"తెలుగు శాఖ, స్నాతకోత్తర కేంద్రం గద్వాల, పాలమూరు విశ్వవిద్యాలయంలో నేను బోధించే సిలబస్, సిలబస్ లోని పాఠ్యాంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారం ప్రతిబింబించే వేదిక."

గంగుల శాయిరెడ్డి

 ”ప్రకృతి సౌందర్యాలను ఆస్వాదిస్తూ, సామాజిక సందపసృష్టికి కారకులైన కర్షకలోకానికి హస్తభూషణమైనది నాగలి. ఈ నాగలి కృషీవలులకు వారి పూర్వజన్మ పుణ్యపరిపాక విశేషముచేత లభించింది. హలధరుడవై, ఆయురారోగ్యాలతో ఈ ధరాతలంలో తిరుగాడే కర్షకా! నీకు హితమవుతుంది” అంటూ ఆరుగాలం చెమటోడ్చే రైతు బిడ్డను కవితా వస్తువుగా స్వీకరించి తన పద్యాలకు ద్రాక్షాపాకంలో ముంచి పాఠక హృదయ సీమలను దోచిన కవులు తెలుగు సాహిత్యంలో పలువురున్నారు. వారిలో తెలంగాణ ప్రాంతంలో హాలికుడైన పోతన్న ప్రథముడు. ఆయన కవితా వ్యవసాయాన్ని, కృషి వ్యవసాయాన్ని స్ఫూర్తిగా స్వీకరించి కవిత్వమల్లిన లబ్దప్రతిష్ఠుడైన మరో కవి గంగుల శాయిరెడ్డి. పూర్వపు వరంగల్‌ జిల్లాలోని శ్రీరామ క్షేత్రం జీడికల్లు వాస్తవ్యులు రామక్క, శివారెడ్డి దంపతులకు రామచంద్రునిగూడెం నుంచి దత్తు వచ్చిన శాయిరెడ్డి 1890లో జన్మించాడు. చిన్నతనంలోనే భారత, భాగవత రామాయణాలను తల్లిదండ్రులనుంచి విన్న శాయిరెడ్డి వాటిసారాన్ని ఒంట బట్టించుకున్నాడు. రామదాసు, అన్నమయ్య, రాకమచర్ల వేంకటదాసు ప్రభృతుల కీర్తనలను సుశ్రావ్యంగా వీనుల కింపుగా ఆలపించడం, తనకు తెలిసిన, నేర్చిన విషయా లను పలువురికి తెలియజెప్తూ తల్లిదండ్రుల సేవలోను శ్రీరామచంద్ర సేవలోనూ తరించిన ధన్యజీవి గంగుల.

జీడికల్లులోనే సంప్రదాయ వీధి బడిలో అక్షరాలు దిద్దుకొని 1916 నుంచి 1926 వరకు ఆలేరు, పెంబర్తి, కొలనుపాకలతోసహా స్వగ్రామంలోనూ వీధి బడులు నడిపి, చిన్నారులను తీర్చిదిద్దాడు. నెలసరి ఐదు రూపాయల జీవనభృతిని పొందిన శాయిరెడ్డి 1936-39ల మధ్య భువనగిరిలో వసతిగృహం ఏర్పాటు చేశాడు. పిల్లల సంరక్షణ బాధ్యతలు స్వీకరించి వారికి విద్యాబుద్ధులు నేర్పి, చుట్టుపక్కల గ్రామాల ప్రజల హృదయాలను శాయిరెడ్డి దోచు కున్నాడు. ఈ క్రమంలోనే జీడికల్లు శ్రీరామ చంద్ర ఆలయ మేనేజరుగా 1951-57 మధ్య కాలంలో స్వామివారి నిత్యకైంకర్య విధులకు లోటు రానీయక శ్రీరామచంద్రుల కృపా పాత్రుడైన శాయిరెడ్డి స్వయంగా ఆలయానికి అను బంధంగా ఒక సంస్కృత పాఠశాలను ప్రారంభించి సంస్కృతం బోధించాడు. హైదరాబాద్‌ ఆకాశవాణి కేంద్రం ప్రసారంచేసే గ్రామ స్థుల కార్యక్రమాల సలహా దారుగా, సంస్కృత పాఠశాలకు కార్యదర్శిగా పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి వారి సన్మానాన్ని (1976) వరంగల్‌ సభలో రూ. 500/- నగదు పురస్కారాన్ని అందుకొన్న నిరాడంబరుడు శాయిరెడ్డి.

