనే మొలకెత్తకపోవడం అన్యాయం. ’’ (పుట: 183)
4.      ‘‘మనం సరిగ్గా ‘సాహిత్య పరిశోధనా సంవిధానాన్ని’ గుర్తించగలిగామా? సాహిత్య పరిశోధనలో ముఖ్యాంగాలైన ‘సిద్ధాంతం’; ‘విమర్శ’; ‘చరిత్ర’ అనే మూడింటి మధ్య శాస్త్రీయమైన అన్వయం కోసం ఆలోచించామా? కళగా సాహిత్య ప్రతిపత్తిని దృష్టిలో ఉంచుకొని దాని పరిశోధనా సంవిధానానికి సరైన పాఠ్య క్రమాన్ని నిర్ణయించగలిగామా?’’ (పుట: 183)

    ఈ ప్రశ్నలకు వివరణల్ని మళ్ళీ ఈ పుస్తకాన్ని రాసిన ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణగారితోనే చర్చించాను. ఈ సందర్భంలోనే,  హైదరాబాదు విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో ఎం.ఏ., స్థాయి నుండే పరిశోధన పద్ధతులను అవగాహన కలిగించే ఒక కోర్సు (Techniques of Writing a Dissertation/Thesis)ని బోధిస్తున్న సంగతినీ ప్రస్తావించాను. పరిశోధన చేసేటప్పటికంటే, బోధించేటప్పుడు ఆ మౌలికమైన పుస్తకాల్ని చదువుతూ, పాఠం చెప్తుంటే నాకు చాలా సందేహాలు వస్తున్నాయని చెప్పాను. ఆ సందేహాల్ని తీరుస్తున్నట్లుగా ఈ పుస్తకంలో తెలుగు భాషా సాహిత్య చరిత్ర, సాహిత్య విమర్శ, భాషాసాహిత్య పరిశోధనలకు సంబంధించిన కొన్ని సైద్ధాంతిక భావనలు విద్యార్ధులకు, పరిశోధకులకు, అధ్యాపకులకు మార్గదర్శనం చేసేలా ఉన్నాయన్నాను. దాన్ని నా కోర్సులో రిఫరెన్సు పుస్తకంగా పెట్టాలనుకుంటున్నానని, అనుమతిని కోరుతున్నానని అన్నాను. తన లక్ష్యం నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందంటూనే, అంతపెద్ద పుస్తకం ఎం.ఏ. స్థాయి విద్యార్థులకు ‘బరువు’ అవుతుందేమో, వాళ్ళకు కావలసిన అంశాలు ఒక అరవై, డెబ్బై పుటల్లో ఎడిట్ చేస్తే బాగుంటుందన్నారు.  ఈ పుస్తకంలో సూచనామాత్రంగా చెప్పిన కొన్ని అంశాలను, పరిశోధకులకు తక్షణం ఉపయోగపడే మరికొన్ని అంశాలను ఓ ‘చిన్నిపుస్తకం’ గా తెస్తే బాగుంటుందన్నాను.  

    ‘ఈయనేంటిప్పుడు పరిశోధన విధానాల్ని తెలిపే పుస్తకాలు రాస్తున్నారనుకోరా’’  అంటూ,  ‘‘ఒక పనిచెయ్... పరిశోధన పద్ధతులకు కావలసిన అంశాలు నా పుస్తకంలో ఉన్నాయన్నావు కదా. వాటిని ఒక చోట పెడితే, వాటికి మరికొన్ని అంశాల్ని రాసిస్తాను. అయితే దానికి నువ్వే ఎడిటర్ గా ఉండాలి’’  అన్నారు.

    మా తొలి బ్యాచ్ (ఎం.ఏ., స్థాయిలో ఈ యేడాది  నుండే ప్రారంభమైన Techniques of writing a Dissertation / Thesis కోర్సు ) వాళ్ళకి కూడా ఉపయోగపడాలనుకున్నాను. ‘ఎడిటర్’ గా నాకో గొప్ప అవకాశాన్ని కల్పించారు. పుస్తకంలో ఉండాల్సినవేమిటో ఆయన చెప్పారు. నేను కూడా ఒక పరిశోధక విద్యార్ధిలా, ఒక పరిశోధనాంశాన్ని బోధిస్తున్న అధ్యాపకుడిలా మా అవసరాల్నీ నా చర్చల్లో చేర్చాను. చాలా వాటిని ఈ పుస్తకంలో చేర్చారు. ఈ పుస్తకం సాహిత్య పరిశోధనలో ఒక మైలురాయి కాగలదనుకుంటున్నాను. దీనిలో పరిశోధనకు సంబంధించిన Dissertation, Thesis లకు సంబంధించిన వివరణలున్నాయి. అలాగే, భారతీయ సాహిత్య సిద్ధాంతాలనుండి తీసుకోవాల్సిన మౌలికాంశాలైన ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసాలను సాహిత్య పరిశోధనలో అన్వయించుకోవాల్సిన విధానాన్ని సూచించారు. కావ్యాత్మ సిద్ధాంతాలుగా ప్రాచుర్యంలో ఉన్న రస, ఆలంకారిక, వక్రోక్తి, రీతి, ధ్వని, ఔచిత్య సిద్ధాంతాల్ని సాహిత్యంలో దర్శించి, వివరించే విధానాల్ని తెలిపారు. భారతీయ సాహిత్య సిద్ధాంతాలు పాశ్చాత్య సిద్ధాంతాలైన రీడర్ రెస్పాన్స్ థియరీ, మ్యాజిక్ రియలిజమ్ వంటి వాటిగా పరిణమించిన తీరు భావి పరిశోధకులకు కొత్త చూపునిస్తుందని అనుకుంటున్నాను. సాహిత్య విమర్శ, సిద్ధాంతం, కావ్యమీమాంస (కావ్య శాస్త్రం) వంటివాటిని పర్యాయపదాలుగా వాడేస్తున్నా, వాటి ప్రత్యేక అర్ధాలను పరిశోధకులు అవగాహన చేసుకోవాల్సిన అవసరాన్ని ఈ పుస్తకం వివరిస్తుంది.

    సాహిత్య పరిశోధనలో 1. పాఠ్య పరిశోధన విధానం, 2. జీవన చారిత్రక పరిశోధన, 3. కవి/కృతి కాల పరిశోధన, 4. కృతి వ్యాఖ్యానాత్మక పరిశోధన, 5. ప్రక్రియా వికాస పరిశోధన, 6. భావతత్త్వవికాస పరిశోధన అని ఆరు పద్ధతుల్ని వివరించారు. 

    వీటితో పాటు సిద్ధాంతం, చరిత్ర, విమర్శల మధ్య భేద సాదృశ్యాల్ని ఎలా విశ్లేషించాలో స్పష్టంగా చెప్పారు. మూడో అధ్యాయంలో పరిశోధన క్రమాన్ని  సమాచార సేకరణ,  విశ్లేషణ, వాదస్ధాపన/నిరూపణ, సిద్ధాంతీకరణ, సిద్ధాంత రూపకల్పన, సమర్పణలను అరటిపండు ఒలిచిపెట్టినట్లు వివరించారు. సాహిత్యంలో కవిత్వాన్ని, కథల తత్త్వాన్ని పరిశోధించి నిరూపించే పద్ధతులు పరిశోధకులకు కొత్త ఆలోచనలనిస్తాయి. పరిశోధనలో విమర్శ, సిద్ధాంతాల బలం నూతన సిద్ధాంతాల స్థాపన లేదా సమన్వయానికి ఎంతగా దోహదపడుతుందో ఈ విభాగం వల్ల తెలుస్తుంది. సమీక్ష, విమర్శ, పరిశోధనలకు సంబంధించిన వ్యాసాన్ని, మరికొన్ని వ్యాసాల్లోని అంశాలు దీనిలో అనుబంధంగా  చేర్చగలుగుతున్నాను.

    నా పాఠంలో భాగంగా  సృజనాత్మక రచన-పరిశోధనాత్మక రచనలకు మధ్య గల వ్యత్యాసాల్ని చెప్పే కొన్ని ముఖ్యాంశాల్ని ఇక్కడ అందిస్తున్నాను. కేవల సృజనాత్మక రచన శైలిలోను, వస్తు-రూప స్వీకరణలోను పరిశోధన రచనకంటే భిన్నంగా ఉండాలి.     

