"తెలుగు శాఖ, స్నాతకోత్తర కేంద్రం గద్వాల, పాలమూరు విశ్వవిద్యాలయంలో నేను బోధించే సిలబస్, సిలబస్ లోని పాఠ్యాంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారం ప్రతిబింబించే వేదిక."
 నన్నయ కవితారీతులు

1. ఉపోద్ఘాతము:

ఆది కవి నన్నయ. రాజమహేంద్రపుర నివాసి. పద్య విద్యకు ఆద్యుడు వంటివాడు. ఎంతో ప్రసాద గుణ మాధుర్యంతో, చెవికి ఇంపైన పదాలతో ప్రశాంత గంభీరంగా సాగిపోయే ధారతో - తెలుగు పద్య సౌందర్యం వెలార్చింది ఆయన చేతిలోనే. అంత ప్రసన్నంగా, అంత సుభగంగా, అంత మార్ధవంతో నన్నయ  తర్వాత పద్యం రాయలేదంటే అతిశయోక్తి లేదు. "విశ్వశ్రేయహ కావ్యం.."- కావ్యం విశ్వ శ్రేయము. రసాత్మకమైనదే వాక్యము. కవులు ఏవిధంగానైనా రసాన్ని సాధించవలసివుంది. నన్నయ ప్రారంభించిన మహాకావ్యం - పంచమవేదం. మహాభారతం - మనహ ప్రీతం.

2. నన్నయ రచనా వైశిష్ట్యం:

2.1 నన్నయ శైలి:

కథాగమన క్లిష్టత గాని, వక్రత గాని, అతి సంకుచిత తత్వము, అతి విస్తృతి గాని లేకుండా ప్రసన్నముగా, నిర్విఘ్నముగా నడుపగలిగాడు. ఈ ప్రజ్ఞ నన్నయకే సొంతం. ఒక్క శైలిలోనే కాదు. కథ నడుపుట లో కూడా నన్నయ శైలి భిన్నం. ఆది పర్వము నందలి శకుంతలోపాఖ్యానము, అరణ్య పర్వము నందలి లోపాఖ్యానమును పోల్చిన ఆ తారతమ్యము మనకర్ధమవగలదు.

2.2 నన్నయ భాష -  ఆత్మీయత:

"ధర్మ తత్వజ్ఞులు ధర్మ శాస్త్రంబని …." మొదలుపెట్టిన నన్నయ తన మహాభారతాన్ని ఎలా రాయాలనుకున్నాడో మనకి అక్కడే వివరించాడు. శబ్ద సంగ్రహమునే  కాక,  వాక్య రచనలో  కూడా నన్నయ చాలావరకు సంస్కృత సాంప్రదాయమునే అనుసరిం చెను. 

3. పద్య విశేషాలు:

ఆది, సభా, అరణ్య పర్వాల లో 3906 గద్య, పద్యాలు దాదాపు అన్నీ వృత్తాలు ఒకే ప్రసన్నతను వెలువరిస్తాయి. తిక్కన మాటల్లో నన్నయ" విద్యా దయితుండు…". నన్నయ పద్యాల్లోని ఆ ప్రసాద మాధుర్యాలకు కారణం ఎక్కువగా సంస్కృత పదాలు వాడటం అంటే కొంతవరకు నిజం. సంస్కృత పదాలు దట్టించి తెలుగు పద్యాలు వ్రాసిన వారు చాలామంది ఉన్నారు.  కానీ నన్నయ ఏరుకున్న సంస్కృత పదాలు చాలా మృదువైనవి. ఒక్క పూలమాలలోని పూలన్నీ దారాన్ని లాగితే ఎలా విడి పోతాయో అలా ఉంటాయి నన్నయ పద్యాలు. ఉదా: జలధి, విలోల,వీచి, విలసిత, కల, కంచి, సమంచిత,అవనీ……

4. నన్నయ మాటల్లో అతని గురించి విశేషణాలు:

1. చాళుక్య రాజ్య వంశమునకు కుల బ్రాహ్మణుడు.
2. అవిరళ జప,హోమ తత్పరుడు.
3. నానా పురాణ విజ్ఞాన నిరతుడు.
4. ధర్మే తరము లైన వాక్యములు ముట్టని వాడు.కాలము:  క్రీ. శ.1060 ప్రాంతం.కావ్య రచనలో సహాయమందించింది - నారాయణభట్టు - వీరిద్దరిదీ కృష్ణార్జున మైత్రి.