ఒకవైపు వ్యవసాయం చేస్తూనే స్వయంగా కాపుబిడ్డ, వర్షయోగము, గణిత రహస్యము, జేర్పకుంటి మహాత్స్యము, వయోజనుల విద్యా వాచకాలను రచించాడు. గ్రామీణుల ఆరోగ్య పరిరక్షణ ఆసక్తితో గంగుల ప్రకృతి వైద్యం, పశువైద్యం, ఆయుర్వేద వైద్యం ఉచితంగా చేస్తూ పలువురి ప్రశంసలకు పాత్రుడయ్యాడు.

శాయిరెడ్డి తన కావ్యం ‘కాపుబిడ్డ’ను ‘వ్యవసాయ పద్యకావ్యం’ అని పేర్కొన్నాడు. ఈ కావ్యంలోని ఉత్పలమాలాదివృత్తాలు, ఆటవెలదులు, తేటగీతులు 147 ఉన్నాయి. ఈ పద్యాలన్నీ 27 నక్షత్రాలుగా విభజితమై ప్రతి నక్షత్రభాగంలో రెండునుంచి పదునాల్గు పద్యాలున్నాయి. కర్షకుల నిత్య జీవనశైలి, వారి కుటుంబం, భార్యాపిల్లలు, సమాజ జీవనము, పనిముట్లు, పాడిపంటలు, ప్రకృతి సోయగాలు, ఆహార నియమాలు, అతిథి సత్కారాలు, ఆలమందల వృషభరాజులు ఈ పద్యాలలో హృద్యంగా చిత్రితమయ్యాయి. ‘సత్యవాక్యాళిని సతతంబు బోధింప.. సద్బ్రాహ్మణుడని జగతి మెచ్చు.. విశ్వమంత వ్యాపించి వెలసినావు… కర్షకా చేతులెత్తి నే గౌరవింతు’ అంటూ రాసిన ఒక పద్యం కర్షకుల ఆంతరిక, బాహిర జీవనశైలిని కనులకు కడుతుంది. కర్షకుల ఇళ్ళు వాన నీటికి చెరువులవుతాయని, గింజలు, గుడ్డలు తడిసి ముద్దవుతాయని, గిత్తలు, గేదెలు, ఆవులు లేవలేకపోతాయని, వంట చెరుకు తడిసి నిప్పు రాజుకోక పొగలు చిమ్ముతుందని, ఇలా కాపు బిడ్డలకు వర్షాకాలంలో ఎదురయ్యే కష్టాలు ల్కెకు మిక్కిలి అంటూ చెప్పిన ‘ఇల్లిల్లు నీరయ, యిల్లాలు పిల్లలు.. కాపు బిడ్డల ఘో(గో)రముల్‌ గాంతురెవరు” అను పద్యం కాపుల జీవిత బాధలను పాఠకుల ముందుంచింది.

గంగుల అనుభవ పూర్వక నిశిత పరిశీలనాశక్తి.. విషయ విశ్లేషణా శక్తి ప్రతి పద్యంలోనూ పాఠకులను అబ్బురపరుస్తుంది. గ్రామీణుల ఆటలైన.. చిర్రగోనె, మర్రి ఊడలూగుటతోబాటు తేనెతుట్టెలు, ఎగిరే కౌజులు, పూరేళ్ళ వంటి పక్షుల వర్ణనలు శాయిరెడ్డికిగల ప్రకృతి విజ్ఞాన సంపదలను పాఠకులకు తెలియజెప్తున్నాయి.