1. రచనను ఆసక్తి రేకెత్తించేలా ప్రారంభించాలి. ఇది పరిశోధనకు కూడా వర్తించవచ్చు.
 2. సాధారణంగా ఒక సంఘటనదాన్ని అనుసరించిన అనుబంధ సంఘటనలు మాత్రమే ఇతివృత్తంలో భాగం అవుతుంటాయి.  కవిత్వమైతే ఒక సంవేదన ప్రధానమవ్వాలి. 
3. స్థలకాలాలుపాత్రల పేర్లు పట్ల జాగ్రత్తను వహించాలి. రచన ప్రారంభం నుండి చివరి వరకు వీటిని పేర్కొనేటప్పుడు పేర్లు మార్చేయడం, ఆ భౌతిక పరిస్థితులకు తగినట్లుగా వర్ణించకపోవడం వంటివన్నీ సృజనకారుని ప్రతిభను దీప్తిమంతం చేస్తుంటాయి. పరిశోధన పారిభాషిక పదాలు ఒకే అర్ధంలో సమన్వయించాలి. 
4. వస్తువు సొంతంగా కల్పించుకున్నదా? అనువాదమాఅనుకరణాఅనుసృజనాఅనేది ముందుగానే చెప్పుకోవడం మంచిది. 
5.వస్తువు నిత్యనూతనంగాఅందరికంటే భిన్నంగా సమకాలిక సమాజానికి ప్రతిబింబంగా ఉంటే బాగుంటుంది. 6.పాఠకుల నిర్ణయానికి సృజనకారునికి స్వేచ్ఛ  ఉంటుంది. 
7భాషను మన పాఠకులను బట్టి నిర్ణయించుకోవాలి. సహజత్వం ఉట్టిపడేలా ఉండాలి. 
8సందేశాన్ని ఇవ్వడం కోసం రాస్తున్నాదాన్ని పాత్ర గతంగా గానీరచన ఆస్వాదనానంతరం కల్గించే అనుభూతి ద్వారా వ్యక్తం కావాలి. కేవలం ఆనందం కోసమే అయినా కళాత్మకత ముఖ్యం.
9. వర్ణనలుసన్నివేశ కల్పనలు సందర్భోచితంగా గుర్తుండిపోయేలా ఉండాలి. ప్రారంభం, ముగింపు, నిర్ణయాలనేవి సృజనకారుని ఆలోచనా సరళిని బట్టి ఉండొచ్చు. 

సృజనాత్మక రచనకు, పరిశోధన రచనలో పాటించాల్సిన కొన్ని అంశాలను గమనించాలి. 

1. అన్వేషణఅనుమానంప్రతిపాదనసిద్ధాంత ఖండనలలో ఏదో ఒక దానితో ప్రారంభించాలి. 

2. ఒకే అంశంపైనే పరిశోధన దృష్టిని కేంద్రీకరించాలి.  

3. చివరి వరకు పారిభాషిక పదాలను ఒకే అవగాహనతో ప్రయోగించాలి. 

4. Review of literature వల్ల పూర్వ పరిశోధనలను పరిశీలించాను’ అనే స్పృహ కలిగించాలి. పూర్వ పరిశోధకులు అభిప్రాయాల్ని తీసుకుంటూనే అవి సమర్థిస్తున్నాఖండిస్తున్నాఆ అంశాలు స్పష్టంగా తెలపాలి. భావచౌర్యానికి ప్రయత్నించకూడదు. 

5. కొత్త సమన్వయం లేదా కొత్త ప్రతిపాదన ఉండాలి. 

5. పాఠకులు పండితులు అనేది మర్చిపోకూడదు. 

6. ప్రయోగించే భాషపారిభాషిక పదజాలం పండితుల ప్రశంసలను అందుకునేలా ఉండాలి. 

7. ప్రకటనలు (Statements), వివాదాస్పద వ్యాఖ్యల పట్ల సంయమనంతో వ్యవహరించాలి. నిరూపణాత్మకమైన ఖండన మంచిదే. కానీప్రమాణాలతోహేతుబద్ధంగా నిరూపించాలి. 

8. తాను ప్రతిపాదించిన అంశాన్ని పరిశోధకులు ఆలోచించేలా చేయగలగాలి. ప్రతిపాదిత లేదా సమన్వయాంశం శాశ్వత ముద్రను వేయగలగాలి. 

9. Hypothesis కీ, సిద్ధాంతానికీ, ఫలితాంశాలకీ మధ్య స్పష్టమైన విభజన రేఖలు కనిపించాలి. ఇటువంటివన్నీ పరిశోధన రచనలో ముఖ్యంగా గమనించగలిగే అంశాలు. అందుకనే నిఘంటువుల్లో Research  అంటే The systematic investigation into and study of materials and sources in order to establish facts and reach new conclusions.” అని వివరిస్తున్నారు.

    లక్ష్మీనారాయణగారు ‘కథన మీమాంస’ కు సంబంధించిన కొత్త అంశాలను వివరిస్తూ కవిత్వాన్ని, జానపదవిజ్ఞానాన్ని కూడా పరిశోధించే సాంకేతిక మార్గాల్ని ఈ గ్రంథంలో పరిచయం చేశారు. వస్తువు, రూపం, ప్రక్రియ, పరిశోధన పద్ధతి మొదలైన పారిభాషిక పదాలను ఎలా అవగాహన చేసుకోవాలో ఈ పుస్తకంలో వివరించారు. ఆధునికత-సమకాలికత: కొన్ని పార్శ్వాలు’ గ్రంథం లో ‘కథన మీమాంస’ పై వ్యాసాన్ని కూడా పరిశోధకులు చూస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో Socio-cultural approach తో పరిశోధనలు విస్తృతంగా వస్తున్నాయి. ఈ పరిశోధకులు సాహిత్య వాస్తవాలు, సామాజిక-సాంస్కృతిక వాస్తవాల పట్ల స్పష్టతను ఏర్పరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అంశాల్ని ఈ పుస్తకం చర్చించింది.

    పరిశోధనలో సమాచార సేకరణ చాలా ముఖ్యమైన మెట్టు. వీటి స్వభావాన్ని బట్టి Primary, Secondary, Tertiary Sources గా వర్గీకరిస్తుంటారు. అలాగే, పరిశోధనలో Review of  literature పై బాగా దృష్టి కేంద్రీకరిస్తే పరిశోధన సమస్య పట్ల మరింత స్పష్టత వస్తుంది. ఒకవేళ పరిశోధనలో కొన్ని పూడ్చాల్సిన గ్యాప్స్ కనిపించినప్పుడు, పరిశోధన చేసేటప్పుడు మన పూర్వీకులు చెప్పిన  ఆగమ, నిగమన పద్ధతులు (Inductive, Deductive Methods) ఎంతగానో ఉపకరిస్తాయి. ఆ రంగంలో పరిశోధన అయిపోయిందనేవాళ్ళు వీటిని అవగాహన చేసుకుంటే పరిశోధన ఒక నిరంతరాన్వేషణ అనేది బోధపడుతుంది.  ‘సామాన్య సూత్రాల నుండి, ఒక విశిష్ట సూత్రాన్ని నిష్పన్నం చేసేది, సూత్రీకరించేది, లేదా ప్రమాణీకరించేది’ సూత్రీకరణ విధానం (Deductive Method)గాను, ‘ప్రమాణీకరింపబడిన సూత్రాన్ని ఒక సందర్భానికి అన్వయించి, ఆరోపించి, ఆ ప్రమేయంతో దాని గుణ స్వభావాన్ని పరిశీలించి నిర్ధారించేది లేదా విపులీకరించేది’ సూత్రాన్వయ విధానం (Inductive Method) గాను ఆచార్య గంగిశెట్టిగారు నిర్వచించి, పరిశోధనలో వీటి ప్రాధాన్యాన్ని వివరించారు.