ఇతర కృతులుగా చెప్పబడేవి 1. చాముండికా విలాసం 2. ఇంద్ర విజయము.

సమకాలికులుగా చెప్పబడే వారు - 1. అధర్వణుడు 2. భీమకవి.

నన్నయ కవితీరీతులు:

నన్నయ్య ఆంధ్ర మహాభారతం ప్రారంభంలో అవతారికని రచించాడు.  దాని నుంచి కృతి భర్త, కృతి కర్త ఇత్యాది విషయాలే కాకుండా తన భారత రచన ఏ యే విశేషాలతో సాగిందో  ఈ క్రింది పద్యం ద్వారా వివరించాడు. (కుమా రాస్త్ర విద్యా ప్రదర్శన - షష్టా శ్వాసము - ఆదిపర్వము)

ఉ.  సారమతిం గవీంద్రులు ప్రసన్న కథాకలితార్థయుక్తి లో     
నారసిమేలునా, నితరు లక్షరరమ్యత నాదరింప నా   
 నా రుచిరార్ధ సూక్తి నిధి నన్నయభట్టు తెనుంగునన్  మహా     
భారత్ సంహితా రచన బంధురుడయ్యె జగద్ధితంబుగన్. (ఆది. 1-26)

పై పద్యంలో నన్నయ మూడు కవిత గుణాలను వ్యక్తీకరించాడు.

1.  ప్రసన్న కథా కలితార్థ యుక్తి, 2.  అక్షర రమ్యత 3.  నానా రుచిరార్ధ సూక్తి నిధిత్వం

1. ప్రసన్న కథా కలితార్థ యుక్తి (ప్రసన్నత+అర్థ యుక్తి):

ప్రసన్నమైన కథలతో కూడిన అర్థ యుక్తి ప్రసన్న కథాకలితార్థయుక్తి. ప్రసన్నత అంటే నిర్మలత్వం. కథలో సువ్యక్త స్థితి కల్పించటం. కుమార్రాస్త్ర విద్యా ప్రదర్శన ఘట్టం ఆంధ్ర మహాభారతంలో మూలానుసారంగానే జరిగింది.  ప్రదర్శన ప్రారంభంలో.."సుతుల విద్య ప్రవీణత జూచు వేడ్క నెంతయును సంతసంబున గుంతిదేవిరాజా సన్నిధి గాంధార రాజుపుత్రికెలననుండె ను న్మీలిత నలిన నేత్ర" ప్రదర్శన సందర్భంలో కుంతీదేవి రాజకాంత ప్రేక్షక సమూహంలో గాంధారి పక్కన కూర్చుంది.  ఆమెకి 'నలిని నేత్ర ' అనే ఒక విశేషణం వేసాడు నన్నయ.  ఇది చాలా ప్రత్యేకంగా గమనించదగినది. నలిననేత్ర అంటే పద్మనయ అని అర్థం. నలిన నేత్రకి, నలినాప్తుడికి గల బంధుత్వం కుమార్రాస్త్ర విద్యా ప్రదర్శన ఘట్టం సమాప్తమైనా అనిశ్చితంగా ఉండిపోయింది.

శా.  సాలప్రాంశు నిజోజ్వలత్కవచు, శస్వత్కుండ లోద్భాసితు
న్బాలార్క ప్రతిమున్, శరాసనధరున్, బద్ధో గ్రనిస్త్రింశ్ర శౌ
ర్యా లంకారు, సువర్ణ వర్ణఘను, గర్ణాఖ్యున్, జగత్కర్ణ పూ
ర్ణా లో లద్గణు జూచి చూపరు ప్రభూతాశ్చర్యులైరచ్చటన్. 