గంగుల రాసిన ‘వర్షయోగము” సమకాలీన ఋతు పరిణామాలవల్ల ప్రకృతిలో కలిగే మార్పులు.. వానలు పడుట, పడకపోవుట, మబ్బులు వచ్చుట, విత్తనాలు చల్లుట, నాట్లు వేయుట, కోతలకు అనువైన కాలములను సవివరంగా కర్షకలోకానికి తెలిపి, అత్యధిక పంటలు పండించుటకు తోడ్పడే వారి సలహాలు ప్రాచుర్యం పొందాయి. ఇక ‘గణిత రహస్యము’ అను మరో రచన వ్యవసాయదారులకు విద్యావసరమైన గణిత పరికర్మలు, కొలమానము, దైర్ఘ్యమానము, ద్రవ్యనామము, ధాన్యము/సరుకుల మార్పిడి, మిత్తి లెక్కలు తెలిపే నిఘంటువు అని చెప్పవచ్చు. అట్లే శాయిరెడ్డి రాసిన ‘జీలెకంటి మహాత్మ్యము’ క్షేత్ర విశేషాలతో కూడిన ఒక వచన రచన.

శాయిరెడ్డి రాసిన ‘కాపు బిడ్డ’ను చదివిన ప్రఖ్యాత విమర్శకుడు కట్టమంచి రామలింగారెడ్డి ‘తమ కాపుబిడ్డను చదివి మిక్కిలి ఆనందించాను. కవిత్వము బహు బాగుగా ఉన్నది. విషయము ఉత్తమోత్తమము తమ విధేయుడ నంటూ’ ఒక లేఖలో గంగులను ప్రశంసించాడు. గాడిచర్ల, హరిసర్వోత్తమరావు, రాతి గుండెలను కూడా కరిగించగల కావ్యం కాపుబిడ్డ అంటూ గంగులను అభినందించారు. తెలంగాణమున కవులే లేరన్న వారికి సమాధానంగా సుర వరం ప్రతాపరెడ్డి (1937) తన గోల కొండ కవుల సంచికలో గంగులవారి కావ్యాన్ని గూర్చి రాస్తూ ‘మధ్యయుగ కవుల ప్రబంధ ధోరణిలోనే యింకను కవితలల్లువారు ఈ రాష్ట్రమున బహు ళమని ఇందుకు శాయిరెడ్డి గ్రంథముదా హరణమని చెప్తూ ఇందలి ప్రకృతి వర్ణన ములు శ్లేషయమకాద్యలంకారములు. సాధారణ నిఘంటువులలోకెక్కని పద సంపద మరే రచనల్లోనూ కనబడలేదని – కాపుబిడ్డ ఉత్కృష్ట కవితయని ప్రశంసించాడు.

స్వయంగా హాలికుడు, బహుముఖీన ప్రతిభా సంపన్నుడు, ప్రకృతి ప్రేమికుడు, పశువైద్య నిపుణుడుగా తెలంగాణలోనూ, కోస్తా ప్రాంతంలోనూ విస్తృతంగాపర్యటిస్తూ తన విభిన్న సంపదను పదుగురికి పంచిన శాయిరెడ్డి సమకాలీన సమాజ ఆదరాభిమానాలకు పాత్రుడయ్యాడు. ఈ మహనీయుని రచనలను ఈనాటి తరాల వారికి పరిచయం చేయాల్సిన బాధ్యత సమకాలీన సమాజం, సాహితీ సంస్థలపై ఉంది. తద్వారా కర్షక లోకానికి ఆనంద సౌభాగ్య సంపదలను అందిం చవచ్చు. అందుకే ”కర్షకానీకు శుభములు కల్గుగాక” అన్న శాయిరెడ్డిని వేనోళ్ళ కీర్తిద్దాం.

డా|| దహగాం సాంబమూర్తి

తెలంగాణ మాసపత్రిక