    శైలి విషయానికి వస్తే, మన తెలుగు భాషలో సంస్కృత, ఆంగ్ల భాషల ప్రభావం వల్ల ప్రవేశించిన ‘బడు’, ‘జరుగుతుంది’ వంటి ప్రయోగాల్ని పరిశోధనల్లో ఎంతవరకూ స్వీకరించవచ్చో కూడా ఈ పుస్తకంలో ప్రస్తావించారు. పరిశోధనలో ‘ఆత్మాశ్రయ’ శైలి నుండి తప్పించుకోవడానికి వీటిని అవసరమైనంత మేరకు ఉపయోగించుకోవడంలో ప్రమాదం లేదన్నారు. వీటిని మరింత విస్తరించుకోవాల్సిన అవసరం ఉంది.

    పరిశోధనలో తన ప్రాజెక్టు లేదా ఎం.ఫిల్., పిహెచ్.డి. గ్రంథాలను సమర్పించేందుకు సిద్ధంచేసేటప్పుడు ప్రూఫ్ రీడింగ్ చూసుకోవాల్సి ఉంటుంది. Chicago Manual of Style ఇంగ్లీషులో ప్రూఫ్ రీడింగ్ చేసే పద్ధతిని కూడా అందించింది. తెలుగులో ఈ దిశగా జర్నలిజమ్ లో కృషిచేస్తున్నా, పరిశోధక విద్యార్ధులకు అందుబాటులో ఉండేలా ప్రూఫ్ రీడింగ్ తో కూడిన శైలీపత్రం (Style Sheet) రావాల్సిన అవసరం ఉంది. తెలుగు పరిశోధన, విమర్శ రచనల్లో ఉండాల్సిన భాష గురించి కూడా సోదాహరణంగా రాయాల్సిన అవసరం ఉంది.

    పరిశోధన పద్ధతుల్ని వివరించే చాలా పుస్తకాల్లో రిఫరెన్సులు, ఉపయుక్త గ్రంథ సూచికలను సోదాహరణంగా వివరించే గ్రంథాలు చాలా వచ్చాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మానవీయ శాస్త్రాల్లో ముఖ్యంగా భాష, సాహిత్యం, జానపద విజ్ఞానం, ఫిలాసఫీ మొదలైన పరిశోధనలకు MLA Handbook for Writers of Research Papers అనే పుస్తకాన్ని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం 8th ఎడిషన్ అందుబాటులోకి వచ్చింది. ఆధునిక శాస్త్ర, సాంకేతిక సమాచార రంగాల్లో వచ్చిన విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా రిఫరెన్సు, ఉపయుక్త గ్రంథాలను పేర్కొనే పద్ధతుల్ని ఆ హేండ్ బుక్ లో సోదాహరణంగా వివరించారు.

    ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సాంప్రదాయిక పరిశోధన విధానాలతో పాటు, ప్రతి శాస్త్రంలోనూ ఆధునిక, సమకాలీన సమాజానికి అనుగుణంగా కొత్త కొత్త పరిశోధన పద్ధతులను రూపొందించుకుంటున్నారు. సాహిత్య పరిశోధన కూడా దీనికి అతీతమైనదేమీకాదనీ గుర్తిస్తున్నారు. ఈ గుణాత్మకమైన మార్పుల్ని ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణగారు గుర్తించి తన పుస్తకంలో వివరించారు. అందు వల్ల మా తరం పరిశోధకులకు ఈ పుస్తకం చక్కని మార్గదర్శనం చేస్తుందనుకుంటున్నాను.

    ఆంగ్లభాషతో ఎక్కువగా పరిచయం లేని తెలుగు పరిశోధక విద్యార్థులు కూడా అంతర్జాతీయమైన అవగాహన పెంచుకోవడానికి, వాటిని తమ పరిశోధనల్లో అన్వయించి సత్ఫలితాలను సాధించడానికి కనీసం ఈ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుక, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పుల్ని తెలుగు సాహిత్య పరిశోధకులు కూడా అర్ధం చేసుకుంటూ వాటిని ఆహ్వానించాల్సిన అవసరం ఉంది.

    రిఫరెన్సులుఉపయుక్త గ్రంథ సూచికలు ఏ పద్ధతిలో (MLA /Chicago/APA etc.) ఎలా ఇవ్వాలో అలా అందించడానికి అంతర్జాలంలో కొన్ని Citation Generators అందుబాటులో ఉన్నాయి. ఉదా: http://www.easybib.com దీనిలో మనకి కావలసిన ఫార్మేట్ ని బట్టి మన వివరాలు నిర్దేశించిన బాక్స్ లో పూర్తి చేస్తే దాన్ని ఆ జెనరేటర్ ఒక వరుసలో పెట్టిస్తుంది. వీటితో పాటు అంతర్జాలంలోhttps://owl.english.purdue.edu/,http://www.aresearchguide.com/12biblio.html  వంటి వెబ్ సైట్స్ ఉపయుక్త గ్రంథసూచిని ఎలా రాయాలో సులభంగా వివరిస్తున్నాయి. అలాగే, వీడియో, సినిమా, చిత్రం, డిజిటల్ ఆకరాలను, వెబ్ సైటు, బ్లాగు, ఈమెయిల్, వాట్స్ అప్, ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్, మొబైల్ మెసేజ్ వంటి వాటిని రిఫరెన్సులు, ఉపయుక్త గ్రంథసూచికలు ఎలా రాయాలో తెలిపే కొన్ని Citation Generators అంతర్జాలం (Internet)లో ఉన్నాయి. ఈ టెక్నికల్ వివరాలవైపు వెళ్ళకుండా ఈ ‘సాహిత్య పరిశోధనాకళ: విధానం’ అనే పుస్తకంలో సాహిత్య అంశాలపైనే దృష్టిని కేంద్రీకరించటం గమనించాలి.

    ఈ పుస్తకం ప్రధానంగా సాహిత్యరంగాల్లో అనుసరించాల్సిన పద్ధతుల్నీ, వాటిని సైద్ధాంతీకరించే క్రమాన్ని,  వాటికి సంబంధించిన  పారిభాషిక పదాలు, సిద్ధాంత వివరణలు అందిస్తున్నది. అందువల్ల ఇంతకు ముందువచ్చిన తెలుగు పరిశోధన విధానాన్ని తెలిపే గ్రంథాలకంటే ఇది ప్రత్యేకంగా నిలుస్తున్నది. ఈ పుస్తకం చదివిన తర్వాత కచ్చితంగా సాహిత్య పరిశోధనలోను, పరిశోధకుల్లోను మార్పులు వస్తాయని విశ్వసించవచ్చు. ఇది పరిశోధన బాగుపడాలనుకొనేవాళ్ళంతా చదవాల్సిన గ్రంథంగా భావిస్తున్నాను. ఈ పుస్తకానికి ‘‘సాహిత్య పరిశోధనాకళ: విధానం’’ అని పేరు పెట్టడం వెనుక సాహిత్యంలోని కళాత్మకతకు రచయిత ప్రాధాన్యం ఇవ్వడాన్ని స్పష్టంగా గుర్తించవచ్చు. పరిశోధకులు సృజనాత్మకంగా కొత్తపద్ధతుల్ని ఆలోచించే మార్గాల్ని ఆహ్వానించే వ్యూహం కూడా ఇందులో ఉందనుకుంటున్నాను. ఈ పుస్తకాన్ని చదివిన వివిధ విశ్వవిద్యాలయ ఆచార్యులు తెలుగు భాషా సాహిత్యాలకు సంబంధించిన సాధ్యమైన అన్ని అంశాల్నీ ఒకే బృహత్ గ్రంథంగా రాసుకోవాల్సిన అవసరాన్నీ సూచిస్తూ, దానికిది ప్రేరణనిస్తుందనుకుంటున్నాను.