అస్త్ర విద్యా ప్రదర్శనశాల ప్రధాన ద్వారం దగ్గర జబ్బ చరిచి నిలుచున్నప్పటి కర్ణుని మూర్తి వర్ణనం ఇది. ఈ పద్యంలో- - సాలప్రాంశు, బాలార్క, ప్రతిమ, సువర్ణ వర్ణు, జగత్కర్ణ పూర్ణాలో లద్గుణు అనే నాలుగు విశేషణాలు నన్నయ స్వతంత్రంగా ఉపయోగించినవే. కర్ణుడు కనిపించేసరికి ప్రేక్షకులంతా ఆశ్చర్యచకితులై పోయారు. ఎత్తయిన రూపం, మెరిసిపోతున్న కవచకుండలాలు, బంగారు మేనిచాయ, ధనస్సు ఖడ్గాలు పూని ఉండడం. తమ లాగా ప్రేక్షకుడులా కాక కురు వీరుడు అర్జునుడికి ప్రతి స్ఫర్థిగా జబ్బ చరచటం ఇవన్నీ ఆశ్చర్యాన్ని కలిగించేవే.

నన్నయ ఉపయోగించిన విశేషణాలతో- బాలార్క ప్రతిమ- అనేది కర్ణుడు జన్మవృత్తాంతం స్ఫురింప చేస్తుంది. సాల ప్రాంశువు అనే విశేషణం ముందు చెప్పి తర్వాత కవచ, కుండలాల ప్రసక్తి తేవడంతో కర్ణుడు కవచకుండలాలు కోల్పోయి వట్టి శరీరంతో సాలప్రాంశువు గా మిగులుతాడనే ఒక అర్థం స్ఫురిస్తుంది. 'శౌర్యలంకారు ' అనే విశేషణం తో కూడా గొప్పతనం కనిపించదు. శౌర్యమే అలంకారంగా కలిగినవాడని అర్థం. అలంకారం పైపై మెరుగులకు చెందినది. ఇతడి శౌర్యం కూడా అలాంటిదే అనే అంశం ద్యోతకమవుతుంది. అర్జునున్ని పరిచయం చేసే సందర్భంలో అన్ని విశేషణాలు చెప్పి 'పాండవ మద్యముండొప్పె' అనే మాట కూడా చెప్పి బద్ధ తూణీరుడు అనే మాట ఉపయోగించాడు. భవిష్యత్తులో అర్జునుడు అక్షయ తూణీరాలతో నిలుస్తాడనే సూచన గోచరిస్తుంది. ఈ విధంగా కథాంశం చెదిరిపోకుండా, అందచందాలతో చెక్కుచెదరకుండా కథ నడపడంలో ప్రసన్నత, అర్థయుక్తి అనే రెండు అంశాలను సమర్థవంతంగా నిర్వహించాడు.

2. అక్షర రమ్యత:

నన్నయ్య అక్షర రమ్యత పై పరిశోధన చేసిన పండితులు డా. వి. వి. ఎల్. నరసింహారావు. ఆయా సన్నివేశాలందు రసోచితములైన ఆయా శబ్దములు, ఆయా అక్షరములు వానంతట అవే కుదురుకొని ఆ మహా కవి జీవ లక్షణములైన యొకానొక రచనా మార్గమును స్పష్టము చేయును. నన్నయ  గారి రచనలో ఈ అక్షర సంయోజనీయము హృదయాహ్లాదజనకముగా శ్రవణేంద్రియం తర్పణముగా సాగినది. ఈ లక్షణము తన కవితలో నిండారియున్నదని గుర్తించిన జ్ఞాని నన్నయ. నా కవిత యందు అక్షర రమ్యత పరమాదరనీయమని ఆయన విశ్వసించెను. అక్షర రమ్యత శబ్ద ప్రధానమైనది.  శైలి రామణీయకత సంబంధమైనది.  దీనినే అక్షర చంధో రమ్యతగా, కవిత గుణాల వల్ల ఏర్పడే రమ్యతగా, సంగీతము, పూర్వమీమాంశ తత్వ అక్షర సౌందర్యంగా పరిశోధకులు వివేచన చేసారు.