    పరిశోధన బాగుపడాలని తపించేవాళ్ళ కోసం మరలా కొన్ని అంశాల్ని రాసివ్వడమే కాకుండా, మూల గ్రంథం నుండి తీసి ఈ పుస్తకంగా ప్రచురించినందుకు, పెద్దమనసుతో దీనికి నన్ను ఎడిటర్ గా ఉండమని నా గౌరవాన్నీ, బాధ్యతనూ పెంచిన వాత్సల్యశీలి, సహృదయులు ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణగార్కి, నన్ను వీరికి పరిచయం చేసిన నా శ్రేయోభిలాషి మా తెలుగుశాఖ అధ్యక్షులు ఆచార్య తుమ్మల రామకృష్ణగార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
తెలుగు శాఖ
హైదరాబాద్ విశ్వవిద్యాలయం

 తెలంగాణ జానపద కళారూపాలు

సంస్కృతీ సంప్రదాయాలకు నిలయమైన మన తెలంగాణాలో జానపద కళారూపాలు వందకు పైగా ఉన్నాయి. ఇవి తెలంగాణ సంస్కృతికి అద్దం పడుతున్నాయి. ఒక కులం సంస్కృతీ సంప్రదాయా లను, ఆ కుల పుట్టు పూర్వోత్తరాలను ఈ కళారూపాలు వివరిస్తాయి. ఈ కళారూపాలు ప్రదర్శించే వారిని ఉపకులాలకు చెందిన వారిగా, హక్కుదార్లుగా పిలుస్తూ, వారి కళారూపాలను ఆశ్రిత కళా రూపాలుగా పిలుస్తున్నారు. 

ఈ కళా రూపాల ప్రదర్శన విధానాన్ని బట్టి తొమ్మిది రకాలుగా వర్గీకరించవచ్చు. అందులో బొమ్మలాటలు, అనుష్టాన కళారూపాలు, వాద్య కళారూపాలు, పటం కథలు, ఇంద్రజాల ప్రదర్శనలు, నృత్యాలు, కథాగాన కళారూపాలు వేషాలతో కూడిన కళారూపాలు, భజన సంప్రదాయ కళారూపాలు తదితరాలు ఉంటాయి.

బొమ్మలాటలు

బొమ్మల ద్వారా ప్రదర్శన ఇచ్చే కళారూపాలు. ఇవి వివిధ రకాల వస్తువులతో బొమ్మలు తయారు చేసి వాటితో ఆడించే బొమ్మలు, తోలుబొమ్మలు, చెక్క బొమ్మలు, మందిచ్చుల బొమ్మలు, పెద్దమ్మలోల్ల బొమ్మలు ప్రధానంగా కన్పిస్తాయి. ఇవే ప్రాచీన కళారూపాలుగా, ఛాయా చిత్రాలకు మాతృకలుగా నిలిచాయి.

తోలుబొమ్మలు

జంతు చర్మాలతో బొమ్మలను అందంగా తయారు చేసి వాటికి రంగులు అద్ది తెరమీద ఆడిస్తూ, తయారు చేసి వాటికి రంగులు అద్ది తెరమీద ఆడిస్తూ, రామాయణ, భారత, భాగవత కథలతో పాటు ఇతర కథలు కూడ ప్రదర్శిస్తారు. వరంగల్‍ జిల్లా తొర్రురు ప్రాం తాల్లోను, నల్లగొండ జిల్లా కోదాడ ప్రాంతాల్లో ఈ కళాకారులున్నారు. కనుమరుగై పోతున్న కళారూపాల్లో ఇది ఒకటి.

చెక్క బొమ్మలాట

తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి పొందిన కళారూపం చెక్క బొమ్మ లాట కళారూపం. వరంగల్‍ జిల్లా తొర్రురు మండలం అమ్మా పురం, వెంకటాపూర్‍ మండలం బూర్గుపేటలోను మాత్రమే ఈ ప్రదర్శన ఇచ్చే కళాకారులు ఉన్నారు. చెక్కతో తల, ఛాతి వరకు అందంగా తయారుచేసి మిగితా భాగాలను రంగు రంగుల గుడ్డలతో అలంకరి స్తారు. ఈ బొమ్మల చేతులకు దారాలు కట్టి తెరవెనుక ఉండి ఆడిస్తారు. వీరు ఎక్కువగా భారత, రామాయణాది కథలు ప్రదర్శిస్తారు.

మందెచ్చుల బొమ్మలు, ‘నకాశి’ వారు పొనిక కర్రతో, చింత గింజల అంబలితో వివిధ రకాలైన బొమ్మలు, పటం కథలకు సంబం ధించిన బొమ్మలు, కులపురాణాల వృత్తాంతాలను తెల్లటి గుడ్డమీద వేస్తారు. వీటితో పాటు వివిధ రకాల మాస్కులు, పెద్దమ్మ బొమ్మలు, లాంటివి తయారు చేస్తారు. వీరు తెలంగాణ ప్రాంతంలోని చేర్యాలలో ఉండటం మనకు గర్వకారణం. ఈ వృత్తి ద్వారా జాతీయ, అంతర్జా తీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఏకైక కుటుంబం ధనాలకోట నాగేశ్వరరావుది.

యాదవులకు ఆశ్రితులైన మందెచ్చుల వాళ్ళు బుడిగె జంగం కులస్థులు. వీరు యాదవులకు సంబంధించిన కాటమరాజు కథ, ఎల్లమ్మకథ, పెద్దిరాజు కథలను ప్రదర్శించేటప్పుడు రంగస్థలం పైన వాటి సంబంధించిన బొమ్మలను చూపుతూ కథ చెపుతారు. వీరు వరంగల్‍ జిల్లా వెంకటాపూర్‍, నారాయణపురంలో ఈ కళాకారులు ఉన్నారు. పెద్దమ్మలోల్లు, పెద్దమ్మ దేవతను నెత్తిమీద పెట్టుకొని ఊరూరు తిరుగుతూ, చర్నకోలాతో కొట్టుకుంటూ, శరీరాన్ని కోసుకుంటూ భయానకంగా కనబడుతారు. వీరు తెలంగాణ అంతట జాతరల్లో ఎక్కువగా ఉంటారు.

అనుష్టాన కళారూపాలు

అనుష్టాన కళారూపాలను పండుగల్లో, దేవతల ఉత్సవాల్లో మా త్రమే ప్రదర్శిస్తారు. వీటిలో బతుకమ్మ, బోనాలు, దుబ్బుల కొలుపులు, పంబా, ఎల్లమ్మవేషం, వీరముష్ఠి వంటి కళారూపాలు మనకు కనబడుతాయి. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ, బోనాలను రాష్ట్ర పండుగలుగా గుర్తించి సముచిత స్థానాన్ని కల్పించింది. దుబ్బుల వాళ్ళు దుబ్బు వాద్యంతో పెద్దేవరను కొలిచే పూజారులు.

పంబా కళారూపం

గ్రామదేవతల ఉత్సవాల్లో, బొడ్రాయి ప్రతిష్టాపనలో వీరి ప్రదర్శన తప్పక ఉంటుంది. ఎల్లమ్మవేషంలో ఊరు చుట్టూ పొలి చల్లుతూ గ్రామం బాగుండాలని కోరుకుంటారు. ఈ అనుష్టాన కళా రూపాలు తెలంగాణ ప్రజలతో విడదీయరాని సంబంధం ఉన్నప్పటికి ఆధునీ కరణ పేరుతో ఈ కళారూపాలు కూడ రంగస్థల ప్రవేశం చేస్తున్నాయి.

వాద్య కళారూపాలు

వాద్య కళారూపాల్లో ప్రధానంగా చెప్పుకునేవి డప్పు, దీనిని శుభాశుభాలకు వాడినప్పటికి ప్రత్యేకమైన దరువులను వాయిస్తూ రర రకాలుగా నృత్యాలు చేస్తారు. ఇక తెలంగాణకే తలమానికమైన ఒగ్గుడొల్లు, ఒగ్గు కథలతో పాటు వివిధ రకాల దరువులతో నృత్యాలు చేస్తారు.

బుడబుక్కలవాళ్ళు బుడగ అనే వాద్యంతో భవిష్యత్తు చెపుతూ ఇంటిముందు శ్రావ్యంగా వాయిస్తారు. ప్రజలకు వీరిమీద అపార నమ్మకం ఉంటుంది. విశ్వ బ్రాహ్మణులకు కులపురాణాన్ని చెప్పెవారు రుంజ కళాకారులు. ‘రుంజ’ అనే వాద్యంతో ముప్ఫై రెండు రకాల ద్వనులు చేస్తూ విశ్వకర్మ పురాణం, మూలస్తంభం వంటి కథలు చెపుతారు. తెలంగాణవ్యాప్తంగా ఒక్క మహబూబ్‍ నగర్‍ ప్రాంతాల్లో ఒకటి రెండు బృందాల వారు మాత్రమే ఉన్నారు.

పటం కళారూపాలు

తెలంగాణలోనే ప్రత్యేకంగా ప్రదర్శించే కళారూపాలు పటం కథలు. ఇవి పన్నెండు వరకు కలవు. వీటిలో ఒక్కొక్క కులం కుల పురాణాలను ప్రదర్శిస్తారు. వాటిలో పద్మశాలీ కులం వారికి ‘కూనపులి కళాకారులు’, మార్కెండేయ పురాణం, మాదిగ కులం వారికి ‘డక్కలీ వారు’ జాంబ పురాణం, మాల కులంవారికి ‘గుర్రపు వారు’ భేతాళ పురాణం, చాకలి వారికి ‘మా సయ్యలు’ మడెలు పురాణం, గౌడ కు లం వారికి ‘ఏనోటి వారు’, గౌడ జెట్టిలు’ గౌడ పురాణం, కుమ్మరి వారికి ‘పెక్కర్లు’ గుండ బ్రహ్మపురాణం, యాదవులకు ‘తెరచీరల వారు’ మల్లన్న కథను, ముదిరాజు కులస్థులకు ‘కాకి పడిగెలవారు’ పాండవుల కథలను చెపుతారు.

గిరిజన తెగైన నాయక పోడువారికి ‘తోటివారు’ పద్మనాయక వృత్తాంతమనే కథను ప్రదర్శిస్తారు. పై కులాల వారికి ఆశ్రితులుగా ఉంటూ కులపురాణాన్ని నకాశి ద్వారా బొమ్మలు వేయించి ఆ బొమ్మల ఆధారంగా ప్రేక్షకులకు కథను చెపుతారు. ఈ కళారూపాలు వరంగల్‍, కరీంనగర్‍ జిల్లాలోనే ఎక్కువగా ఉన్నాయి.

నృత్యాలు

నృత్య కళారూపాలు ఎక్కువగా గిరిజన తెగలకు సంబంధించినవే ఉన్నాయి. ఇవి వారి ఐక్యత భావంను వెల్లడిస్తాయి. వీటిలో బంజారాలు -సుగాలి నృత్యం, గోండు గుస్సాడి నృత్యం, కోయ-కొమ్ము నృత్యాలు, ధింసా, రేలా, దండారి లాంటి నృత్యాలు కనబడుతాయి. వీటితో పాటు పండుగలకు సంబంధించిన నృత్యాలు ఆయా సందర్భాల్లో ప్రదర్శిస్తారు.

ఇంద్రజాల ప్రదర్శనలు

ఇంద్రజాల ప్రదర్శనలో ‘సాధన శూరులు’ పద్మశాలీ కులస్థులకు ఆశ్రితులుగా ఉంటారు. వీరు వివిధ రకాల విన్యాసాలు ప్రదర్శిస్తారు. చొప్ప బెండులతో పల్లకి చేసి అందులో కూర్చోవటం, నెత్తిమీద పొయ్యి పెట్టడం, చెవిలో నుండి నీళ్ళుపోసి ముక్కులో నుండి తీయడం, నీటి లో పసుపు కారం లాంటివి కలిపి మళ్ళి పొడి పసుపు, కారం తీయడం లాంటివి ఎన్నో అటు ఆనందాన్ని, భయాన్ని కల్గిస్తాయి. మరొక కళా రూపం ‘కాటిపాపల వాళ్ళు’ నోట్లో నుండి పాములను, తేళ్ళను, ఉంగరాలను తీస్తూ ప్రేక్షకులను ఆనందపరుస్తారు. ‘పాములవాళ్ళు, యక్షిణి వాళ్ళు కూడ రకరకాల ఇంద్రజాల ప్రదర్శనలు చేస్తారు.

కథాగాన కళారూపాలు

కథాగాన కళారూపాల్లో రామాయణ, భారత, భాగవత కథలను పురాణాలుగా చెప్పేవారిలో చిందుయక్షగానం, గొందేళివీధి భాగోతం, దాసరి భాగోతం, వీధి భాగోతాలు వీధి నాటకాలు ఈ కోవలోకి వ స్తాయి. ఆ కథలకు సంబంధించి పాత్రలు-వేషధారణతో కథలను రక్తి కట్టిస్తారు. వీటిలో హాస్యగాడి పాత్ర అందరిని ఆకర్షిస్తుంది.

వేషాలతో కూడిన కళారూపాలు

కళారూపంలో ఎక్కువగా వేషాలతో అలరించేవి. ఇందులో పగటి వేష కళాకారులు ముప్ఫైకి పైగా వేషాలు వేసి ప్రదర్శన ఇస్తారు. ఇందులో అర్థనారీశ్వర, అదేవిధంగా, పులివేషాలు లాంటివి ఉం టాయి. అదేవిధంగా, పులివేషాలు, కాళిక వేషం వంటివి ఇందులోకి వస్తాయి. పగటి వేషకళాకారులు రోజుకొక వేషం వేస్తూ ఊళ్ళో ప్ర దర్శన ఇస్తారు. ఇందులో తుపాకి రాముడి వేషం తెలంగాణాలో ప్రత్యేకం.

జానపద కళారూపాల్లో పై కోవలోకి కాకుండా ఇతర జీవులతో ప్రదర్శన ఇచ్చే కళారూపాలు కూడ ఉన్నాయి. వాటిలో గంగిరెద్దులాట, చిలుక జ్యోసం, గారడి వంటివి ప్రేక్షకులకు హాస్యాన్ని పండిస్తాయి. ఈ విధంగా తెలంగాణ జిల్లాలకే ప్రత్యేకంగా నిలిచిన ఈ జానపద కళారూపాలను పరిరక్షించుటకు తెలంగాణ ప్రభుత్వం సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వడం మరియు వారికి గుర్తింపు కార్డు ద్వారా పెన్షన్‍తో కళాకారులకు చేయుత నివ్వడం ఒక శుభ సంకేతంగా చెప్పవచ్చు.

ఈ కళా రూపాలను రక్షించి మన సంస్కృతిని మనమే కాపాడు కుందాం. తెలంగాణను సంస్కృతి రాష్ట్రంగా తీర్చిదిద్దుదాం. ఈ కృషిలో మనందరం భాగస్వాములం అవుదాం.


 డా।। శ్రీమంతుల దామోదర్‍
9989139136


దిక్సూచి – చెరబండరాజు  


  విప్లవ కవుల్లో విశిష్టమైన వ్యక్తిత్వంగల మహాకవి చెరబండరాజు 38 ఏళ్ల చిరుప్రాయంలోనే అస్తమించాడు. కాని విప్లవమార్గం చేపట్టి కొనసాగిన కొన్ని ఏళ్ల కాలం లోనే ఆయన రాసిన అనేక కవితలు, ముఖ్యంగా పాటలు తెలుగు ప్రగతిశీల ప్రజానీకాన్ని ఉర్రూతలూగించాయంటే అతిశయోక్తి కాదు. అలాంటి మహాకవి దిక్‌సూచిలోని కవితలు ఎంపిక చేసి కొన్ని ఇక్కడ ఇస్తున్నాము. మన బ్లాగు పాఠకులు వీటిని విశేషంగా ఆదరిస్తారని ఆశిస్తాం....