1. నిర్వచనము- అక్షరములు ధ్వనులకు సంకేతికములు. వివిధ ధ్వనులు గల అక్షరములచే శబ్దములు ఏర్పడుచున్నవి. ధ్వని మాట్లాడిన పిమ్మట నశించిపోవును. అక్షరమట్లు గాదు ఎన్నడూ నశించని పరమేశ్వరుడక్షర పద వాచ్యుడు.  అక్షరమగు కవిత లోకోత్తరమైనది.
2. అక్షర ప్రయోగ రమ్యత
3. నాదము, రాగ రసములు - సంగీతము
4. అక్షర చంధో రమ్యత చంధస్సు
5. కావ్య గుణములు - అక్షర రమ్యత - గుణాదులు
6. పూర్వ మీమాంస తత్వము
7. మంత్రశాస్త్ర ప్రసస్తి
8. రసౌచితాక్షర బంధము - నౌ చిత్తము
కం. నీవ కడు నేర్పు కాడవు
గావలవదు, వీని గొన్ని గరచితి మేము
న్నీ విద్యలెల్ల జూపుదు
మే వీరుల సూచి మేలు మేలని పొగడన్.

నాటకీయమైన సంభాషణ ఇది. కర్ణుడి స్వభావాన్ని నిరూపించేది. కర్ణుడి స్వాతిశయం, అర్జునుడిపై స్పర్ధని వ్యక్తం చేస్తుంది.

చం. కురు కులజుండు పాండునకు గుంతికి  బుత్రుండు ;రాజధర్మ బం
ధుర చరితుండు; నీ వితని తోడ రణంబొనరించెదేని వి
స్తరముగ నీదు వంశమును దల్లిని దండ్రిని జెప్పు; చెప్పిన
న్దొరయగుదేని నీకెదిరి దోర్బల శక్తి నితండు సూపెడిన్

ఆచార్య. సుబ్రహ్మణ్యం గారు ఈ పద్యాన్ని శబ్ధ శక్తి మూల ధ్వనికి అమూల్యమైన ఉదాహరణగా భావించారు. ఈ పద్యంలో కుల, రాజు, దొర శబ్ధాలు సాభిప్రాయ  విశేషాలు. దొర శబ్ధం క్షత్రియుడు, రాజు అనే అర్థంలో ఉపయోగించబడింది. దీనిలో ధ్వని అంతా శబ్ధం  మీదే ఆధారపడింది. 

ప్రభువు అనే అర్థం వాచ్యంలో, సమానుడు అనే అర్థం వ్యంగం లోనూ స్ఫురిస్తుంది. భావి కథకు మూలమౌతుంది. కాబట్టి ఇది శబ్ద శక్తి మూల ధ్వని. చమత్కారమేమంటే పఠితకు కర్ణుడి తల్లి,దండ్రుల సంగతి తెలుసు. సన్నివేశంలో ఉన్న వారికి తెలియదు. కర్ణుని స్థితి పఠితలో సానుభూతిని రేకెత్తిస్తుంది. ఇది రస విషయకమైన రహస్యం అని వివరించారు. ( ఆంధ్ర మహాభారతం వ్యాఖ్యానం - తి.తి.దే.ప్రచురణ)

"వినుత ధనుర్విద్యా విదుఘను గర్ణు సహాయబడిసి కౌరవ విభుడర్జుని వలని భయము సెడి రొమ్ము న జేయుడి నిద్రవోయె ముదితాత్ముండై…"

దుర్యోధనుడు కర్ణున్ని సహాయంగా పొందాడు. తత్కారణంగా భయం చెడిన వాడయ్యాడు. ఇంక అదుపులో ఉండడనే  భావం స్ఫురిస్తోంది. దుర్యోధనుడికి శత్రు భయం లేదు . గుండెపై చేయి వేసుకొని నిద్రపోయాడు. కానీ అర్జునుడున్నాడు. ఈ అర్జునుడితో వైరం దుర్యోధనుడికి బదులు కర్ణుడికి సంక్రమించింది. ఇంక కర్ణుడికి నిద్ర పడుతుందా అని వ్యంగమే. 

ఈ విధంగా నన్నయ అక్షర రమ్యత లో భాగమైన భావ చిత్రణ, తదనుకూలమైన పదాల వినియోగం, సంభాషణాత్మక శైలి, వ్యంగ వైభవాలు అక్షర రమ్యత కి అర్థం పడుతున్నాయి.