"ఏటికేతం బెట్టి
ఎయిపుట్లు పండించి

గంజిలో మెతుకెరగనన్నా – నేను
కూటిలో మెతుకెరగనన్నా"
అంటూ డెబ్భై ఏళ్ల కర్షక జీవితంలో
ఈ పాటే పాడుకుంటూ కన్ను మూసిన

నాన్నకి ప్రథమ ముద్రణ, అక్టోబరు 1970

1. వందే మాతరం
 నా ప్రియమైన మాతృదేశమా
తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా
దుండగులతో పక్కమీద కులుకుతున్న శీలం నీది
అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టుపెట్టిన అందం నీది
సంపన్నుల చేతుల్లో మైమరిచి నిద్రిస్తున్న యవ్వనం నీది
ఊసినా దుమ్మెత్తిపోసినా చలనంలేని మైకం నీది
కోతకొచ్చిన చేనులో కలుగులు తవ్వుతున్న
ఎలకల్నీ పందికొక్కుల్నీ భరిస్తూ నుంచున్న 'భారతి' వమ్మా
నోటికందని సస్యశ్యామల సీమవమ్మా
వందే మాతరం వందే మాతరం
ఒంటిమీది గుడ్డలతో జండాలు కుట్టించి
వివస్త్రవై ఊరేగుతున్న దైన్యం నీది
అప్పుతెచ్చి లేపిన మిద్దెల్లో
కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న దీనత్వం నీది
ఎండిన స్తనాలమీదికి ఎగబడ్డ బిడ్డల్ని
ఓదార్చలేని శోకం నీది
ఆకలికి ఎండి ఎండి ఎరువు సొమ్ములతో వీధినబడ్డ సింగారం నీది
అమ్మా భారతీ నీ గమ్యం ఏమిటి తల్లీ
వందే మాతరం వందే మాతరం
దిక్‌సూచి, చెరబండరాజు, ప్రథమ ముద్రణ, అక్టోబరు 1970, హైదరాబాదు నుండి...
2. నన్నెక్కనివ్వండి బోను
నల్లకోట్లు నీలిరంగు నోట్లతో
ఒక దేశం ఒక కోర్టులో
ఫైసలా అయ్యే కేసు కాదు నాది
నన్నెక్కనివ్వండి బోను
నలుగురి నమ్మికతో 'అమ్మా ' అని పిలవడం తప్ప
నవమోసాలు మోసిందెవరో
ఎవరికైనా ఏమి తెలుసంటున్నాను
సృష్టికర్తనే వెక్కిరిస్తోన్న పాపిష్టిని
మీలో మిమ్మల్ని ప్రశ్నించుకొమ్మంటున్నాను
అంటున్నాను అంటాను
అనుకుంటూనే వస్తున్నాను
మనిషిమీద నమ్మకం పోగొడుతున్న మీరు
దేవుడిమీద ప్రమాణం చేయమంటారెందుకు?
దోషికి నిర్దోషికి ఒకటే సూత్రం
వల్లించిందే వల్లించి వాదిస్తారు
ఫీజు కుడితి కుండలో
న్యాయాన్ని ఎలుకలా ముంచేస్తారు
మీ ఉద్యోగాలకు ప్రమాణాలేమిటి?
ఎక్కనివ్వండి నన్ను బోను
కలాలు కాగితాలు సర్దుకోండి
లా బుక్కుల్లో నా సందేహాలు వ్రాసుకోండి
న్యాయానికి దేశాలేమిటి? యెల్లలేమిటి?
మనిషీ, రక్తం ప్రాణం ముఖ్యం
లింగ భేదాలు వాదాలు తప్పితే
మందిర్, మస్జిద్, చర్చి,
మతాధికారుల మతాలు యెందుకు?
ఆకలి, కామం, కలలూ, కన్నీళ్లు
మనిషిలోని మర్మజ్ఞానమంతా ఒక్కటే
దేశమేదైతేనేం? మట్టంతా ఒక్కటే
అమ్మ యెవరైతేనేం? చనుబాల తీపంతా ఒక్కటే
బిక్కముఖాలతో చూస్తారేం?
పిచ్చివాణ్ణిగా కేసు పుటప్ చెయ్యండి
నన్నెక్కనివ్వండి బోను
తిన్నయింటి మర్యాదెంచని నాకు
బుద్ధుల్లో పెద్దల సహజాతాలేమై యుంటాయ్?
మంచి మనసు పరిమళాలు
విశ్వవ్యాప్తి కాకపోవు
భావితరం గుర్తించకపోదు
జగత్ప్రళయ కావ్యంలో
తపనాగ్ని జ్వాల నిలుస్తోంది
అణువణువున అగ్ని కణం
చల్లారక రగులుతోంది
నన్నెక్కనివ్వండి బోను
తీర్పు మీది జైలు మీది
భయపడతారెందుకు
మీ మనస్సౌధాల నిండా
తరగని తరతరాల బూజు
అనుక్షణం చచ్చే ప్రియత్వం
కాపురాల గోపురాలలో తిరిగే పావురాళ్ళారా!
నరుక్కోరెందుకు తలలు
గది నాల్గు గోడలు కూల్చివేసి
దిశలు నాల్గుగా మార్చుకోండి
ప్రపంచ పౌరులు కారెందుకు అప్పుడు?
నాకు తెలుసు
మీ రాత్రి చొక్కాలు పగళ్ళు నిలవవు
పగటి చొక్కాలు రాత్రుళ్లుండవు
మీ పెళ్ళాలు పిచ్చివాళ్ళు
పాతికచీరతో స్వర్గాన్ని కప్పుకొని
వంటగది ఆలోచనలకు
ఎసర్లు పెడుతున్న వాళ్ళు
మీ వాగ్దానాలు పుచ్చుగింజలు
మీ బిడ్డలు కృత్రిమ నాగరికత షో లో
మోడల్‌గా పనికొస్తున్న వాళ్లు
ఛీ, ఛీ యెవరు మీరు?
నవ్వుతా రెందుకు?
నీవు నేను కలిసి యెదుటివాని పిలుపుకు
'మీరు ' గాక ఏమౌతాం?
నీ గుండెలు, నా గుండెలు
మూతబడిన కొండగుహలు
ఎక్కనివ్వండి నన్ను బోను
ఈ సువిశాలప్రపంచ జీవశాలలో
సిసలైన న్యాయస్థానం ఎక్కడైనా వుంటే
నన్నెక్కనివ్వండి బోను
నా గుండెలు పిండుకునే
కొండల్లాంటి సందేహాలు...
విశ్వశాంతి మన ధ్యేయం
యుద్ధాలకు పరిమితమా?
అబద్ధమా యీ వేదన?
మాంసం ముద్దలుగా మనుషులు
శిశువులుగా జన్మించుట ఏ దేశంలో లేదు
ఏ దేశంలో నైతేనేమి?
అర్ధరాత్రి పడగ్గదుల
అంతరార్థమొకటే గద!
ప్రపంచ మొక నగ్నశిలా
ఫలకము వలె కనిపిస్తున్నది
భగవంతుడి అసలు పేరు నగ్నప్రియుడంటాను
అంటాను అంటున్నాను
అనుకుంటూనే వస్తున్నాను
అందుకే నన్నెక్కనివ్వండి బోను
* * * * *
3. చితి పేర్చుకుందాం
4. చూడలేను
5. ఇంకా నువ్వింకా బానిసవే
6. నీరో సంతతి
7. జవాబు
8. ఆకాశం వెక్కి వెక్కి ఏడుస్తోంది
9. ఊబి
10. కో
11. నా మనుష్య ప్రపంచంలోకి 
12. ఫో
13.  అన్నీ మరణాలే 
14. కాంతి పాదాలు
15. ఆత్మ దిక్
16. నా ఆకాశం
17. రా!
18. దిగంబర సమాజం కోసం
భుజాలు జార్చుకొని
మర్రి ఊడల్లా చేతులు వేలాడేసి
ఒంగి ఒంగి మట్టి కరుస్తూ నడుస్తోన్న
కుంటి వ్యవస్థను నిలబడిన చోటే
గొయ్యి తవ్వి పాతెయ్యమంటున్నా
చాకులా వెన్నెముక ఉంటే
కంఠ కంఠాలలో నిప్పు రగల్చమంటున్నా
నపుంసక మానసిక అంటువ్యాధి
ముందు తరాలకు అంటకుండా
తలవంచుక వెళ్ళిపోదామనే తార్పుల
అగ్ని కీలలలో తలకిందులుగా నిలెయ్యమంటున్నా
ఈ అవ్యవస్థ వ్యవస్థాపకుల్ని
ఇంకా ఇంకా బజార్ల కీడ్చి
చౌరస్తాలోకి వీలుగా చేరెయ్యమంటున్నా
పొద్దుపొడుపుతో మోసగించి మతాలు
గానుగెద్దులుగా మార్చిన రాజకీయాలు
పశుత్వం మిగిల్చిన జాతిద్వేషాలు
దుర్గంధం కక్కిన సిద్ధాంతాలు
నిన్నూ నన్నూ ఇన్నాళ్లూ కమ్ముకున్నాయ్
వ్యవస్థేదీ మిగల్లేదు
అందుకే
ఈ కుంటి జీవచ్ఛవాన్ని నిలబడిన చోటే
గొయ్యి తవ్వి పాతెయ్యమంటున్నా
* * * * *
19. నిమిషం నిమిషం ఒక నిమిషం
20. కుక్కల మేళం
21. యాభై కోట్ల మంటలు
యాభై కోట్ల మంటలు
యాభై కోట్ల కంఠాలు
తిరుగుబాటు మంటలుగా మారాలి
వాస్తవ జీవితాన్ని వేల మైళ్ల దూరంలో విసిరేసిన
విద్యాలయాలు వదిలి
జట్లు జట్లుగా మెట్లు మెట్లుగా
యువకులు నడిరోడ్డుకు పరుగెత్తుకు రావాలి
మూఢనమ్మకాల ఉక్కు కౌగిళ్లలో
నంగనాచి నాయకుల దొంగ వేషాల్లో
నలిగే కృంగే జనం కళ్లగంతలు చించుకొని బయటికి రావాలి
మహావ్యవస్థ రూపొందించని నాయకులు
జనాన్ని జేజమ్మలుగా వాజమ్మలుగా
పురుగులుగా వెధవలుగా
ఎట్లా దిగజార్చారో
ఒక్కసారి వెన్నుతట్టి కళ్ళారా చూపించాలి
యాభై కోట్ల కంఠాలు
తిరుగుబాటు మంటలుగా మారాలి
* * * * *
22. నేనే మీ ఊపిరి
23. మంటలెప్పుడోగాని అంటుకోవు
24. రక్త ఘోష
25. చిలుం
26. కన్నీళ్లేనా
27. జగద్గురువులొస్తున్నారు జాగ్రత్త
జగద్గురువులొస్తున్నారు జాగ్రత్త
పల్లకీలలో తప్ప ప్రయాణం చేయరు
ధనవంతుల మేడల్లోతప్ప పూరిగుడిశెల ఊసెత్తరు
కాళ్లుండీ కుంటివాళ్లు
మనుషుల బుజాల్ని తప్ప యింకేమీ ఎక్కరు
కాషాయాంబరాలు మానరు
ఆధ్యాత్మిక చింత పేర
నవీన పతివ్రతల్ని పావనం చెయ్యందే వదలరు
ఎవరయ్యా ఎవరీ రసరాట్టులు
బతుకంతా మోసంతో గతికి గతికి
జనాన్నీ జాతి నరనరాన్నీ మతమౌఢ్యానికి తీర్చితీర్చి
వయసులో నానాపాయసాలూ మరిగి మరిగి
కొవ్వెక్కిన పిట్టగూళ్ళ తలబుట్టల బాబాలే
చక్రవర్తుల్లా ఊరేగే జగద్గురు సాముల్లారే
 కుష్ఠు వ్యవస్థకు మూలవిరాట్టులు
చీకటి బజారు జలగల్ని
రాజకీయ బొద్దింకల్ని
పదవీ మదాంధుల్ని
సాహిత్య వందిమాగధుల్ని
అభయహస్తంతో కాపాడే కంకణం కత్తుకున్నారు
నిర్వీర్యాన్ని దేశం నలుమూలలా
కాలవలనిండా పారిస్తున్నారు
భయంకర కుష్ఠు సంస్కృతిని దేశమంతా పంచుతున్నారు
నమ్మకు  మతాల సుఖరోగుల్ని
వర్ణాశ్రమధర్మ ద్వేషాలు రేపే అడ్డగాడిదల్ని
బహిరంగంగా సభల్లో వ్యభిచరించే ఆబోతుల్ని
రంకూ బొంకూ పురాణాల బంకును
వేదికలెక్కి కుక్కల్లా కక్కే వెధవల్ని
మన్నించకు
మనిషిని ఏనాడో మరచిపోయి
మంచితనాన్ని అంటరానితనంగా ఎంచే తుచ్ఛులకు
చిలకజోస్యాల పిలకగుళ్ళు
వంటింటి కుందేళ్ళు
పట్టెనామాల పొట్టేళ్ళు
బిళ్ళగోచీ బల్లులు
జందెంపోగుల పందులు
బ్రహ్మరథం పడుతుంటే
కళ్ళుండీ కంటూనే
చెవులు పోటెక్కేట్టు వింటూనే
కదలకుండా మౌనంగా నిలబడకు.
దేవుళ్ల దేవులాటలో
మహామహా మాయల నాయాళ్ళ సన్నాసుల
జోగుల మోజుల్లో
పడిపోయిన దేశాన్ని
భవిష్యత్కాలాన్ని
కాపాడడానికి నడుంకట్టు
పాతిపెట్టు
మైలురాయివేకాదు
మంచికి పతాకాన్నెత్తే మనిషినని
మరోసారి రుజువు చెయ్యి
* * * * *
28. ప్రపంచం నిండా
29. చరిత్ర ద్రోహం
30. వ్రణం
31. "దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ "
ప్రజా జీవనాడి స్పందన పసిగట్టలేని
సమన్వయ మేధావుల అంచనాల వంచనలో
నిలువల్లా మునిగిన దేశం
ప్రణాళికల తాటిచెట్ల నీడల్లో
పడిగాపులుగాచే ప్రజల దేశం
స్వదేశీమార్కు విదేశీయ మార్కెట్టు
మనస్తత్వపు మంది దేశం
కట్టుకో గుడ్డలేని దేశం
దేశి సరుకు ధాన్యానికైనా నోచుకోని దేశం
రెండు దశాబ్దాలు దాటినా
కోట్లాది ప్రజల నోటికందని దేశం
నాదేశం నా ప్రాణం అంటూ
గర్వించే రేబవళ్లు శ్రమించే
శ్రమజీవుల భవిష్యత్తు యావత్తూ
అప్పుల్లో కుక్కబడ్డ దేశం
పిడికెడు సుఖరోగుల చెప్పుచేతల్లో
పడిపోయిన ప్రజాస్వామ్య దేశం
చమటోడ్చి పాటుపడే శ్రమజీవికి
కడుపునిండ తిండెక్కడ కండెక్కడ
పెంచిన మంచి కొన్ని సంచుల్లోకెళ్ళుతోంది
తలపెట్టిన మేలుకు తలలే తాకట్టు పడ్డాయ్
డబ్బు తెచ్చే కీర్తిసంపదల
దోపిడి కిరీటాల తురాయీలొద్దు
కలహాల కారణాలు వెతకని
చరిత్ర పరిణామం యెరుగని ఘనులకు
కత్తివైరాన్ని నిరసించే హక్కు లేదు
ఒరుల మేలుకు సంతసించమనే
కుహనా ఆదర్శవాద ఐకమత్యాని కర్థం లేదు
వొట్టి కడుపులతో మలమల మాడే
అస్థిపంజరాల ఐకమత్యపు సత్యం వేరు
పరులెవరో
కలిమివాళ్ల కెక్కడిదో యోచించక
దు:ఖం అసూయ చిహ్నమనే
సామాన్యులు పాపులనే
సాహసాలు చాలు చాలు
చిక్కని పాలవంటి దేశాన్ని
కొల్లగొట్టే మేలి బతుగ్గాళ్ల మేలును
నా మేలని యెంచే నిర్వీర్యపు నేర్పరితనం
నా ఛాయలకే వద్దు
లాభాల్లో వాటాలు పెంచుకునే
వ్యాపారసరళి దేశభక్తి అక్కర్లేదు
శ్రమఫలితం కాజేసే
పొరుగువాడికి తోడు పడే
వర్గసామరస్య మార్గం వద్దు
మహోన్నత మానవత్వపు సూర్యోదయాన్ని
ఆదిలోనే అడ్డుకొనే
మానవ చరిత్రనిండా మారణహోమాలు రేపిన
మానవ చరిత్రనిండా మారణహోమాలు రేపిన
మానవ చరిత్రనిండా మారణహోమాలు రేపిన
మనిషి మనిషిని క్రూరంగా విడదీసిన
హేతురహిత అశాస్త్రీయ
జాతిమతాల్నొప్పుకునే
విషపానీయ సేవ్యం వద్దు 
అక్కడ అన్నదమ్ముల ప్రసక్తి వద్దు
సంఘానికి దూరంగా అణగిమణగి
వర్తమానం గుర్తించక
రుతుచక్రం మలుపుల్లో గొంతెత్తే
కోయిల కవితలొద్దు రచనలొద్దు
ఆస్తిహక్కు రక్షణకై తపనపడే
నక్కల తోడేళ్ల కెదురుతిరిగి
ప్రాణాలను మానాలను అర్పించే
హెచ్చు తగ్గులసలులేని
దేశభక్తి నిర్వచనం
రక్తతర్పణాలతో
రచిస్తోంది నా తరం
* * * * *