3. నానా రుచిరార్ధ సూక్తి నిధిత్వం:

ఈ సూక్తి అనే పదం విషయంలో పండితులలో అభిప్రాయ భేదాలు ఉన్నాయి. సూక్తి అంటే మంచి మాట అనే అర్థంలో గ్రహించారు. వృత్తాంతము, సమాచారము అనేవి నిఘంటుకార్థాలు. ఏదైనా ఒక విషయాన్ని చెప్పదలచినప్పుడు హృదయంగమంగా, సంక్షిప్తంగా చెప్పే విధానాన్ని సూక్తి అనాలి.

'సూక్తి ' అనేది విశేషణం. ఈకారాంత స్త్రీలింగ శబ్దం. 'శోభనాచ సా ఉక్తి శ్చ'- సూక్తి అని దీని వ్యుత్పత్తి. శోభన తత్వం అంటే సౌందర్యం. అది ఉక్తికి చెందినది. ఉక్తికి సంబంధించిన సౌందర్యం రెండు విధాలు. ఒకటి అంతరము, రెండు బాహిరము. 'కావ్య గ్రాహ్యమలంకారాత్ సౌందర్య మలంకారాహ" అని లాక్షణికోక్తి. కాబట్టి సూక్తి అనేది అలంకారానికి పర్యాయపదం అవు తోంది. శబ్ద సౌందర్యాన్ని అక్షర రమ్యతగా స్పష్టం చేసాడు. కాబట్టి ఇక్కడ కేవల అర్థాలంకార సౌందర్యాన్నే గ్రహించాలి. ఇతిహాసానికి కావ్యత్వాన్ని కల్పించిన నన్నయ నానా రుచిరార్ధసూక్తి నిధి అనే దళాన్ని కేవలం శిరోధార్యమయ్యే మంచి మాటలకే గాక అర్థాలంకార సౌందర్యాన్ని కూడా ఆపేక్షించి వాడాడు.

ఉ.  హారి విచిత్ర హేమ కవచావృతుడున్నత చాపచారు దీ
ర్ఘోరు భుజండు, భాస్వదసితోత్పల వర్ణుడు, సేంద్ర చాప శం
పా రుచి మేఘమో యనగ, బాండవ మధ్యముడొప్పె బద్ధతూ
ణీరుడు రంగ మధ్యమున నిల్చె జనంబులు దన్ను జూడగన్.

అందమైన, విచిత్రమైన బంగారపు కవచం ధరించాడు ఆజానుబాహుడు. ఒక చేతిలో ఉన్నతమైన ధనస్సు ఉంది. మనిషి నల్ల కలువల రంగుతో కాంతులీను తున్నాడు. పసిడి రంగుతో కలిసిన మొత్తం రూపం హరివిల్లు తో మెరుపుతీగతో కూడిన నీలి మేఘంలా ఉన్నాడు అర్జునుడు. అర్జునున్ని  ఇంద్రచాపంతో కలిసి ఉన్న మెఱుపు మేఘంలా ఉత్ప్రేక్షించాడు. ఈ ఉత్ప్రేక్ష కూడా ఇంద్ర తనయుడనే విషయాన్ని స్ఫురణకు తెచ్చేలా సార్థకంగా ఉంది.

కం.  అనిన నిన తనయు పలుకులు
జనులకు విస్మయము, సవ్యసాచికి గోపం
బును సిగ్గును మరి దుర్యో
ధనునకు బ్రీతియును జేసెదత్ క్షణన మాత్త్రన్.

నువ్వు నేర్పరివి కాదు. మాకు ఆ విద్యలు తెలుసు. మేము నేర్చుకున్నాం.  నువ్వు ప్రదర్శించిన విద్యలు వీరుల మెచ్చుకొనేలా మేమూ ప్రదర్శించగలం అని కర్ణుడు అన్నాడు.ఆ మాటలు అక్కడ ఉన్న ప్రేక్షకులకి ఆశ్చర్యాన్ని, అర్జునుడికి కోపాన్ని, సిగ్గుని దుర్యోధనుడికి సంతోషాన్ని కలిగించాయి. ఇదే ఉల్లేఖాలంకారం "బహుభిర్భుహుధోల్లే ఖాదేక స్యాల్లేఖ ఇష్యతే…" అని ఉల్లేఖం లో ఒక లక్షణం. అయితే ఈ అలంకార వైచిత్రి లో కూడా నన్నయ మూలానుసారమైంది కూడా గ్రహించే అలంకారిక రచన చేశాడు.