32. రాజధాని లేఖ
33. స్వీయచరిత్ర
34. మరోసారి ఈ దేశం మోసపోగూడదు
మరోసారి ఈ దేశం మోసపోగూడదు
బిర్లాభవనంలో వైభవంగా ప్రార్థనలు జరుపుకునే
హరేరాం బికారులు మళ్లీ పుట్టగూడదు
గీతాధ్యయన నేతలు ఈ జాతికి ఇంకా అక్కర్లేదు
బుద్ధుని యిమిటేషన్ ప్రబుద్ధుని సంతతి
పలికే ప్రగల్భాలతోనే
ఇరవై రెండేళ్లూ నీరుగారిపోయాయ్
శాంతిసహనాలతో ఇన్నాళ్లూ మిన్నకున్నందుకు
చరిత్రలో నా తరం చాలాచాలా పోగొట్టుకుంది
సామాన్యుడు సంఘబహిష్కృతుడిగా
సంక్షేమరాజ్యంలో రోజూ చస్తూనే వున్నాడు
పెంకుటిండ్లు పూరిండ్లై
పూరిండ్లు నేలమట్టమవుతుంటే
ఉన్నవాడు దేశాన్ని పిండిపిండి మరింత ఉన్నతంగా
ఆకాశాన్నందుకుంటున్నాడు
గ్రామాలు కుళ్ళి కుళ్ళి అజ్ఞాన తమస్సులో
కుళ్ళుచూళ్ళేనంత దుర్భర దారిద్ర్యంతో
పగిలి పగిలి ఏడుస్తున్నాయ్
ఇవాళ
శిష్యుల గొప్పతనంగురించి వివరంగా చెబితే
హంతకునిలా నేరస్థునిలా
తలవంచుకుని నించున్నాడు అస్థిపంజరాల బోనులో
అన్నార్తుల కన్నుల్లో ఆశాకిరణం ఎడారిదారిలా చీలిపోయింది
విశ్వాసపు గుడారాలెగి రెగిరి గాలిలో
ఏనాడో శిథిలమయ్యాయి
సహనం చచ్చిన కంకాళాలు కలిసికట్టుగా
గండ్రగొడ్డళ్ళతో ఈటెలతో ఈ చీకటి వృక్షాన్ని
పెల్లగించక తప్పదింక
అరచి అరచి ఇరవైరెండేళ్ల చరిత్ర అలసిపోయింది
అతడు పీడితుల మనిషికాడని చెప్పకనే చెబుతోంది
వర్గచైతన్యం గుండెలో మెత్తమెత్తగా బాకులుదూసి
పోరాటశక్తిని నాశనం చేసిన
పచ్చి సామరస్యవాది ప్రపంచానికిచ్చిందేమిటి?
అధికారానికి అంగరక్షకుడిలా
లంచగొండి ప్రభుత్వానికి కవచంగా
మనమధ్య మనుగడ సాగించడమేమిటి?
ఖద్దరు బట్ట తప్ప దేశానికి మిగిల్చిందేమిటి?
అమాయక ప్రజల భుజాలనెక్కి
భగవద్గీత పారాయణ అభయహస్తంతో
మతమౌఢ్యపు పిచ్చికుక్కలకి
ఎద్దుముఖం పెద్దపులులకి
దేశాన్ని బలియిచ్చినవాడికి
ఈ నేలమీద ఇంకా నామరూపాలుండడమేమిటి?
ప్రజాస్వామ్యపు బ్రోతల్ హౌసులో
ఈ రాజకీయాల రంకు కథలు
అతని బిక్షగాక మరేమిటి?
అతని పేరెత్తిన [లేక 'పేరెత్తని ' యా?] నాయకుడు ఏడి?
అతని విగ్రహం లేని వీధులు ఏవి?
ఈ అస్తవ్యస్తపు మస్తిష్కపు మహాత్ముడికి
ఆరాధనేమిటి ఆర్భాటాలేమిటి?
తారలేమిటి రాగాల భోగాలేమిటి?
పర్వతాలేమిటి? పూజామందిరాలేమిటి?
ఇదంతా మన అజ్ఞానానికి చిహ్నం కాదా!
అతని విగ్రహం లేని వీధులు ఏవి?
ఈ అస్తవ్యస్తపు మస్తిష్కపు మహాత్ముడికి
ఆరాధనేమిటి ఆర్భాటాలేమిటి?
తారలేమిటి రాగాల భోగాలేమిటి?
పర్వతాలేమిటి? పూజామందిరాలేమిటి?
ఇదంతా మన అజ్ఞానానికి చిహ్నం కాదా!
అతని విగ్రహం లేని వీధులు ఏవి?
ఈ అస్తవ్యస్తపు మస్తిష్కపు మహాత్ముడికి
ఆరాధనేమిటి ఆర్భాటాలేమిటి?
తారలేమిటి రాగాల భోగాలేమిటి?
పర్వతాలేమిటి? పూజామందిరాలేమిటి?
ఇదంతా మన అజ్ఞానానికి చిహ్నం కాదా!
సబర్మతీ ఆశ్రమవాసి
సన్యాసీ కాదు సంసారీ కాదు
విజ్ఞానదాత కాదు విద్యావేత్త కాదు
రాజకీయవేత్త కాదు రాజూ కాదు
వేదాంతి కాదు వెర్రివాడూ కాదు
ప్రజల్ని పట్టించుకున్నదీ లేదు పట్టించుకోనిదీ లేదు
అన్నీ తానేగా
తానే అన్నీగా పెరిగి
భ్రమల సాలెగూళ్ళలోకి నినాదాల గాలిలోకీ
పుక్కిటిపురాణాల ఆదిమసంస్కృతిలోకి మనుషుల్ని తోసి
నిజావగాహనలేని ప్రజాద్రోహిగా మోసం చేసి
దూదిపింజల్లాంటి సిద్ధాంతాలు వల్లించి
నా తరానికి సున్నాలు చుట్టి వెళ్ళిపోయాడు
మరోసారి ఈ దేశం మోసపోగూడదు
* * * * *
35. పీడితలోకం పిడికిలి బిగించి పిలుస్తోంది
36. యువతరానికి
37. దిక్‌సూచి
ప్రజారక్త వ్యాపారులు లిప్తపాటులో
మండి మసి అయిపోయే తరుణం ఇదే
పదవుల పోరాటపు
కుటిలనీతి మంతనాల మంత్రుల్నీ అంతరాత్మల్నీ
సజీవంగా స్మశానానికి పంపే సమయమూ ఇదే
డబ్బు రాజ్యాన్ని కూలద్రోసి
కోట్లాది ప్రజల కూడుగుడ్డకోసం
అడుగడుగునా అధికారపు నడ్డి విరగదన్నాల్సిందే
ఒకటికి పది సున్నాలు చేరుస్తూ
ఉన్నవాడు ఉన్నతుడై
సంఘానికి న్యాయాలయమై
సామాన్యుల శాసించే
ధర్మానికి తలవొగ్గక
ఆ వర్గపు కంచుకోట కొల్లగొట్టి
ప్రజాధనం అందరి కందుబాటులో ఉంచాల్సిందే
ఏ దేశపు సంపదైనా
పుట్టిన పుట్టబోయే బిడ్డల జన్మహక్కుగా
సమ సమానంగా వితరణ చెందాల్సిందే
ఒక్కొక్కడూ ఒక్కో మృగరాజై
నక్కల తోడేళ్ళ డొక్కలు చీల్చి రక్తంలో
త్రివర్ణపతాకం ఆసాంతం ముంచి రంగు మార్చాల్సిందే
* * *
[దిక్‌సూచి, చెరబండరాజు, ప్రథమ ముద్రణ, అక్టోబరు 1970,
  హైదరాబాదు నుండి]

చెరబండరాజు కవితలు పాటలు