నన్నయ యతి విశేషణాలు:

1. పృథ్వీ వృత్తము - సంస్కృతమున 8వ అక్షరము తర్వాత యతి చెప్పబడినది. కన్నడమున నాగవర్మ కూడా అట్లే చెప్పినాడు. కానీ నన్నయ తెలుగులో వడి 11వ అక్షరము తర్వాత వుంచినాడు.
2. శిఖరిణి - సంస్కృతమునందు, కన్నడమునందు 6వ అక్షరము తర్వాత యతి ఉన్నది.  కాని నన్నయ 12 వ అక్షరము తర్వాత వడి నిల్పినాడు.
3. పంచచామరమునకు - సంస్కృతమున 8 తర్వాత యతి, తెలుగున 9 తర్వాత పాటించారు.
4. తరళ వృత్తమునకు - కన్నడమున 8 వ అక్షరము తర్వాత, తెలుగు లో 11 వ అక్షరం తర్వాత వాడబడినది.

విశేషాంశాలు:

1. రచనా బంధురత: 

నన్నయ విపుల శబ్దశాసనుడు. ఆనాడు దేశీయములైన శబ్దములను, సంస్కృత శబ్దములను ఏర్చి, కూర్చి నుడికారపు సొంపులు తీర్చిదిద్దిన శబ్ధశాసనుడు.
2. విశ్వ సాహిత్య ప్రపంచంలో శబ్ధా ర్థములకు, చంధస్సుకు భిన్నమైన నాదముచే కవితా శిల్పమును నిర్మించిన మహా కవులను వేళ్లపై లెక్కించవచ్చు. ఈ మహా కవులలో నన్నయ మేరుపూస.
3. కుమారాస్త్ర విద్యా ప్రదర్శన ఘట్టం చదువుతుంటే కర్ణుడు రంగమాధ్యమాన్ని ప్రవేశించినట్టు కనబడదు. నాటకీయ శిల్పం ఆంధ్ర వాజ్మయంలో అడుగు పెట్టినట్టు తోస్తుంది.
4. నన్నయ మహాభారతాన్ని రచించే నాటికి సంస్కృత సాహిత్యంలో 'రీతి' సంప్రదాయం ప్రముఖంగా వ్యాప్తిలో ఉంది. అందువలన ఆయన తన భారత రచనలో దీనినే అనుసరించారు.
5. నన్నయ నాటికి కన్నడంలో మాత్రమే భారత రచన జరిగింది. అయితే పంపకవి రచించిన కన్నడ భారతం ఇతిహాసం కన్నా జైన పురాణ సాంప్రదాయానికి దగ్గరగా ఉంది. ఇది రాజ, రాజ నరేంద్రుని వంటి భారత కథాభిమానులకు నచ్చలేదు. అందువలననే భారతములోని మౌళిక తాత్వికతకు లోపం లేకుండా ఆ రచన చేయాలని నన్నయను కోరాడు.
6. నన్నయ  సంస్కృత చంధో రీతులను ఎక్కువగా ఇష్టపడినట్టు భారతం చెబుతోంది.
7. తెలుగులో చంపూ రచనలకు మార్గదర్శనం చేసింది నన్నయ భారతమే.
8. విశ్వనాథ సత్యనారాయణ తన రామాయణ కల్పవృక్ష అవతారిక లో "ఋషి వంటి నన్నయ రెండవ వాల్మీకి" అని కొనియాడారు. ఇది అక్షర సత్యం.

పరిశోధన గ్రంథాలు:

1. ఆంధ్ర మహాభారతం - కుమారాస్త్ర విద్యా ప్రదర్శన - పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం.
2. షష్టా శ్వాసం - ఆదిపర్వం - మహాభారతం.
3. అక్షర రమ్యత:-  డా. వి. వి. ఎల్. నరసింహారావు.
4. ఆంధ్ర మహాభారతం వ్యాఖ్యానం - తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ

శ్రీనివాసమూర్తి వి.వి.ఎల్.

AUCHITHYAM | Volume-2 | Issue-1 | January - June 2021